రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో బీఈడీ ఆన్‌లైన్ మోడరేషన్ ప్రక్రియను వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో ఏ యూనివర్సిటీలోనూ ఇంతవరకు ఈ ప్రక్రియ లేదని, తొలిసారిగా నన్నయలోనే ప్రారంభించామని తెలిపారు. ఉపాధ్యాయ శిక్షణలో కీలకమైన ప్రాజెక్టులు, రికార్డులు, యాక్టివిటీస్ మోడరేషన్ ప్రక్రియను జీపీఎస్, ఫేస్ రికగ్నేషన్ వంటి నూతన విధానాలతో ఆధునీకరించామన్నారు. దీని ద్వారా మోడరేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఈ విధానంపై అనుబంధ కళాశాలల అధ్యాపకులకు ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహించి, సందేహాలను నివృత్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో బీఓఎస్ చైర్మన్, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుబ్బారావు, ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ టి.హైమవతి, అధ్యాపకులు పాల్గొన్నారు.


