సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకురాలు కె.మాధవీలత బుధవారం రాజమహేంద్రవరం రానున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాపై క్లెయిములు, అభ్యంతరాలను ఆమె పరిశీలిస్తారని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో ఉదయం 11.30 గంటలకు కలెక్టరేట్‌లో సమావేశమవుతారని పేర్కొన్నారు. దీనికి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరు కావాలని కలెక్టర్ కోరారు. సమావేశం అనంతరం మాధవీలత క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారన్నారు.
సముద్రంలోకి
1.53 లక్షల క్యూసెక్కులు
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి మంగళవారం 1,53,810 క్యూసెక్కుల గోదావరి మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులు ఉంది. ఎగువన కాళేశ్వరంలో 5.56 మీటర్లు, పేరూరు 9.53, దుమ్ముగూడెం 6.80 మీటర్లు, భద్రాచలంలో 19.60 అడుగులు, కూనవరంలో 9.32 మీటర్లు, కుంట 5.08, పోలవరం 6.31, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 13.95 మీటర్లుగా గోదావరి నీటిమట్టాలు నమోదయ్యాయి.
ముందస్తు ప్రణాళికతో
సాగు చేయాలి
రంగంపేట: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశమున్నందున రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ప్రాంతానికి, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా నష్టాలను అధిగమింవచ్చని అన్నారు. రంగంపేట ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కిసాన్ మేళా–రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకష్ణారెడ్డితో కలసి ఆమె పాల్గొన్నారు. వాతావరణ ఆధారిత పంటల ఎంపిక, నీటి పొదుపు, సహజ వ్యవసాయం, మైక్రో ఇరిగేషన్ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు కేవలం వరి పైనే ఆధారపడకుండా తక్కువ నీటితో సాగయ్యే పప్పుధాన్యాలు, మెట్ట ప్రాంతాలకు అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కలెక్టర్ సూచించారు. యూరియాను అధికంగా వినియోగించడం వల్ల తాత్కాలికంగా పైరు పచ్చగా కనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో నేల సారం తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక సహాయకుల ద్వారా డ్రిప్, స్ప్రింక్లర్ సేద్య పద్ధతులకు సబ్సిడీపై దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. రంగంపేట మండలంలో అర్హులైన ప్రతి రైతుకు మైక్రో ఇరిగేషన్ సదుపాయాలు శాచ్యురేషన్ విధానంలో అందిస్తామని చెప్పారు. వర్షాభావ పరిస్థితుల్లో పంట బీమా రైతుకు రక్షణ కవచంగా నిలుస్తుందని కలెక్టర్ తెలిపారు. తొలుత చండ్రేడు, పెదరాయవరం గ్రామాల్లోని రైతు బిక్కిన సత్యనారాయణ పొలాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బి.వెంకటేశ్వరరావు, ఏపీఎంఐపీ పీడీ ఎ.దుర్గేశ్, డీపీఎం బి.తాతారావు తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి సత్యదేవుని
జయంత్యుత్సవాలు
అన్నవరం: సత్యదేవుని జయంత్యుత్సవాలకు అన్నవరం దేవస్థానం ముస్తాబైంది. గురువారం నుంచి రెండు రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. తొలి రోజు ఉదయం 8.30 గంటలకు ఆలయంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలతో వేడుకలు మొదలవుతాయి. ఈసారి సత్యదేవుని జన్మ నక్షత్రం మఖ కూడా స్వామివారి జయంత్యుత్సవం నాడు రావడం విశేషం. శుక్రవారం తెల్లవారుజామున సత్యదేవుడు, అమ్మవార్లకు, శివలింగానికి పంచామృతాలతో మహాన్యాసపూర్వక అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకూ జపతపాలు, పారాయణలు, మూలమంత్ర జపాలు నిర్వహిస్తారు. సత్యదేవుని జయంత్యుత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం 20 మంది పండితులను ఘనంగా సత్కరించనున్నారు. ఉత్సవాల సందర్భంగా స్వామివారి ఆలయం, రాజగోపురాలు, రామాలయం, ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు.


