నిధులు.. నీటిమీద లెక్కల్రా! | - | Sakshi
Sakshi News home page

నిధులు.. నీటిమీద లెక్కల్రా!

Jul 27 2026 12:18 AM | Updated on Jul 27 2026 12:18 AM

పాత్రలు: సుబ్బారావు (పరిస్థితులపై అవగాహన ఉన్న వ్యక్తి), వెంకట్రావు (అమాయకంగా

ప్రశ్నించే రైతు)

వెంకట్రావు: ఏంట్రా సుబ్బారావ్‌! వచ్చే ఏడాదే గోదారి పుష్కరాలంటగా? ఘాట్లు చూస్తే చెత్తగా ఉన్నాయి. పనులేవీ మొదలైనట్టు లేవు.. ఏంటంటావ్‌?

సుబ్బారావు: (చదువుతున్న పేపరు మడత పెడుతూ) ఒరే వెంకట్రావ్‌! నువ్వింకా సత్తెకాలంలో ఉండిపోయావు రా. ఇప్పుడు పనులవ్వాలంటే డబ్బులుండాలి. అవి రావాలంటే మాటలు కాదు. చేతలు ఉండాలి. మన నాయకులు మాటల పారిస్తున్నారు గానీ, పైసలు ఇవ్వట్లేదుట.

వెంకట్రావు: ‘అదేంట్రా బాబూ అలా అంటావ్‌? మొన్నటికి మొన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, ఆ పక్కన మంత్రులు నారాయణ, మన గోదారోడు కందుల దుర్గేష్‌ అందరూ పెద్ద పెద్ద ప్రకటనలిచ్చేశారుగా.. ‘పుష్కరాలు అద్భుతంగా చేస్తాం, ప్రపంచం చూసేలా చేస్తాం’ అని?

సుబ్బారావు: ‘హహాహ్హా... ఎంత అమాయకుడివిరా నువ్వు! మైకుల్లో చెప్పేవి మాటలురా బాబూ.. అకౌంట్లో పడేవి నిధులు! వాళ్లు చెప్పే గోదారి కబుర్లు వింటే గోదారమ్మ కూడా పొంగిపొర్లుద్ది అనుకో.. కాకపోతే ఆ కబుర్లతో రేవులు బాగుపడవు కదా! రోడ్లు పెద్దవవ్వవు. నిధులు పత్తా లేవు. ఉత్త మాటలతో పుష్కరాలు ముగించేద్దామనుకుంటున్నారేమో మనోళ్లు!’

వెంకట్రావు: ‘అంతే మరీ.. ఇంకో పది నెలల్లోనే పుష్కరాలు. సుమారు పది కోట్ల మంది మంది భక్తులు వస్తారని మన దుర్గేశ్‌ అస్తమానూ చెబుతున్నాడు. రోడ్లేమో గుంతల మయం, రేవులేమో అధ్వానం. మంత్రులొచ్చి ఊదరగొట్టి వెళ్లిపోతున్నారు. ఆఖరికి టైమ్‌ దగ్గర పడ్డాక ‘అయ్య బాబోయ్‌, సమయం లేదు’ అని తమ వారికి పనులు కేటాయించేసి.. హడావిడిగా ౖపైపె పూతలేసేసి నిధులు జేబుల్లో నొక్కేసి.. ‘పనులన్నీ చేసేశాం’ అంటారేమో..

సుబ్బారావు: అదే కదరా నేను చెప్పేది! నాయకులు ఎంతసేపూ ‘అది చేస్తాం, ఇది చేస్తాం’ అని గొప్పలు చెప్పడానికే సరిపోతోంది. కందుల దుర్గేష్‌ ఏమో మనోడే కదా అని ఆశపడితే, ఆయనా మాటల గారడీయే చేస్తున్నాడు. నారాయణ మున్సిపల్‌ పనులు పొడిచేస్తాం అంటారు కానీ రూపాయి విదల్చరు. పవన్‌ కళ్యాణ్‌ ఏమో సనాతని అంటూ ఏదీ తేల్చరు.

వెంకట్రావ్‌ : ఆశ్చర్యంగా చూస్తూ.. ‘అవున్రా.. అసలు విషయం మర్చిపోయాను. పవన్‌ కళ్యాణ్‌ ఏమో కాలుష్యరహిత గోదావరి.. ప్లాస్టిక్‌ రహిత పుష్కరాలు.. అన్నారు. ఈ మధ్య ఎక్కడా పత్తాలేరు. కాలుష్యం కట్టడికి, ప్లాస్టిక్‌ నిషేధానికి ఆయన చేసిందేంటంటావ్‌?

సుబ్బారావు : ‘అదే మరి.. ఆయన మెరుపుతీగ లాంటోడు. అప్పుడప్పుడూ కనిపించి.. ఏదో చెప్పేసి మళ్లీ చటుక్కున మాయమైపోతాడు. ఆయన చెప్పింది ఆ పార్టీ వాళ్లు కాదు కదా.. ఆయనే సీరియస్‌గా తీసుకోడు. నువ్వెలా నమ్మేశావ్‌రా’

వెంకట్రావ్‌: ‘మన పుష్కర ఘాట్‌ వద్ద ఏవో అరకొర నిధులతో పనులు చేస్తున్నట్టున్నారు కదా.. అంటించిన పలకలు అప్పుడే ఊడిపోతున్నాయిట.. ఏంటీ ఈ విచిత్రం..?’

సుబ్బారావు : ‘అవా.. ఆ నిధులు.. ఈ నిధులూ అని చెప్పి పుష్కరాల రేవు దగ్గర ఆ పనులు పట్టించుకునేవారెవర్రా? అధికార పార్టీ నాయకుల జేబులు నింపేందుకే ఏదో అలా అలా చేస్తున్నారు.

వెంకట్రావ్‌ : ‘అవున్రా... పుష్కర పనుల కోసం ప్రభుత్వం అనుమతులిచ్చిన రూ.150 కోట్లు వచ్చేయంటావా?

సుబ్బారావు : అప్పుడేనా? అవి రావాలి.. పనులు మొదలవ్వాలి. ఉభయ గోదావరి జిల్లాల్లో పుష్కరాల అభివృద్ధి పనులకు రూ.8 వేల కోట్లు అవసరం అంటే రూ.150 కోట్లు ఇస్తామంటే ఎలా సరిపోతాయి? పనులేమో కొండంత.. పంపకాలేమో పిసరంత అన్నట్టుంది.

వెంకట్రావు : ‘అవున్రా.. మన మోడీ తాతేమైనా పుష్కరాలకు నిధులిచ్చారా? లేకపోతే ఆ టైమ్‌కి గంగా నది జలాలు తీసుకొచ్చి గోదారిలో కలిపేసి స్నానం చేసి వెళ్లిపోతారంటావా..?’

సుబ్బారావు : అదే అర్థం కావడం లేద్రా బాబూ! అక్కడి నుంచే నిధులు తెస్తామని ఇక్కడి ఎంపీ పురందేశ్వరి, మన ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెబుతున్నా.. అక్కడి నుంచేమీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. చూడాలి మరి.. ఆ గంగమ్మే దిక్కేమో!’

వెంకట్రావు: ‘ఛా... ఇదేం బావోలేదు రా సుబ్బారావ్‌! గోదావమ్మ మీద భక్తి ఉంది.. పుష్కరాలు గొప్పగా చేసేస్తామని డబ్బా కొడితే సరిపోదు. వచ్చినోళ్లకి సౌకర్యాలు కల్పించాలిగా..? నాయకుల మాటలేమో కోటలు దాటుతున్నాయ్‌. పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు. తేడా వస్తే మన గోదారోళ్లు ఊరుకోర్రోయ్‌. లెక్కలు తేల్చేస్తారు.!

సుబ్బారావు: ‘ఇదీ అసలైన మాట! ఊరకే కబుర్లు చెబితే సరిపోదు.. వెంటనే డబ్బులు తెచ్చి పనులు పరుగులు పెట్టించాలి. భక్తులకు ఏ ఇబ్బందీ లేకుండా సౌకర్యాలు కల్పించాలి. లేకపోతే ఈసారి పుష్కరాల సాక్షిగా జనాలే వీళ్ల తీరును ఎండగడతారు, సరైన టైమ్‌లో బుద్ధి చెబుతారు.. చూస్తూ ఉండు!’

– సాక్షి, రాజమహేంద్రవరం

పుష్కరాల రేవు గట్టుమీద చెట్టు నీడన సాగిన గోదారోళ్ల సంవాదమిది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement