గ్రీన్‌ కారిడార్లు సిద్ధం చేయాలి | - | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ కారిడార్లు సిద్ధం చేయాలి

Aug 8 2026 12:23 AM | Updated on Aug 8 2026 12:23 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు, అగ్నిమాపక, పోలీసు వాహనాలు నిరాటంకంగా వెళ్లేందుకు ప్రత్యేక గ్రీన్‌ కారిడార్లను సిద్ధం చేయాలని కలెక్టర్‌ కీర్తి చేకూరి, ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ సూచించారు. పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నగరంలోని ప్రధాన రహదారులను వారు శుక్రవారం పరిశీలించారు. ఐఎల్‌టీడీ జంక్షన్‌, గూడ్స్‌ గేట్‌, నందం గనిరాజు సెంటర్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించి ట్రాఫిక్‌ నిర్వహణ, వాహనాల మళ్లింపు, పార్కింగ్‌, భక్తుల నడక మార్గాలు, అత్యవసర సేవల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. పుష్కరాల సమయంలో అమలు చేయనున్న రూట్‌ మ్యాప్‌ను పరిశీలించి, అవసరమైన మార్పులు, మెరుగుదలకు సూచనలు చేశారు. రెవెన్యూ, మున్సిపల్‌, పోలీసు, ట్రాఫిక్‌, ఆర్‌అండ్‌బీ శాఖలు సమన్వయంతో పని చేసి, ప్రతి జంక్షన్‌ వద్ద స్పష్టమైన బాధ్యతలను నిర్ణయించాలని ఆదేశించారు. పుష్కరాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ప్రధాన కూడళ్ల వద్ద అదనపు ట్రాఫిక్‌ సిబ్బందిని నియమించి, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ వై.మేఘస్వరూప్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ రాహుల్‌ మీనా, అదనపు ఎస్పీ పాటిల్‌ దేవరాజ్‌ మనీష్‌, ట్రాఫిక్‌ డీఎస్పీ శ్రీకాంత్‌, పుష్కర్‌ డిప్యూటీ కలెక్టర్‌ మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

రెండో రోజు టెట్‌ ప్రశాంతం

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) రెండో రోజైన శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. స్థానిక రాజీవ్‌గాంధీ గ్రూప్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌లోని ఇయాన్‌ డిజిటల్‌ జోన్‌లో రెండు సెషన్లలో తెలుగు పేపర్‌–1 పరీక్ష జరిగిందని జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈఓ) కె.వాసుదేవరావు తెలిపారు. సెషన్‌–1కు 940 మందికి గాను 850 మంది, సెషన్‌–2కు 939 మందికి గాను 819 మంది చొప్పున అభ్యర్థులు హాజరయ్యారని వివరించారు. మొత్తం 210 మంది గైర్హాజరయ్యారన్నారు. పరీక్ష కేంద్రాన్ని రాష్ట్ర పరిశీలకుడు వై.రాఘవరెడ్డి సందర్శించారు. డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లుగా అర్బన్‌ ఎంఈఓ ఎంవీఎం సుబ్రహ్మణ్యం, గెజిటెడ్‌ హెడ్మాస్టర్లు కోలా సత్యనారాయణ, జీవీవీఎస్‌ గణపతిరావు వ్యవహరించారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని

కలిసిన కలెక్టర్‌

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునేద్‌ అహ్మద్‌ మౌలానాను జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఆయన చాంబర్‌లో కలెక్టర్‌ కీర్తి చేకూరి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా పరిపాలన, న్యాయ సేవల విస్తరణ, ప్రజలకు అందుతున్న సేవల సమన్వయం వంటి అంశాలపై చర్చించారు. పరస్పర సహకారంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సమన్వయంతో పని చేయాలని ఈ సందర్భంగా మౌలానా వ్యక్తం చేశారు. ఆయనకు కలెక్టర్‌ మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, ప్రజా ప్రయోజన కార్యక్రమాల అమలులో న్యాయవ్యవస్థతో సమన్వయం కొనసాగుతుందని చెప్పారు.

దిశ బిల్లు రద్దుతో చీకటి రోజులు

పిఠాపురం రూరల్‌: దిశ బిల్లును రద్దు చేయడం అంటే, మహిళా లోకానికి చీకటి రోజులు తీసుకు రావడమేనని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత అన్నారు. మహిళలకు భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మకంగా దిశ బిల్లు తెచ్చారని, ప్రమాద సమయంలో ఫోన్‌ ఊపితే చాలు 15 నిమిషాల్లో పోలీసులు అక్కడికి వచ్చి రక్షించేవారని గుర్తు చేశారు. ఈ బిల్లును రద్దు చేసిన కూటమి ప్రభుత్వానికి మహిళల రక్షణపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందన్నా రు. రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో కారుతో ఢీకొట్టి వైద్య విద్యార్థిని ప్రియాంక మరణానికి కారణమైన ఇద్దరు దుర్మార్గులను ఉరి తీయాలని సుజాత డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement