ఫ రత్నగిరిపై భక్తుల అవస్థలు
ఫ అధ్వానంగా మారిన బోర్డులు
ఫ మాసిపోయిన రంగులు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయానికి విచ్చేసే భక్తులు దారి చూపు సత్యదేవా అని వేడుకుంటున్నారు. ఆలయంలోని వివిధ ప్రాంతాలకు దారి చూపే సైన్ బోర్డులు సక్రమంగా లేకపోవడమే దీనికి కారణం. దేవస్థానంలో గతంలో ఉన్న కార్యాలయాలను మరో చోటుకు మార్చినా, వాటికి దారి చూపేందుకు ఏర్పాటు చేసిన బోర్డులను మాత్రం మార్చలేదు. అలాగే కొన్ని సైన్ బోర్డులు మీద రంగులు వెలిసిపోయి, అక్షరాలు కనిపించడం లేదు. పశ్చిమ రాజగోపురం వద్ద గల బోర్డులో వసతి గదులు కేటాయించే సీఆర్వో కార్యాలయం మార్గం అంటూ బాణం గుర్తు చూపించే చోట ప్రస్తుతం అన్నదానం భవనం ఉంది. సీఆర్వో కార్యాలయాన్ని మూడేళ్ల క్రితమే ప్రకాష్ సదన్ సత్రం వెనుకకు మార్చారు. ఇక అన్నదాన భవనానికి వెళ్లే మార్గాన్ని చూపే బోర్డులు ఎక్కడా కనిపించవు. ఆ భవనం పశ్చిమ రాజగోపురానికి ఎదురుగానే ఉంటుంది. కానీ ఆ దారి తెలియక భక్తులు అవస్థలు పడుతున్నారు. రత్నగిరి నుంచి దిగువకు వెళ్లే ఘాట్ రోడ్డు మొదటి మలుపు నుంచి వనదుర్గ అమ్మవారి ఆలయానికి రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు ప్రారంభంలో వనదుర్గ అమ్మవారి ఆలయానికి మార్గం అనే బోర్డు మాసిపోయింది. పశ్చిమ రాజగోపురం వద్దకు వెళ్లే మార్గంలో వై.జంక్షన్ వద్ద గల బోర్డు కూడా వెలిసిపోయింది.


