రాజానగరం: ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అతి పెద్దదిగా పేరొందింది. దీనికి 415 అనుబంధ కళాశాలతో పాటు 73 పీజీ సెంటర్లు, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి. సుమారు 2.25 లక్షల మంది విద్యార్థులు ఈ వర్సిటీలో ఉన్నత విద్య చదువుకుంటున్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ కళాశాలలో రెగ్యులర్ సిబ్బందితో పాటు ఔట్‌సోర్సింగ్ విధానంలో 170 మంది వరకూ నాన్ టీచింగ్ సిబ్బంది, అడ్‌హాక్ (తాత్కాలిక) పద్ధతిలో 125 మంది వరకూ టీచింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. వీరందరూ డిగ్రీలు, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివారు. ఐదు నుంచి 20 సంవత్సరాల సర్వీసు ఉన్నవారే. వీరి విధులు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా.. ఒక్కోసారి అంతకు మించి ఉంటుంది. కానీ, రెగ్యులర్ ఉద్యోగుల జీతాలు లక్షల రూపాయల్లో ఉండగా.. తమకు చాకిరీ ఎక్కువ. జీతాలు మాత్రం గొర్రెతోక బెత్తెడు చందమేనని వీరు ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో కుటుంబాలను పోషించుకోవడానికి, పిల్లలను చదివించుకోవడానికి వీరు నానా కష్టాలూ పడుతున్నారు. వీరిలో ఎక్కువ సర్వీసు అంటే రెండు దశాబ్దాల నుంచి పని చేస్తున్న వారిలో చాలామంది వయస్సు ఇప్పటికే 50 సంవత్సరాలు దాటింది. ఈ క్రమంలో ఇప్పటికై నా సర్వీసులు రెగ్యులర్ కాకపోతే వీరందరూ చిరుద్యోగులుగానే రిటైర్ కావలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమ సర్వీసు రెగ్యులర్ చేయాలన్నది వీరి చిరకాల డిమాండ్. అయితే, దీనిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా వారి స్థానంలో కాంట్రాక్టు పద్ధతిలో కొత్తవారిని నియమించేందుకు టెండర్ నోటీసు జారీ చేసింది. దీనిపై ఆ చిరుద్యోగులు భగ్గుమంటున్నారు. ఎప్పటికై నా తమను రెగ్యులర్ చేస్తారని, ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశ పడుతూంటే.. ఉన్న ఉద్యోగాలకే ఎసరు పెట్టేలా తీసుకుంటున్న చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, వర్సిటీ పాలకుల తీరును నిరసిస్తూ నన్నయ వర్సిటీ ముఖద్వారం వద్ద ఆరు రోజులుగా మొక్కవోని పట్టుదలతో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.
స్పందించని ప్రభుత్వం
తమను యూనివర్సిటీ ఉద్యోగులుగా గుర్తించిన తరువాతనే కొత్త సిబ్బంది నియామకానికి టెండర్లు పిలవాలని ఔట్‌సోర్సింగ్, అడ్‌హాక్ ఉద్యోగులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకూ దీక్షలను విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. వారు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం ఆరో రోజుకు చేరుకున్నాయి. ఆందోళన చేస్తున్న చిరుద్యోగులతో రాజమహేంద్రవరం ఆర్‌డీఓ శివరాముడుతో కలిసి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి చర్చలు జరిపారు. రెండు దశాబ్దాలుగా తక్కువ జీతాలతో పని చేస్తున్న తమకు న్యాయం చేయాలని, ముందుగా ప్రస్తుతం జారీ చేసిన టెండరు నోటీసు రద్దు చేయాలని, తమను వర్సిటీ ఉద్యోగులుగా గుర్తించాలన్నవే తమ ప్రధాన డిమాండ్లని వారు స్పష్టం చేశారు. అప్పటి వరకూ దీక్షలు విరమించేది లేదని స్పష్టం చేశారు. వారికి అధికారులు ఎటువంటి సమాధానం చెప్పకుండానే వెనుదిరిగారు. దీంతో, ఆ ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
నాయకుల సంఘీభావం
ఉద్యోగ భద్రత కోసం నన్నయ వర్సిటీ వద్ద సిబ్బంది చేస్తున్న రిలే దీక్షలను స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మంగళవారం సందర్శించారు. వారి సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా రెండు రోజుల క్రితం ఆందోళనకారులకు సంఘీభావం తెలిపారు. వారి న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. సమస్య పరిష్కారానికి ప్రతిపక్షంగా తన మద్దతు ఇస్తానని భరోసా ఇచ్చారు.
ఫ నన్నయ వర్సిటీలో రోడ్డెక్కిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు
ఫ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్
ఫ రెండు దశాబ్దాల శ్రమకు
గుర్తింపు దక్కలేదని ఆవేదన
ఫ ఆరో రోజుకు చేరిన రిలే దీక్షలు
డిగ్రీలు చదువుకుని.. చిప్ప చేత పట్టుకుని తిరగలేక.. జానెడు పొట్ట నింపుకొనేందుకు.. కుటుంబాన్ని పోషించుకునేందుకు.. ఆ చిన్నపాటి ఉద్యోగంలో చేరారు.. చాలీచాలని జీతమే అయినా.. ఎప్పటికై నా తమ తలరాతలు మారకపోతాయా అనే ఆశతో కాలం వెళ్లదీస్తున్నారు. రెండు దశాబ్దాలు గడిచినా వారు కలలుగన్న బంగారు భవిష్యత్తు అందని ద్రాక్షగానే మిగిలింది. వెట్టిచాకిరీ చేస్తున్నా పరిస్థితిలో ఎటువంటి మార్పూ లేకపోగా..
చంద్రబాబు సర్కారు తీసుకున్న పిడుగుపాటులాంటి నిర్ణయంపై మండిపడుతూ ఆ చిరుద్యోగులు పిడికిళ్లు బిగించి, ఉద్యమ బాట పట్టారు.
భవిష్యత్తు కోసమే పోరాటం
ఇచ్చే జీతాలు తక్కువైనా భవిష్యత్తులో రెగ్యులర్ కాకపోతాయా అనే ఆశతోనే సంవత్సరాల తరబడి చాకిరీ చేస్తున్నాం. అయినా మాపై పాలకులు, అధికారులు దయ చూపడం లేదు. చేస్తున్న చాకిరీకి కనీస వేతనం కూడా ఇవ్వకుండా పనులు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో టెండర్ నోటీసు జారీ చేయడంతో భవిష్యత్తు కోసం పోరుబాట పట్టక తప్పలేదు.
– నాగారాపు విజయబాబు, అధ్యక్షుడు,
యూనివర్సిటీ నాన్ టీచింగ్ (ఔట్‌సోర్సింగ్) సంక్షేమ సంఘం
చిరుద్యోగిగానే రిటైర్ కావాలా?
నాకు ఇప్పటికే 53 సంవత్సరాలు వచ్చేశాయి. 20 సంవత్సరాల నుంచి యూనివర్సిటీలో పని చేస్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఇస్తున్న జీతాల్లో పెద్దగా పెరుగదల లేదు. కానీ, వయస్సు మాత్రం రిటైర్‌మెంట్‌కు చేరువవుతోంది. ఇలాగే రిటైరవుతాననే భయం ఈమధ్య బాగా వేధిస్తోంది.
– జి.మిల్టన్ కుమార్, ఔట్‌సోర్సింగ్
నాన్ టీచింగ్ ఉద్యోగి, రాజమహేంద్రవరం


