దేవరపల్లి: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగస్టు 5న తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటిస్తారని మాజీ హోం మంత్రి, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత శనివారం తెలిపారు. దేవరపల్లిలోని పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించి, వేలం ప్రక్రియను పరిశీలిస్తారని వెల్లడించారు. అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలు తెలుసుకుంటారని చెప్పారు.
రిజిస్ట్రేషన్లు తగ్గి ఖజానాకు గండి
ఆరో రోజుకు చేరిన లేఖర్ల పెన్‌డౌన్
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): దస్తావేజు లేఖర్ల నిరవధిక పెన్‌డౌన్‌తో జిల్లాలో రిజిస్ట్రేషన్లకు తీవ్ర విఘాతం కలుగుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరు రోజులుగా సాగుతున్న లేఖర్ల పెన్‌డౌన్‌తో క్రయ విక్రయదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కేవలం 100 లోపు రిజిస్ట్రేషన్లు మాత్రమే జరగ్గా రూ.25 లక్షల ఆదాయం మాత్రమే వచ్చింది. సాధారణ రోజులతో పోలిస్తే పది శాతం ఆదాయం కూడా రాలేదని అధికారులు చెప్తున్నారు. జీవో 396ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ రాజమహేంద్రవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద జిల్లా, రాజమండ్రి దస్తావేజులేఖర్ల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పెన్‌డౌన్ శనివారానికి ఆరో రోజుకు చేరింది. సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లమిల్లి వీర్రెడ్డి, రాజమండ్రి సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కోలా రామచంద్రరావు, బేరి సూర్యనారాయణరెడ్డి తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.


