ప్రశాంతంగా బతికే పరిస్థితి లేదు
చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రాజమహేంద్రవరం నగర ప్రజలు ప్రశాంతంగా బతికే పరిస్థితి లేదు. ఇద్దరు యువకులు మద్యం మత్తులో అత్యంత దారుణంగా, ఉద్దేశపూర్వకంగా ప్రియాంకను ఢీకొట్టినా ప్రభుత్వం నుంచి ఎవ్వరూ స్పందించ లేదు. నగరంలో నివసిస్తున్న ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ఈ ఘటనపై స్పందించకపోవడం దారుణం. నిందితులను రక్షించేందుకే తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. చారిత్రక నగరాన్ని బ్లేడ్ బ్యాచ్‌కు, గంజాయి ముఠాలకు అడ్డాగా మార్చేశారు. – మార్గాని భరత్‌రామ్, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి
● విచ్చలవిడిగా మద్యం,
గంజాయి అమ్మకాలు
● రాజమహేంద్రవరంలో
రెచ్చిపోతున్న ఆకతాయిలు
● తాజాగా వైద్య విద్యార్థినిని బలి
తీసుకున్న ఇద్దరు యువకులు
● నోరు మెదపని కూటమి ప్రజాప్రతినిధులు
● చారిత్రక నగరంలో
ప్రశ్నార్థకమైన శాంతిభద్రతలు
సాక్షి, రాజమహేంద్రవరం: పావన గోదావరి తీరాన వెలసిన చారిత్రక నగరం.. రాజమహేంద్రవరంలో శ్రీమత్తోశ్రీన్మాదులు పేట్రేగిపోతున్నారు. కూటమి సర్కారులో విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యం, గంజాయి తాగుతూ రెచ్చిపోతున్నారు. తాజాగా స్థానిక ఏవీ అప్పారావు రోడ్డులో ప్రసాదిత్య మాల్, మల్టిప్లెక్స్ థియేటర్ వద్ద వైద్య విద్యార్థిని ప్రియాంకను ఇద్దరు దుర్మార్గులు మద్యం మత్తులో ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టి, హతమార్చిన దారుణ సంఘటన నగరంలో శాంతిభద్రతలను ప్రశ్నార్థకం చేసింది. ఈ అమానుష ఘటనపై స్థానిక కూటమి ప్రజాప్రతినిధులు మౌనవ్రతం పాటిస్తున్నారు. రాజమండ్రి సిటీ, రూరల్, రాజానగరం ఎమ్మెల్యేలతో పాటు మంత్రి, ఎమ్మెల్సీ, ఎంపీ రాజమహేంద్రవరంలోనే నివసిస్తున్నారు. వీరెవ్వరూ ఈ అమానుష ఘటనపై నోరు మెదపకపోవడంపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, జెన్‌జీ యువత ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నిస్తున్నారు.
అదృశ్య శక్తుల ఒత్తిడి
ప్రియాంకను కారుతో ఢీకొట్టిన యువకులను రక్షించేందుకు తెర వెనుక అదృశ్య శక్తులు ప్రయత్నించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దారుణ ఘటనపై థియేటర్ మేనేజర్ విజయ్ ఫిర్యాదు మేరకు ఒక కేసు, ప్రియాంక తండ్రి కనిక వెంకటేష్ ఫిర్యాదు మేరకు మరో కేసు ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదయ్యాయి. అయితే, ఈ దారుణం జరిగిన నాలుగు రోజుల వరకూ పోలీసులు సీరియస్ చర్యలు తీసుకోకపోవడంపై అన్ని వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తాయి. నిందితులు ఉద్దేశపూర్వకంగానే ప్రియాంకను కారుతో ఢీకొట్టిన విషయం సీసీ కెమెరా ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్యక్ష సాక్షులు, మాల్ సిబ్బంది కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. అయినప్పటికీ మద్యం మత్తులోనే ప్రియాంకను నిందితులు కారుతో ఢీకొట్టారని పోలీసు ఉన్నతాధికారులు గురువారం మీడియాకు చెప్పడం గమనార్హం. ఇన్ని రోజులూ నిందితులను తెర వెనుక నుంచి రక్షించేందుకు కొందరు ప్రజాప్రతినిధులు పోలీసులపై ఒత్తిడి తీసుకురావడమే దీనికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో ప్రభుత్వ, పోలీసుల తీరును నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రంగా ఎండగట్టారు. దీంతో, ఎట్టకేలకు నాలుగు రోజుల తర్వాత ఆ శ్రీమత్మోశ్రీన్మాదులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
అసాంఘిక శక్తుల స్వైరవిహారం
రాజమహేంద్రవరంలో నిత్యం ఏదో ఒకచోట మద్యం, గంజాయి మత్తులో ఆకతాయిలు, బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోతున్నా కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారనే ఆరోపణలు బలంగా వస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నాయకుల అండతోనే అసాంఘిక శక్తులు స్వైరవిహారం చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
● వారం రోజుల వ్యవధిలోనే నగరంలో రెండు హత్యలు జరిగాయంటే శాంతిభద్రతలు ఎంతలా దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. గత నెల 28న గణేష్ అనే వ్యక్తిని ముగ్గురు స్నేహితులు ఇన్నీసుపేట దుక్కలదొడ్డి వద్ద కడతేర్చారు. ఈ నెల 5న గోరక్షణపేటకు చెందిన ఆటో డ్రైవర్ బుజ్జిబాబును ఇద్దరు వ్యక్తులు హతమార్చారు.
● ఇన్నీసుపేట, ఆల్కాట్ గార్డెన్స్, దుక్కలదొడ్డి, ఆదెమ్మదిబ్బ, కోటిలింగాల ఘాట్, క్వారీ సెంటర్, గోరక్షణపేట, అన్నపూర్ణమ్మపేట ప్రాంతాల్లో ఆకతాయిలు, మందుబాబుల అలజడి ఎక్కువగా ఉంది.
● జిల్లాలోని సుమారు 100 ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నచిన్న పొట్లాల్లో జరుగుతున్న గంజాయి విక్రయాలను పోలీసులు అరికట్టలేకపోతున్నారు.
● ఇటీవల డ్రగ్ డిటెక్టివ్ కిట్లతో వంద మందిని పరీక్షించగా.. వారిలో 38 మందికి పాజిటివ్ వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరిలో ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
జిల్లాలో గంజాయి
గుప్పుమంటోందిలా..
సంవత్సరం సీజ్ చేసిన కేసులు అరెస్టులు
(కిలోలు)
2024 2,837 68 250
2025 3,026 54 197
2026 334 25 86
(జూలై వరకూ)


