రాయవరం: పేద, అనాథ బాలికల కోసం ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) బాలికల విద్యకు భరోసాగా నిలుస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా బోధన జరుగుతున్న వీటిలో ప్రవేశాలకు ఏటేటా డిమాండ్ పెరుగుతోంది. వీటిలో సాధారణ విద్యతో పాటు ఒకేషనల్, కంప్యూటర్ విద్యను సైతం అందిస్తున్నారు. ఆంగ్ల బోధనతో పాటు ఉచిత భోజనం, వసతి, పుస్తకాలు, యూనిఫాం తదితర సౌకర్యాలు అందిస్తున్నారు. కాకినాడ జిల్లాలో ఉన్న నాలుగు కేజీబీవీల్లో 6వ తరగతిలో ప్రవేశానికి మార్చి 12 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రతి పాఠశాలలో 6వ తరగతికి 40 సీట్లు ఉన్నాయి. ఈ నెల 10 వరకు ఉన్న గడువును మరోసారి ఈ నెల 20 వరకు గడువు పెంచారు.
జిల్లాలో కేజీబీవీలు
సమగ్ర శిక్షా ప్రాజెక్టు కింద మైదాన ప్రాంతంలో తుని, కోటనందూరు, శంఖవరం, తొండంగిల్లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలున్నాయి. గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మైదాన ప్రాంతంలోని నాలుగు కేజీబీవీలతో పాటుగా రంపచోడవరం, మారేడుమిల్లి, గంగవరం, వై.రామవరం, ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం, చింతూరులో కేజీబీవీలు ఉండేవి. జిల్లాల విభజన అనంతరం ఏజెన్సీ కేజీబీవీలు పోలవరం జిల్లా పరిధిలోకి వెళ్లాయి. ఇప్పుడు కేవలం కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న నాలుగు కేజీబీవీల్లో కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలోని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశముంది. వీటిలో ఏడాదికి 40 వంతున 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లాలోని నాలుగు కేజీబీవీల్లో ఇంటర్ విద్యను ప్రవేశ పెట్టారు. శంఖవరం కేజీబీవీలో ఎంపీసీ, తుని, తొండంగి కేజీబీవీల్లో బైపీసీ, కోటనందూరు కేజీబీవీలో ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులున్నాయి.
వీరికి తొలి ప్రాధాన్యం
అనాథ వీధి బాలికలు, పేద పిల్లలతో పాటు బడి బయట ఉన్న పిల్లలు, బడి మానేసిన వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బాలికలకు తొలి ప్రాధాన్యత కింద కేజీబీవీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వలస కూలీల చిన్నారులు, కార్మిక శాఖ అధికారులు సిఫారసు చేసిన వారికీ ప్రవేశాల్లో ప్రాధాన్యత ఉంటుంది. 2018 నుంచి కేజీబీవీల్లో ఇంటర్ విద్యనూ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఫిమేల్ లిటరసీ రేటు తక్కువుగా ఉన్న మండలాలకు చెందిన విద్యార్థినులకు తొలి ప్రాధాన్యతనిస్తారు. మొదటి ప్రాధాన్యం కాకినాడ జిల్లాలోని ఫిమేల్ లిటరసీ తక్కువుగా ఉన్న మండలాల విద్యార్థినులకు ఇస్తారు. సీట్లు భర్తీ కాకపోతే ఆ సీట్లను కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలోని ఫిమేల్ లిటరసీ తక్కువుగా ఉన్న మండలాల విద్యార్థినులతో భర్తీ చేస్తారు.
గుణాత్మక విద్యా బోధన
కేజీబీవీల్లో బాలికలకు క్వాలిఫైడ్ ఉపాధ్యాయులతో గుణాత్మక విద్యను అందిస్తున్నారు. వీటితో పాటు ఆంగ్ల మాధ్యమం కూడా బోధిస్తున్నారు. రెగ్యులర్ పాఠ్యాంశాల బోధనతో పాటు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు, కంప్యూటర్ విద్య, క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. అలాగే కేజీబీవీల్లో విద్యార్థినులకు విద్యతో పాటు కుట్లు, అల్లికలను నేర్పిస్తున్నారు. బొమ్మల తయారీ, పేపర్లతో వివిధ రకాల నమూనాలు తయారు చేయడాన్ని నేర్పిస్తున్నారు. కబడ్డీ, టెన్నిస్, వాలీబాల్, సాఫ్ట్‌బాల్, హాకీ, టెన్నికాయిట్ తదితర క్రీడల్లో శిక్షణనిస్తున్నారు.
కేజీబీవీలతో బంగారు భవిష్యత్తు
6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత బోధన
దరఖాస్తులకు
ఈనెల 20 వరకు గడువు


