హాస్టల్‌ తక్షణం స్వాధీనం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

హాస్టల్‌ తక్షణం స్వాధీనం చేసుకోవాలి

Aug 5 2026 12:12 AM | Updated on Aug 5 2026 12:12 AM

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక కందుకూరి రాజ్యలక్ష్మీ మహిళా కళాశాల హాస్టల్‌ను స్వాధీనం చేసుకోవాలంటూ విద్యా శాఖ కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయాలని ఉభయ గోదావరి జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కోరారు. ఈ మేరకు విద్యా శాఖ కమిషనర్‌ భరత్‌గుప్తాకు విజయవాడలోని ఆయన కార్యాలయంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపీమూర్తి మాట్లాడుతూ, ఈ హాస్టల్‌ను స్వాధీనం చేసుకోవాలని ఫిబ్రవరిలో ఉత్తర్వులిచ్చినా నేటికీ స్వాధీనం చేసుకోలేదని తెలిపారు. కందుకూరి ఆశయాలను నెరవేర్చాలని, విద్యార్థినులకు రక్షణ కల్పించాలని, కందుకూరి విద్యాసంస్థలను కాపాడుకోవాలని అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పి.రామ్మోహన్‌, కె.ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ, హాస్టల్‌ను వారం రోజుల్లో స్వాధీనం చేసుకోకుంటే కమిషనర్‌ కార్యాలయానికి విద్యార్థినులందరూ తరలి వస్తారని అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు వై.భాస్కర్‌ మాట్లాడుతూ జీఓ–28 ప్రకారం కందుకూరి రాజ్యలక్ష్మీ మహిళా కళాశాల క్యాంపస్‌ మొత్తం ప్రభుత్వ పరమైందని, అయినప్పటికీ హితకారిణి సమాజం దౌర్జన్యంగా లాగేసుకుందని ఆరోపించారు. అయినప్పటికీ విద్యా శాఖ పట్టించుకోలేదని అన్నారు. వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కరిస్తామని కమిషనర్‌ హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు., కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి, జిల్లా కమిటీ సభ్యులు సౌమ్య, కార్తిక్‌, నాగచెతన్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement