తప్పుకో లోకేశ్‌! | - | Sakshi
Sakshi News home page

తప్పుకో లోకేశ్‌!

Aug 8 2026 12:23 AM | Updated on Aug 8 2026 12:23 AM

ప్రభుత్వం దిగి వచ్చే వరకూ ఉద్యమిస్తాం

డీఎస్సీ నియామకాల్లో జరిగిన అన్యాయంపై యువత, నిరుద్యోగులు నిలదీస్తూంటే వారి ఆత్మాభిమాన్ని దెబ్బ తీసేలా పాలకులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. తప్పులను ప్రశ్నించడం నేరమన్నట్టుగా దాడి చేయిస్తున్నారు. ప్రజలకు వ్యతిరేకంగా పాలన సాగించిన ఏ ప్రభుత్వమూ ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. చంద్రబాబు ప్రభుత్వ తప్పిదాలను ప్రజలతో కలసి ఎండగడతాం. డీఎస్సీ అక్రమాలపై పాలకులు దిగి వచ్చేంత వరకూ ఉద్యమం కొనసాగిస్తాం.

– జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌

సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు

ముమ్మాటికీ దగా డీఎస్సీనే..

చంద్రబాబు, లోకేశ్‌ ఎంత డప్పు కొట్టుకున్నా ఇది దగా డీఎస్సీనే. ఎంతో ఆశతో పరీక్షలకు సిద్ధమైన నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆటలాడుకోవడం సరికాదు. స్పోర్ట్స్‌ కోటా పేరిట జీఓలు మార్చేసి, ఒక్కో ఉద్యోగాన్ని రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు అమ్మేసుకున్నారు. ఈ అక్రమాలన్నింటికీ మంత్రి లోకేశ్‌దే బాధ్యత. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసినట్టే.. లోకేశ్‌ కూడా తక్షణమే రాజీనామా చేయాలి. అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకూ పోరాడతాం.

– డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌, వైఎస్సార్‌ సీపీ

రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి

డీఎస్సీ స్కామ్‌పై వైఎస్సార్‌ సీపీ

పోరు ఉధృతం

నియోజకవర్గాల్లో రెండో రోజూ

రిలే దీక్షలు

సాక్షి, రాజమహేంద్రవరం: డీఎస్సీ స్కామ్‌లో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ పాత్ర కీలకమని.. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. స్పోర్ట్స్‌ కోటా జీఓలను అనుకూలంగా మార్చేసుకుని కావాల్సిన వారికి ఉద్యోగాలిచ్చేసుకున్నారని.. నియామకాలు పూర్తి కాగానే మళ్లీ జీఓలు మార్చేశారని మండిపడ్డారు. అక్రమాలు జరగడం వల్లే డీఎస్సీ నిర్వహణపై సీబీఐ విచారణకు చంద్రబాబు ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని అన్నారు. డీఎస్సీ స్కామ్‌కు వ్యతిరేకంగా వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు సాగిస్తున్న పోరులో భాగంగా రెండో రోజైన శుక్రవారం కూడా నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. యువతతో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని చంద్రబాబు ప్రభుత్వ దురాగతాలపై నినదించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. రాజానగరం బస్టాండ్‌ వద్ద మాజీ ఎమ్మెల్యే, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. వైఎస్సార్‌ సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కొవ్వూరు బస్టాండ్‌ సెంటర్‌ వద్ద నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ తలారి వెంకట్రావు ఆధ్వర్యాన చేపట్టిన దీక్షలో పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. మండపేట పట్టణంలో రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పర్యవేక్షించారు. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలులో దీక్షలను వైఎస్సార్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి దీక్షధారులకు కండువాలు వేసి ప్రారంభించారు.

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి

కడియం: ఎటువంటి అక్రమాలూ జరగలేదనే ధై ర్యం ఉంటే డీఎస్సీ నిర్వహణలో నిజాయితీని ని రూపించుకునేందుకు సీబీఐ విచారణ జరిపించా లని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. డీఎస్సీ అక్రమాలపై పార్టీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలను కడియంలో శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడు తూ, చంద్రబాబు ప్రభుత్వం పేకాటను సైతం క్రీడల కోటా లో చేర్చి, ఆ క్రీడాకారులకు ఉపాధ్యాయులుగా ఉద్యోగాలి చ్చిందని విమర్శించారు. ఇదే విషయా న్ని వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించి సీబీఐ విచారణకు డిమాండ్‌ చేశారని అన్నారు. డీఎస్సీ మోసాలకు విద్యా శాఖ మంత్రి లోకేష్‌ బాధ్యత వహించాలని వేణు డిమాండ్‌ చేశారు. ఈ అక్రమాలపై ప్రజలు, ప్రతిపక్షం ఏకమై నిలదీస్తూండటంతో విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. మెగా డీఎస్సీ దగాపై విజయవాడ, యాడికిలో టెంట్లు వేసి రిలే నిరాహార దీక్షలు చేస్తువారిపై టీడీపీ మూకలు దారుణమైన దాడులకు దిగాయని మండిపడ్డారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై కోడిగుడ్లతో దాడి చేయడం హేయమన్నారు. రాళ్లు వేయడం, మూత్రం పోయడం వంటి చర్యలతో చంద్రబాబు అరాచక పాలన పరాకాష్టకు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని యావత్‌ బ్రాహ్మణ సమాజం, యువతపై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement