కలెక్టర్ కీర్తి చేకూరి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్ రెవెన్యూ క్లినిక్ సోమవారం యథావిధిగా నిర్వహించి అర్జీలు స్వీకరిస్తామని కలెక్టర్ కీర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని పీజీఆర్‌ఎస్ కేంద్రాల్లో సిటిజన్ ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తున్నామని, సేవలు పొందిన అనంతరం ఆ కోడ్ స్కాన్ చేసి తమ అభిప్రాయాన్ని నమోదు చేయాలని కలెక్టర్ కోరారు. తద్వారా తమ సేవలు మరింత పారదర్శకంగా అందించేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. కలెక్టరేట్‌తో పాటు ఆర్డీఓ కార్యాలయాలు, మండల తహసీల్దార్ కార్యాలయాలు, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్, అన్ని మున్సిపల్ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్జీలను స్వీకరిస్తారని వెల్లడించారు. అలాగే ప్రజలు 1100 టోల్ ఫ్రీ నంబర్ తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. వాట్సప్ గవర్నెన్స్ 95523 00009 ద్వారా 300 పైగా పౌర సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు అని తెలిపారు.
30న సప్తకళా వేడుకలు
ఐ.పోలవరం: పుల్లెల తాతయ్య మెమోరియల్ అసోసియేషన్ (పీటీఎం), ప్రజ్ఞా సాహితి సంయుక్త ఆధ్వర్యాన ఈ నెల 30న ఐ.పోలవరంలో సప్తకళా వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన రావి బేబీ సత్యవాణి కూచిపూడి నృత్య ప్రదర్శన, సుప్రసిద్ధ రంగస్థల నటి మహంతి రమణ బృందంతో తారామణి నాటక ప్రదర్శన, ప్రముఖ మెజీషియన్ వి.శ్రీరామారావు మ్యాజిక్ షో ప్రధాన ఆకర్షణగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. వీటితో పాటు శాస్త్ర దిగ్గజాలు అనే అంశంపై వకృత్వం, పాటల పరిమళాలు, కవితా లహరి వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని వివరించారు. ముఖ్య అతిథిగా పరిపాలనాధికారి బీహెచ్‌ఎస్‌ఆర్ సుబ్రహ్మణ్యం, విశిష్ట అతిథిగా ఎంఈఓ ఎన్.ప్రసాద్ కుమార్ పాల్గొంటారన్నారు. కార్యక్రమాల బ్రోచర్‌ను నిర్వాహకులు ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో రేవు యజ్ఞశ్రీ, ప్రత్తి సత్తిబాబు, ఎ.వెంకట నారాయణ, వి.లక్ష్మీనారాయణ, పల్లెపు వెంకటేశ్వరరావు, ఎస్.పుల్లారావు పాల్గొన్నారు.
ప్రగడ కోటయ్య
సేవలు చిరస్మరణీయం
అమలాపురం రూరల్: ప్రగడ కోటయ్య సేవలు చిరస్మరణీయమని జాయింట్ కలెక్టర్ వై.నైదియాదేవి అన్నారు. ప్రజాబంధువు ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి జేసీ ఆదివారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా, ఏఐసీసీ సభ్యుడిగా, హ్యాండ్లూమ్స్ వీవర్స్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎంతో సేవ చేశారని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం, సహకార ఉద్యమ బలోపేతానికి జీవితాంతం కృషి చేశారని చెప్పారు. ఈ సందర్భంగా చేనేత రంగంలో పని చేసిన బండారులంక సీనియర్ కళాకారులు వాసా సుబ్బారావు, మేరేటి సుబ్రహ్మణ్యం కాశిన బసవరాజు, వరదా వీరన్న (మాగం), ఇమ్మంది సత్యనారాయణ(మూలపొలం)లను చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకుడు పప్పుల శ్రీనివాసరావు ఆధ్వర్యాన ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ వి.సుబ్బారావు, పద్మశాలి, చేనేత సంఘాల నాయకులు, ఇతర అఃదికారులు పాల్గొన్నారు.
ఆర్‌డీఓగా ధర్మరాజు
నియామక ఉత్తర్వుల నిలిపివేత
అమలాపురం రూరల్: పార్వతీపురం మన్యం జిల్లాలో కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్న ఇ.ధర్మరాజును అమలాపురం ఆర్‌డీఓగా నియమిస్తూ ఈ నెల 21న జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ ఆయన బదిలీని నిలుపు చేస్తున్నట్లు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.సాయిప్రసాద్ తెలిపారు. దీంతో, ధర్మరాజు ప్రస్తుత పోస్టులోనే కొనసాగనున్నారు.


