నిడదవోలు రూరల్: డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మానుకొండ చంద్రబాబు శనివారం డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడినందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి లోకేష్ కూడా తక్షణమే రాజీనామా చేయాలన్నారు. యువతను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఆయన హెచ్చరించారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
చారిత్రాత్మక విజయం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమాల్లో చారిత్రక విజయమని ఏఐఎస్‌ఎఫ్ పేర్కొంది. సంఘం జిల్లా కార్యదర్శి చింతలపూడి సునీల్ శనివారం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థుల ఆందోళనకు ఇది ఒక సమాధానంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కోశాధికారి రవికుమార్, సీహెచ్ సురేష్, టి.నాని పాల్గొన్నారు.
పుష్కర పనులు
వేగవంతం చేయాలి
కలెక్టర్ కీర్తి చేకూరి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులను వేగవంతం చేసి భక్తులకు మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ కీర్తి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు సమీక్షిస్తూ పరిపాలనా అనుమతులు పొందిన అన్ని పనులను సంబంధిత అధికారులు పుష్కరాల ఆన్‌లైన్ పోర్టల్‌లో వెంటనే నమోదు చేయాలని సూచించారు. లైటింగ్, తాగునీరు, విద్యుత్ తదితర విభాగాల అధికారులు సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కొవ్వూరు నుంచి పోలవరం వరకు రైట్ బ్యాంక్ రోడ్డు, రాజమహేంద్రవరం నుంచి పోలవరం వరకు లెఫ్ట్ బ్యాంక్ రోడ్లను నాలుగు లేన్లుగా విస్తరించే అవకాశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


