అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి చెందిన సత్యగిరిని పోడు వ్యవసాయం పేరుతో ఆక్రమించేందుకు జరిగిన ప్రయత్నం, దేవస్థానం తీసుకున్న చర్యలపై కలెక్టర్ హరింధర ప్రసాద్ మంగళవారం ఆరా తీశారు. ఈ వ్యవహారంపై సోమవారం ‘పోడు పొచ్చాలు’, మంగళవారం ‘సత్యగిరిపై ఇదేం కిరికిరి’ శీర్షికలతో ‘సాక్షి’ ప్రచురించిన వార్తలకు ఆయన స్పందించారు. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావును కలెక్టర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో జరిగిన విషయాన్ని వివరిస్తూ సత్యగిరిపై 1998లో దేవస్థానం కొనుగోలు చేసిన 303 ఎకరాల భూమి సరిహద్దులు నిర్ణయించడానికి సర్వే చేయించి, రాళ్లు పాతించి, తరువాత ఫెన్సింగ్ చేయించనున్నట్టు కలెక్టర్‌కు ఈఓ నివేదిక పంపారు.
సత్యగిరి పరిశీలన
కొండ పోడు పేరుతో సత్యగిరిని ఆక్రమించే ప్రయత్నం జరిగిన గిరి ప్రదక్షిణ రోడ్డును ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని పెద్దాపురం ఆర్‌డీఓ జి.కృష్ణమూర్తి మంగళవారం పరిశీలించారు. కొండను సర్వే చేయించి, వెంటనే సరిహద్దులో సర్వే రాళ్లు పాతించాలని దేవస్థానం అధికారులకు, శంఖవరం, తొండంగి తహసీల్దార్లు ఎం.సూరిబాబు, కె.కాంతారావుకు సూచించారు. సత్యగిరి కొండ ను సర్వే చేసిననంతరం పాతడానికి 200 సర్వే రాళ్లు కోటనందూరు మండలం గన్నవరం మెట్ట నుంచి తెప్పిస్తున్నట్టు ఈఓ తెలిపారు.
·˘ ‘సాక్షి’ కథనాలకు స్పందన
·˘ పోడు భూములను పరిశీలించిన ఆర్‌డీఓ


