కష్టాలు కనవా! | - | Sakshi
Sakshi News home page

కష్టాలు కనవా!

Jul 26 2026 12:15 AM | Updated on Jul 26 2026 12:15 AM

వేంకటేశా..

రాజమండ్రి రైల్వే స్టేషన్‌ వద్ద వాడపల్లి బస్సు కోసం వేచి ఉన్న భక్తులు

రాజమండ్రి రైల్వే స్టేషన్‌ వద్ద వాడపల్లి బస్సు ఎక్కేందుకు గుంపుగా ఉన్న భక్తులు

సాక్షి, రాజమహేంద్రవరం: కలియుగ దైవం, ఏడు శనివారాల నోములతో భక్తుల అభీష్టాలు తీర్చే వేంకటేశ్వరుడు కొలువైన వాడపల్లి పుణ్యక్షేత్రం ప్రతి శనివారం భక్తజన సంద్రంగా మారుతోంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, కృష్ణా జిల్లాల నుంచి ప్రతి శనివారం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తుంటారు. స్వామివారి దర్శనానికి వెళ్లడానికి ముందే వారు రవాణా సౌకర్యాలు లేక అష్టకష్టాలు పడుతున్నారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఆలయానికి వెళ్లేందుకు ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సనాతనవాదులమనే గొప్పగా చెప్పుకొనే పాలకులకు తమ కష్టాలు కనిపించడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైల్వే స్టేషన్‌, బస్టాండ్ల నుంచే నరకం ఆరంభం

వాడపల్లి వేంకటేశ్వరుని దర్శనానికి ప్రతి శనివారం సుమారు 80 వేల మంది వరకూ భక్తులు వెళ్తుంటారు. ప్రత్యేక దినాల్లో ఆ సంఖ్య లక్ష వరకూ ఉంటుంది. ఇక శుక్ర, ఆదివారాల్లో 40 వేల మంది, మిగిలిన రోజుల్లో 20 వేల మంది స్వామి దర్శనానికి వెళ్తుంటారు. వారంతా వాడపల్లి వెళ్లేందుకు తగినన్ని ఆర్టీసీ సర్వీసులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రైవేటు వాహనాలు, ఆటో డ్రైవర్లు ఒక్కో భక్తుడి నుంచి రూ.80 వసూలు చేస్తున్నారు.

తిరుగు ప్రయాణం మరింత దారుణం!

వాడపల్లి క్షేత్రం చుట్టూ ఏడు సార్లు తిరిగి స్వామి వారి దర్శనం అనంతరం అలసిపోయిన భక్తులకు తిరుగు ప్రయాణం మరింత దారుణంగా మారుతోంది. అక్కడి నుంచి రాజమహేంద్రవరం, అమలాపురం బస్టాండ్లకు రావాలంటే గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదని భక్తులు వాపోతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలతో వచ్చే కుటుంబాల పరిస్థితి మరింత దయనీయం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తిరుగు ప్రయాణంలో వారి గమ్యానికి చేరడానికి రైళ్లను అందుకోవాలంటే అత్యంత కష్టసాధ్యంగా మారుతోంది.

‘జన్మభూమి’ కోసం పరుగులు

వాడపల్లి వేంకటేశ్వరుని దర్శించుకోవాలనుకునే ఉత్తరాంధ్ర భక్తులు ముందుగా విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు, అక్కడి నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఇతర రైళ్లలో రాజమహేంద్రవరం చేరుకుంటున్నారు. ఇక్కడి నుంచి వారంతా పరగు తీయాల్సి వస్తోంది. దర్శనానంతరం అదే రోజు సాయంత్రం రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌కు చేరుకుని జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను అందుకునేందుకు వారు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. సమయానికి బస్సులు దొరక్క జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను అందుకోలేకపోతే ఉత్తరాంధ్రలోని స్వస్థలాలకు చేరుకోవడం అత్యంత కష్టతరమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భక్తుల డిమాండ్లు ఇవీ

ప్రతి శనివారం రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌ నుంచి వాడపల్లికి, అలాగే వాడపల్లి నుంచి అమలాపురానికి, రాజమహేంద్రవరానికి ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచాలి.

శనివారం రోజున వాడపల్లి వద్ద తాత్కాలిక బస్‌ పాయింట్లు/హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేసి, భక్తులకు రవాణా సమాచారం అందించాలి.

ప్రైవేటు వాహనాల అదనపు బాదుడుపై పోలీసు, రవాణాశాఖ అధికారులు నిఘా పెట్టాలి.

వాడపల్లి ప్రయాణానికి భక్తుల అగచాట్లు

రవాణా సదుపాయాలు లేక అవస్థలు

రైల్వే స్టేషన్‌, బస్టాండ్ల నుంచి

అరకొరగా సాగుతున్న బస్సులు

యుద్ధాన్ని తలపించేలా తిరుగు ప్రయాణం

రైళ్లు అందుకోవడానికి అష్టకష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement