అందుకేనా హైదరాబాద్‌కు?
కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ప్రియాంకను స్వతంత్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిపుణులైన వైద్యులతో చికిత్స అందించారు. ఈ దారుణాన్ని సాక్షి మొదటిసారి వెలుగులోకి తీసుకువచ్చింది. అనంతరం, సోషల్ మీడియాలో కారు ఢీకొన్న ఘటన వీడియో క్లిప్పింగ్‌లు హల్‌చల్ చేయడంతో విద్యార్థి వర్గాలు ఆవేదన, ఆపై ఆగ్రహంతో రగిలిపోయాయి. ఇది మరింత ముదిరి ఆందోళనకు దారి తీస్తుందనే భయంతోనే ప్రియాంకను మెరుగైన చికిత్స పేరుతో హైదరాబాద్‌కు పంపించారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రధాన ఆసుపత్రి అయిన జీఎల్‌ఎస్ ట్రస్టు ఆ మాత్రం వైద్యం అందించలేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆమెను ఉద్దేశపూర్వకంగానే ఇక్కడి నుంచి తరలించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వైద్య విద్యార్థిని ప్రియాంకను ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టడం.. రోజుల తరబడి మృత్యువుతో పోరాడి ఆమె మృతి చెందిన ఘటనలో ఎన్నో ప్రశ్నలు ఇప్పటికీ జవాబు లేనివిగానే కనిపిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం కలిగించిన ఈ దారుణం రాజమహేంద్రవరం ప్రసాదిత్య మాల్ వద్ద ఈ నెల 3వ తేదీ రాత్రి చోటు చేసుకుంది. ఆ తర్వాత మూడు రోజుల పాటు ఈ విషయం వెలుగులోకి రాలేదు. దీనికి తెర వెనుక అధికార పార్టీ నగర నాయకులు కథ నడిపారనే విమర్శలు వచ్చాయి. వారెవరనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు ఈ అపవాదును తుడుచుకునేందుకు అటు పోలీసులు, ఇటు నగర ప్రజాప్రతినిధులు పోటీ పడిన తీరుపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రియాంక తీవ్రంగా గాయపడి, చావుబతుకుల్లో ఉన్నా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఆమె బంధువులు ఈ నెల 5వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో సాక్షికి ఈ సమాచారం అందించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తెర వెనుక వ్యక్తులెవరు?
ఆ రోజు ప్రసాదిత్య మాల్ వద్ద సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసెఫ్ ఎడ్వర్డ్ మద్యం తాగి, తమ కారుతో ప్రియాంక ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఉద్దేశపూర్వకంగానే మూడుసార్లు ఢీకొన్నారు. అనంతరం, ఆమె తలపై నుంచి కారు ఎక్కించి, అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు. ఈ ఘోరంపై అదే రోజు రాత్రి పోలీసులకు సమాచారం అందింది. ఆ రోజు రాత్రి స్థానిక స్వతంత్ర ఆసుపత్రికి వెళ్లి, ఈ సంఘటనలో గాయపడిన ప్రియాంక స్నేహితుడి వాంగ్మూలం సేకరించారు. ప్రియాంకను ఢీకొన్న వెంటనే అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయిన కారును పోలీసులు ఆ మర్నాడు కానీ సీజ్ చేయలేదు. తీవ్రమైన ఈ సంఘటన సమాచారాన్ని పోలీసులు తొలుత బహిర్గతం చేయలేదు. దీంతో, కొంత మంది కూటమి నాయకులు వారిపై ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు వచ్చాయి. ఈ దారుణాన్ని చిన్న ప్రమాదంగా కూడా చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయని, దీని వెనుక ఉన్న పెద్దలెవరనే ప్రశ్నలు సర్వత్రా వస్తున్నాయి. ఆ సమయంలో దర్యాప్తు అధికారికి వచ్చిన ఫోన్లపై సైతం పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివాదం పెద్దది అవుతూండటంతో పోలీసులు ఎట్టకేలకు నిందితుల్ని అరెస్టు చేసి, ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేసి, స్టేషన్ వద్ద ప్రదర్శనకు పెట్టారు. ఆ సమయంలో కారు నంబర్ ప్లేట్ కూడా లేకపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు నిందితులు ప్రయత్నించారనే విషయం స్పష్టమవుతోంది. ప్రసాదిత్య మాల్‌లో సీసీ కెమెరాల్లో ఈ సంఘటన నమోదై ఉండకపోతే ఈ సంఘటన వెలుగులోకే వచ్చేది కాదని పలువురు అంటున్నారు.
ఒకరిపై ఒకరు నింద వేస్తూ..
కారు ఢీకొన్న సమయంలో అక్కడే కొందరు మీడియా ప్రతినిధులున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. వారెవరనేది కూడా పోలీసులు తేల్చాల్సి ఉంది. నిందితుల్లో ఒకరు విదేశాలకు వెళ్లాల్సి ఉండటంతో.. ఉద్దేశపూర్వకంగానే ఈ దారుణ ఘటనలో అలసత్వం ప్రదర్శించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనను చిన్నదిగా చూపించేందుకు ఎవరి ప్రయత్నం వారు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక లక్షల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రియాంక తండ్రి విలేకర్లతో మాట్లాడిన రోజే ఆయనను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు హడావుడిగా హైదరాబాద్‌కు వెంట పెట్టుకుని వెళ్లారని, దీనిలో ఆంతర్యమేమిటనే ప్రశ్న కూడా జవాబు లేనిదిగానే మిగిలింది. ఈ సంఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిగితేనే అసలు విషయాలన్నీ వెలుగులోకి వస్తాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ప్రియాంక స్కూటీని ఢీకొంటున్న కారు (సీసీ కెమెరా చిత్రం) నిందితులు ధస్వంత్, జోసెఫ్ ఎడ్వర్డ్
ఫ డాక్టర్ ప్రియాంక మరణం
వెనుక జవాబు లేని ప్రశ్నలెన్నో..
ఫ ఈ నెల 3న కారుతో
ఢీకొట్టిన నిందితులు
ఫ మూడు రోజుల పాటు
వెలుగులోకి రాని ఘటన
ఫ దీనిపై సర్వత్రా అనుమానాలు
ఫ చిన్న ప్రమాదంగా చిత్రీకరించేందుకు
ప్రయత్నించిన పెద్దలెవరో?


