డీఎస్సీపై సీబీఐ వేయాల్సిందే | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీపై సీబీఐ వేయాల్సిందే

Aug 5 2026 12:12 AM | Updated on Aug 5 2026 12:12 AM

సాక్షి ప్రతినిధి కాకినాడ/సాక్షి, అమలాపురం/ రాజమహేంద్రవరం/రంపచోడవరం: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని, ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్‌ సీపీ డిమాండ్‌ చేసింది. నిరుద్యోగ యువత జీవితాలతో ఆటలు వద్దని ప్రభుత్వాన్ని ఆ పార్టీ హెచ్చరించింది. క్రీడా కోటాలో రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించిన వారికి కాకుండా జిల్లాస్థాయిలో పాల్గొన్న వారికి పోస్టులు కట్టబెట్టి అర్హులకు అన్యాయం చేశారన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, పోలవరం జిల్లాల్లో మంగళవారం స్థానిక నేతలు, ప్రజా సంఘాలతో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో ఆయా జిల్లాల వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు పాల్గొని ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. అలాగే నాలుగు జిల్లాల్లోని నియోజకవర్గ కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

అనర్హులకు పోస్టింగులు దుర్మార్గం : చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

డీఎస్సీ పేరిట తప్పుడు పత్రాలు, జీవోలు సృష్టించి టీడీపీ కార్యకర్తలకే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చుకుని అర్హులైన నిరుద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని వైఎస్సార్‌ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెలుబోయిన వేణుగోపాల కృష్ణ ధ్వజమెత్తారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన జరిగిన టౌన్‌ హాల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని తప్పుడు హామీలు ఇచ్చి మోసగించారని పేర్కొన్నారు.

యువశక్తికి తలవంచక తప్పదు:

డాక్టర్‌ గూడూరి

జెన్‌జీ యువశక్తికి ఎవరైనా తలవంచక తప్పదని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి డా.గూడూరి శ్రీనివాస్‌ అన్నారు. మన విద్యావిధానం లోపభూయిష్టంగా ఉందన్నారు. డీఎస్సీ అక్రమాలపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

విద్యార్థులకు ఎలా న్యాయం చేస్తారు? : మార్గాని భరత్‌రామ్‌

రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ పేపర్‌ లీకేజీ, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ డిమాండ్‌ చేశారు. రాజమహేంద్రవరంలో ఆయన ఆధ్వర్యంలో ‘ఏపీ జెన్‌ జీ వార్‌’ పేరుతో స్థానిక వై–జంక్షన్‌లో ఉన్న ఆనం రోటరీ హాల్‌లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యావ్యవస్థను పటిష్టంగా నిర్వహించలేని ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎలా న్యాయం చేస్తాయని ధ్వజమెత్తారు.

లోకేష్‌ బాధ్యత వహించాలి : చిర్ల జగ్గిరెడ్డి

రావులపాలెంలోని సీఆర్సీ మినీ ఫంక్షన్‌ హాల్లో వైఎస్సార్‌ సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో డీఎస్సీ అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే ప్రభుత్వాలే కూలిపోతాయని ఆయన అన్నారు.

జెన్‌ జీతో పోరాటాలు:

విశ్వరూప్‌.. శ్రీకాంత్‌..

ఢిల్లీ జంతర్‌మంతర్‌లో విద్యార్థుల ఉద్యమంతో కేంద్ర మంత్రి రాజీనామా చేసినట్లే, రాష్ట్రంలోనూ విద్యా శాఖ మంత్రి రాజీనామా చేసే వరకు ఏపీ జెన్‌జీ ద్వారా పోరాటాలు చేయాలని అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ కో–ఆర్డినేటర్‌, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ పిలుపునిచ్చారు. అమలాపురంలోని ఏబీసీ ఫుడ్‌ కోర్టులోని యెండూరి ఫంక్షన్‌ హాల్లో నియోజకవర్గ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌తో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ డీఎస్సీ అవకతవకలపై నాలుగు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు, ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.

ప్రభుత్వానికి కళ్లు తెరిపిద్దాం :

పాముల రాజేశ్వరీదేవి

సఖినేటిపల్లిలోని ఉయ్యూరివారిమెరకలోని కమ్యూనిటీ హాల్‌లో మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి మాట్లాడుతూ డీఎస్సీలో దగా పడ్డ పిల్లలకు న్యాయం చేసేందుకే ఈ ఆందోళన చేపట్టినట్టు తెలిపారు.

యువతకు అండగా : మాజీ ఎమ్మెల్యే పొన్నాడ

అక్రమాల డీఎస్సీపై ఉద్యమించి నిరుద్యోగ యువతకు వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందని ముమ్మిడివరం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో టౌన్‌ అధ్యక్షుడు బొంతు సత్యశ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

డీఎస్సీ పేరిట దగా చేశారు :

కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల

కాకినాడ రూరల్‌: కాకినాడలో నాగమల్లితోట జంక్షన్‌ వద్ద వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో మంగళవారం రూరల్‌ నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన టౌన్‌ హాల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాబు వస్తే జాబు గ్యారంటీ అని ఎన్నికల ముందు ప్రచారం ఊదరగొట్టిన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ అధికారంలోకి వచ్చి మెగా డీఎస్సీ పేరిట అర్హులకు అన్యాయం చేసి దొడ్డిదారి జీవోతో అక్రమాలకు తెరతీశారని ఆరోపించారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలన్నారు. సింగిల్‌గా పోరాడే తమ నాయకుడు జగన్‌కు, తండ్రి చాటున బిడ్డగా ఉన్న లోకేష్‌కు పోలికేంటని ప్రశ్నించారు.

రూ.15 లక్షలకు అమ్ముకున్నారు:

తోట నరసింహం

జగ్గంపేటలోని స్థానిక బాలాజీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నియోకవర్గ కోఆర్డినేటర్‌ తోట నరసింహం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటోందని, మెగా డీఎస్సీ అంటూ హడావిడి చేసి చివరకు దగా డీఎస్సీగా మార్చిందని ధ్వజమెత్తారు. ఈ పోస్టుల్లో ఒక ఉద్యోగాన్ని రూ.15 లక్షలకు పైగా అమ్మకున్నారని ఆరోపించారు.

దేశంలోనే అతి పెద్ద కుంభకోణం : వంగా గీత

పిఠాపురంలో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ కోఆర్డినేటర్‌ వంగా గీత మాట్లాడుతూ డీఎస్సీ–2025 దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని, మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, భృతి అని అన్నింటా మాట తప్పారని అన్నారు. వీటన్నింటికీ బాధ్యత వహించి లోకేష్‌ రాజీనామా చేయాలని పేర్కొన్నారు.

నిరుద్యోగ యువతతో చెలగాటమా? : డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి

నిరుద్యోగ యువత జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీఎస్సీ– 2025 అవకతవకలపై ఆయన మాట్లాడుతూ ఈ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, అక్రమాలు జరిగాయని ధ్వజమెత్తారు. డీఎస్సీ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వ వ్యవస్థలకు కాకుండా ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడం వల్లే ప్రశ్నాపత్రాల లీకేజీకి, అనేక నిర్వహణ లోపాలకు తావిచ్చారని ఆయన విమర్శించారు. అలాగే మండపేట నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు వంటెద్దు వెంకన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో అప్రజాస్వామికంగా సాగిస్తున్న చంద్రబాబు పాలనకు ప్రజలే చరమగీతం పాడతారన్నారు.

లోకేష్‌ బాధ్యత వహించాలి :

మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి

డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాల్సిందేనని రంపచోడవరం నియోజకవర్గం వెఎస్సార్‌ సీపీ కో ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి డిమాండ్‌ చేశారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై రంప రోడ్డులో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆమె మాట్లాడుతూ డీఎస్సీలో జరిగిన అక్రమాలపై వైఎస్సార్‌ సీపీ ఆధారాలు చూపినా మంత్రి లోకేష్‌ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

నైతిక బాధ్యతగా లోకేష్‌ రాజీనామా చేయాలి

అనర్హులకు పోస్టులు పంపకాలు చేశారు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా

వైఎస్సార్‌ సీపీ నేతలు, క్యాడర్‌ ధ్వజం

మేధావులు, ప్రజాసంఘాలతో

రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement