దేవరపల్లి: రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. పొగాకు రైతుల కష్టాలు తెసుకుని, వారికి బాసటగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటన ఏర్పాట్లను వేణుతో పాటు ఆ పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ గుడివాడ అమర్‌నాథ్, జగన్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ హోం మంత్రి, గోపాలపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ తలారి వెంకట్రావు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ కో ఆర్డినేటర్ వడ్డి రఘురామ్, విశాఖ స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్ గన్నమని జనార్దనరావు, ఎంపీపీ కేవీకే దుర్గారావు తదితరులు మంగళవారం పరిశీలించారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్ నిర్మాణ పనులు, పొగాకు వేలం కేంద్రం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వేణు మీడియాతో మాట్లాడుతూ, గతంలో రైతులను ఒక్కడిగా హింసించిన చంద్రబాబు.. నేడు కూటమిగా రైతులను హింసిస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ, వాణిజ్య పంటలను కనీసం మద్దతు ధరకు కొనుగోలు చేయించలేని అసమర్థ పాలన జరుగుతోందని అన్నారు. జగన్ వస్తేనే ఈ ప్రభుత్వ పెద్దలు కళ్లు తెరుస్తారని, అప్పుడే తమకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నది రైతుల నమ్మకమని చెప్పారు. దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని జగన్ సందర్శిస్తారనగానే కిలోకు రూ.10 పెంచారని, రూ.250 కోట్ల రుణాలు రైతులకు అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఇంతకు ముందు ఆ స్పందన లేదన్నారు. పొగాకు కొనుగోళ్లు రెండు నెలల్లోనే పూర్తి చేయాలనేది రైతుల ప్రధాన డిమాండ్ అని చెప్పారు. పొగాకు బోర్డు అనుమతించిన మేరకు కూడా గిట్టుబాటు ధరకు పొగాకు కొనుగోలు చేయని దుస్థితి నెలకొందన్నారు. కొనుగోళ్లు ప్రారంభించి సుమారు 130 రోజులు కాగా, ఇప్పటి వరకూ 10 శాతం కూడా కొనుగోలు చేయలేదని తెలిపారు. 120 రోజుల్లో మొత్తం పొగాకు కొనుగోలు చేయాల్సి ఉండగా, 105 రోజుల్లో 10 శాతమే కొనుగోలు చేయడం కంటే దారుణం ఎక్కడుంటుందని ఆయన ప్రశ్నించారు. రైతులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రక్షణ కల్పించే నాయకుడిగా జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని, రైతుకు ఎక్కడ నష్టం కలిగినా ప్రభుత్వం మెడలు వంచి వైఎస్సార్ సీపీ బాసటగా నిలుస్తుందని వేణు స్పష్టం చేశారు.
ఫ నాడు ఒక్కడిగా.. నేడు కూటమిగా రైతులను హింసిస్తున్నారు
ఫ సీఎం చంద్రబాబుపై
వైఎస్సార్ సీపీ నేత వేణు విమర్శ
ఫ జగన్ పర్యటన ఏర్పాట్లను
పరిశీలించిన నేతలు
ప్రజాదరణ చూసి ఓర్వలేకే తప్పుడు ప్రచారం : జక్కంపూడి రాజా
దేవరపల్లి: వెఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడికి వెళ్లినా వస్తున్న అత్యంత ప్రజాదరణను చూసి ఓర్వలేకే కూటమి ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకట్రాజు, చిర్ర బాలరాజు, సొంగా రోషన్ కుమార్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన ఆయన మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. పొగాకు రైతుల సమస్యలపై స్పందించి, వారి కష్టాలను నేరుగా తెలుసుకునేందుకు జగన్ వస్తున్నారని తెలిసి కూటమి నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. చంద్రబాబు పాలనలో గంజాయికి తప్ప ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదన్నారు. రైతుల వద్ద ఉన్న 85 శాతం పొగాకును ఎప్పటికి కొనుగోలు చేస్తారో కూటమి ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని నిలదీశారు. కేజీ పొగాకుతో 1,000 సిగరెట్లు తయారు చేసి రూ.39 వేల వ్యాపారం చేస్తున్నారని, రైతుకు మాత్రం కిలో పొగాకుకు రూ.160 నుంచి రూ.275 మాత్రమే ఇస్తున్నారని అన్నారు. ఇది న్యాయమా, ధర్మమా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నామన్నారు. పనికిమాలిన మాటలు మాని, ఇబ్బందుల్లో ఉన్న పొగాకు రైతులకు ఏవిధంగా మేలు చేయాలో ఆలోచించాలని ఎమ్మెల్యే వెంకట్రాజుకు హితవు పలికారు. ‘పొగాకు రైతులకు గిట్టుబాటు ధర చెల్లించడం చేతకాని మీరు, మీ ప్రభుత్వం శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి ఈ ప్రాంతానికి బ్లేడ్ బ్యాచ్‌లు, గంజాయి బ్యాచ్‌లు వస్తున్నాయంటూ మాట్లాడతారా?’ అని రాజా మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రజాదరణ కలిగిన నాయకుడని, ఎక్కడికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని చెప్పారు.


