రాజమహేంద్రవరం సిటీ: స్థానిక ప్రసాదిత్య మాల్ వద్ద ఈ నెల 3న మద్యం మత్తులో ఇద్దరు యువకులు కారుతో ఢీకొన్న ఘటనలో మృతి చెందిన మెడికో ప్రియాంక కుటుంబానికి చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం తమకు కలగడం లేదని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని వైద్య విద్యార్థులతో కలిసి మంగళవారం సాయంత్రం స్థానిక శ్యామలా నగర్ రామాలయం జంక్షన్ నుంచి ప్రసాదిత్య మాల్ వరకూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడానికి ఆయన పిలుపునిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు జాతీయ రహదారిలోని ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఆయన నివాసం వద్దకు భారీ ఎత్తున చేరుకుని ఈ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో, ఆయన మెడికోలతో కలసి అక్కడే ప్లకార్డులతో శాంతియుత ప్రదర్శన నిర్వహించారు.
పోలీసుల తీరు సరికాదు
ఈ సందర్భంగా భరత్‌రామ్ మాట్లాడుతూ, ఇద్దరు వ్యక్తుల వల్ల ప్రియాంక అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిందని, దీనిపై శాంతియుతంగా కొవ్వొత్తుల ప్రదర్శనకు కూడా అవకాశం ఇవ్వకపోవడం దారుణమంటూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాల్సిన పోలీసులు ఈవిధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ నెల 3న ఈ ఘటన జరిగితే ఆరో తేదీ వరకూ నిందితులు ఎక్కడున్నారు? వారికి ఎవరు ఆశ్రయం కల్పించారనే విషయం నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. కేసు విచారణ అధికారిగా ఉన్న ప్రకాష్ నగర్ సీఐ బాజీలాల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ దారుణాన్ని పోలీసులు ఏదో చిన్న కేసుగా, నిర్లక్ష్యపు యాక్సిడెంట్‌గా సెక్షన్లు పెట్టి వదిలేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. ప్రసాదిత్య మాల్ చుట్టుపక్కల అన్నివైపులా సీసీ కెమెరాలున్నాయని, నిందితులు ఆ మూడు రోజులూ ఎక్కడున్నారు? ఎటువైపు వెళ్లారనే వివరాలు తెలుసుకునే అవకాశం ఉన్నా పోలీసులు ఆ దిశగా ఎందుకు ప్రయత్నం చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్న తమపై అన్యాయంగా, అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంకను హత్య చేసిన నిందితులకు కఠిన శిక్షలు వేసి, ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకూ వైఎస్సార్ సీపీ అండగా నిలబడి పోరాడుతుందని భరత్‌రామ్ స్పష్టం చేశారు.
వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ కో ఆర్టినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రియాంక కుటుంబానికి న్యాయం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తమకు కనిపించడం లేదని ధ్వజమెత్తారు. ఒక మెడికో ఇంత దారుణంగా హత్యకు గురైతే పోలీసులు ఇప్పటి వరకూ సరిగ్గా స్పందించలేదని, ఇప్పటికీ నిర్లక్ష్యం విడనాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక మృతిపై సమగ్ర దర్యాప్తు చేసి, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కష్టపడి మెరిట్ సీట్ తెచ్చుకుని, డాక్టర్ కోర్సు చదువుతున్న ప్రియాంకను దుర్మార్గులు పొట్టన పెట్టుకున్నారని, ఆమె తల్లిదండ్రుల వేదన ఎవ్వరూ తీర్చలేనిదని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దాసి వెంకటరావు, తిరగాటి దుర్గారావు, పలువురు వైద్య విద్యార్థులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఫ ప్రియాంక మరణానికి సంతాపంగా
చేపట్టిన శాంతియుత ప్రదర్శనను
అడ్డుకోవడం దుర్మార్గం
ఫ మాజీ ఎంపీ మార్గాని
భరత్‌రామ్ ఆగ్రహం
ఫ ప్రకాష్ నగర్ సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్
ఫ నిందితులకు కఠిన శిక్షలు పడే వరకూ
పోరాడతామని స్పష్టీకరణ


