● గిట్టుబాటు ధర లేక నిరుత్సాహం
● రూ.200కు తగ్గకూడదని సీఎం
ఆదేశించినా రూ.170 మించని ధర
దేవరపల్లి: పొగాకు కొనుగోళ్లు ప్రారంభమై 120 రోజులు కావస్తున్నా మార్కెట్‌లో చలనం అంతగా లేదు. కిలో పొగాకు రూ.200 తగ్గకుండా కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినప్పటికీ ఫలితం లేకపోయింది. కిలో గరిష్ఠ ధర ఈ ఏడాది వేలం ప్రారంభం నుంచి రూ. 265 పలుకుతోంది. ఎక్కువ శాతం పొగాకు మార్కెట్లో కిలో రూ.170 దాటి పలకడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడి పొగాకు అక్కడే..
మార్కెట్లో పొగాకు కొనుగోళ్లు మందగించడంతో రైతుల ఇళ్ల వద్ద నిల్వలు అలాగే ఉండిపోయాయి. దీంతో రంగు, నాణ్యత దెబ్బతింటున్నాయని రైతులు అంటున్నారు. ఈ ఏడాది మార్కెట్‌లో కొనుగోలుదారుల మధ్య పోటీ లేకపోవడం, కొనుగోలు సంస్థలు సిండికేట్‌గా మారి మొక్కుబడిగా కొనుగోలు చేయడం వల్ల అమ్మకాలు మందగించాయని రైతులు అంటున్నారు.
గణనీయంగా పెరిగిన ఉత్పత్తి
గత ఏడాది కిలో గరిష్ట ధర రూ.453, సగటు రూ.311కు పలకడంతో ఈ ఏడాది రైతులు ఉత్పత్తిని గణనీయంగా పెంచారు. పొగాకు బోర్డు అనుమతి ప్రకారం 143 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి చేయాల్సి ఉండగా రైతులు 243 కిలోలు ఉత్పత్తి చేశారు. ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతంలో 50.87 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, 85 మిలియన్ల కిలోలు ఉత్పత్తి జరిగింది. ఇది కూడా ఒక సమస్యే. గత ఏడాది 211 రోజులు పొగాకు కొనుగోళ్లు జరగ్గా, ఈ ఏడాది 10 నెలలు జరుగుతుందని అధికారులు చెపుతున్నారు.
జగన్ పర్యటనకు సన్నాహాలు
పొగాకు మార్కెట్లో ధరల పతనం, సంక్షోభంపై ఇటీవల రాష్ట్రంలోని 16 వేలం కేంద్రాల పరిధిలోని రైతులు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి సమస్యలను వివరించి వేలం కేంద్రాలను సందర్శించాలని రైతులు కోరారు. ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతంలోని జంగారెడ్డిగూడెం లేదా గోపాలపురం వేలం కేంద్రాన్ని సందర్శించి, రైతులకు అండగా ఉండేందుకు అధినేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆయన వచ్చే నెల ఐదున రానున్నట్టు వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, మాజీ హోం మంత్రి తానేటి వనిత శనివారం తెలిపారు. ఈ మేరకు ఆయా కేంద్రాల్లో సన్నాహాలు చేస్తున్నారు. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో పొగాకు మార్కెట్ సంక్షోభంలో ఉండగా, ప్రతిపక్ష హోదాలో దేవరపల్లి వేలం కేంద్రాన్ని సందర్శించి రైతులకు అండగా నిలిచి గిట్టుబాటు ధర కల్పించకపోతే ధర్నా చేస్తానని ప్రటించారు. దీంతో కొనుగోలు దారులు కిలోకు సగటు ధర రూ.17 పెంచి కొనుగోలు చేశారు. 2021లో సైతం ఇదే పరిస్థితి రాగా అధైర్యపడవద్దని రైతులకు ఆయన భరోసా ఇచ్చి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు.


