గిట్టుపోటు | - | Sakshi
Sakshi News home page

గిట్టుపోటు

Aug 12 2026 12:10 AM | Updated on Aug 12 2026 12:10 AM

పెరవలి: ఆరుగాలం కష్టించి పంటలను పండించే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం చాలా అవసరం. అప్పుడే వారు అన్ని రకాలుగా ముందుకు సాగుతారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విత్తు నుంచి విక్రయం వరకు అన్నదాతలకు అండగా నిలిచి, వ్యవసాయాన్ని పండగ చేశారు. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ వచ్చాక రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారు. ముఖ్యంగా ఉద్యాన పంటల రైతుల పరిస్థితి దారుణంగా మారింది. పంట దిగుబడులు బాగున్నా గిట్టుబాటు ధర లేక నష్టాల్లో మునిగిపోతున్నారు.

కొబ్బరి

జిల్లాలో 8,050 హెక్టార్లలో కొబ్బరి తోటల సాగు జరుగుతుండగా, వీటి నుంచి నిత్యం 50 లారీల సరుకును ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. రైతులతో పాటు దింపు, ఎగుమతి, దిగుమతి, వలుపు కూలీలతో పాటు వ్యాపారులు సుమారు 30 వేల మంది ఆధారపడ్డారు. ప్రస్తుతం మార్కెట్‌లో వెయ్యి కాయల ధర రూ.16 వేలు మాత్రమే పలుకుతోంది.

కోకో

కోకో పంటను జిల్లా వ్యాప్తంగా 5,517 హెక్టార్లలో సాగు చేస్తుండగా, దీనిపై సుమారు 10 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. కోకో గింజలకు మంచి డిమాండ్‌ ఉనప్పటికీ ఈ ఏడాది వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయలేదు. దీనితో రైతులు రోడ్డెక్కి ధర్నా చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో కిలో రూ.1,050 ఉంటే నేడు రూ.500 మాత్రమే పలుకుతున్నాయి.

ఆయిల్‌పామ్‌

జిల్లాలో 20,219 హెక్టార్లలో సాగు చేస్తున్న ఈ పంట నుంచి సుమారు ఒక లక్ష టన్నుల దిగుబడి వస్తుంది. దీనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 వేల మంది ఆధారపడి బతుకుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రైతులు గిట్టుబాటు ధర లభించక ఇబ్బందులు పడుతున్నారు.

అరటి

జిల్లాలోని సుమారు 7,500 హెక్టార్లలో అరటి తోట సాగు జరుగుతోంది. వీటిలో చెక్కరకేళి, కూర అరటి (బొంత), ఎర్ర చెక్కరకేళి, అమృతపాణి, కర్పూర తోటలు ఎక్కువగా ఉన్నాయి. నిత్యం జిల్లా నుంచి 40 లారీల సరుకు వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, తెలంగాణకు ఎగుమతి అవుతోంది. అరటికి ఈ ఏడాది మొదట్లో గిట్టుబాటు ధర లభించినా తర్వాత ధర పతనమైంది. మే నెలలో 10 టన్నుల లారీ రూ.2 లక్షలు పలికితే నేడు రూ.85 వేలకు పడిపోయింది. రైతులతో పాటు సుమారు 12వేల మంది అరటి తోటలపై ఆధారపడ్డారు.

జామ

జిల్లాలో సుమారు 300 హెక్టార్లలో జామ తోటలను సాగు చేస్తున్నారు. దేశవాళీ రకంతో పాటు కేజీ జామ, తైవాన్‌ జామను పండిస్తున్నారు. మార్కెట్‌లో జామ కాయలకు మంచి డిమాండ్‌ ఉన్నప్పటికీ రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు. రైతుల వద్ద కిలో జామకాయలను రూ.25 నుంచి రూ.30కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో వారందరూ నష్టాలబాటలో పయనిస్తున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో కిలో రూ.50ను కొనుగోలు చేసేవారు.

మొక్కజొన్న

జిల్లాలో 1500 హెక్టార్లలో ఖరీఫ్‌, రబీ సీజన్లలో మొక్కజొన్నను పండిస్తున్నారు. వీటికి గరప, ఎర్ర రేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి. అందుకే ఎక్కవగా లంకల్లో సాగు చేస్తారు. ప్రస్తుతం క్వింటాల్‌ మొక్కజొన్న ధర రూ.రూ.1800 మాత్రమే పలుకుతుండడంతో రైతులు నష్టపోతున్నారు. గత ప్రభుత్వంలో క్వింటాల్‌ రూ.2,600 పలికింది.

పొగాకు, ఇతర పంటలు

పొగాకు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. గత ఏడాది 10 కిలోలు రూ.3500 పలికితే, ఈ ఏడాది రూ.2500కు తగ్గిపోయింది. అలాగే పుట్టు కంద (236 కిలోలు) ధర రూ.5 వేలకు పడిపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో దాని ధర రూ.11 వేలు ఉంది. టన్ను మామిడి కాయలు రకాన్ని బట్టి రూ.15 వేల నుంచి రూ.20 వేలు పలుకుతున్నాయి. జగన్‌ ప్రభుత్వంలో వాటి ధర రూ.25 వేల నుంచి రూ.35 వేలు ఉండేది.

పంట ఉత్పత్తులకు లభించని గిట్టుబాటు ధర

నష్టాల బాటలో ఉద్యాన రైతులు

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ప్రోత్సాహం

నేడు పట్టించుకోని చంద్రబాబు సర్కార్‌

64,536 హెక్టార్లలో సాగు

జిల్లాలో వాణిజ్య పంటలైన కొబ్బరి, కోకో, ఆయిల్‌పామ్‌, మామిడి, జామ, కంద, పసుపు, బొప్పాయి, నిమ్మ, తమలపాకులు, జీడిమామిడితో పాటు కూరగాయలను సుమారు 64,536 హెక్టార్లలో పండిస్తున్నారు. దాదాపు 90 వేల మంది రైతులు సాగు చేస్తుంటే, వీటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి మరో మూడు లక్షల మంది జీవిస్తున్నారు. ఇక్కడి నుంచి తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, కోల్‌కతా, ఒడిశా, బీహార్‌ తదితర రాష్ట్రాలకు ఎగుమతులు జరుగుతాయి. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ప్రతి పంటకు ముందస్తుగానే గిట్టుబాటు ధర నిర్ణయించి, పంట చేతికొచ్చే సమయానికి కొనుగోలు ప్రారంభించేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడంతో అన్నదాతలు అప్పుల పాలవుతున్నారు.

దారుణం

కోకో పంట దిగుబడి బాగున్నా వ్యాపారస్తులు సిండ్‌కేట్‌గా మారి ధర తగ్గించేశారు. గతంలో కిలో రూ.1,050 పలికితే నేడు రూ.500 మాత్రమే వస్తోంది. ఇంత దారుణం ఎప్పుడూ లేదు.

– వాకలపూడి సూర్యారావు,

రైతు, కానూరు

నష్టమే మిగిలింది

క్వింటాల్‌ మొక్కజొన్న ధర గతేడాది రూ.2,600 ఉంటే నేడు రూ.2200కు తగ్గిపోయింది. దీనితో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాం. ఇలా జరిగితే సాగు చేయడం కష్టమే.

– కంటిపూడి సూర్యనారాయణ,

రైతు, తీపర్రు

ధరకు కోత

అరటి పంట తీవ్ర నష్టాలను మిగిల్చింది. తోటలు అమ్మకాలు చేసినప్పుడు మంచి ధర లభించింది కానీ నేడు మార్కెట్‌లో ధరలు పతనం కావడంతో సగానికి కోతలు విధిస్తున్నారు.

– పెనుమత్స వెంకట గోపాలకృష్ణంరాజు,

అరటి రైతు, ఖండవల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement