తుని రూరల్: తలుపులమ్మ లోవ దేవస్థానానికి ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో 20 వేల మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్టు ఈఓ పి.విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,62,195, పూజా టికెట్లకు రూ.1,57,020, కేశఖండన శాలకు రూ.12,160, వాహన పూజలకు రూ.9,500, కాటేజీలు, వసతి గదులు, పొంగలి షెడ్ల అద్దెలు రూ.68,535, విరాళాలు రూ.40,262, వెరసి మొత్తం రూ.4,84,163 ఆదాయం లభించినట్టు ఆయన వివరించారు.
రత్నగిరికి భక్తుల తాకిడి
సత్యదేవుని దర్శించిన 40 వేల మంది
అన్నవరం: రత్నగిరికి ఆదివారం భక్తులు పోటెత్తారు. రత్నగిరితో పాటు పలు ప్రాంతాలలో శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున వివాహాలు చేసుకున్న నవ దంపతులు, వారి బందుమిత్రులతో ఆలయ ప్రాంగణం కిటకిట లాడింది. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, రెండు వేల సత్యవ్రతాలు జరిగాయి. సత్యదేవుని దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది అన్నప్రసాదం స్వీకరించారు.
భక్తులతో కిటకిటలాడిన అయినవిల్లి
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి (సురేష్) ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపారు. స్వామిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకదశ రుద్రాభిషేకాల్లో 46 మంది పాల్గొన్నారు. 26 మంది భక్తులు శ్రీలక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఎనిమిది మంది చిన్నారులకు అక్షరభ్యాసం, తొమ్మిది మంది పిల్లలకు తులాభారం వేశారు. 2,664 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.4,87,185 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
పిల్లలను క్రీడల్లో
ప్రోత్సహించాలి
ఉప్పలగుప్తం: పిల్లలను తల్లిదండ్రులు చిన్నతనం నుంచే క్రీడల్లో ప్రోత్సహించాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వంటెద్దు వెంకన్నాయుడు అన్నారు. ఉప్పలగుప్తం గ్రామానికి చెందిన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి యనమదల ఇందిర ఇటీవల విజయనగరం జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 76 కేజీల విభాగంలో రెండో స్థానం సాధించి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రన్నర్‌గా నిలిచి, జాతీయ స్థాయికి ఎంపికై ంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఇందిరను ఆమె నివాసంలో వెంకన్నాయుడు సత్కరించి, నగదు బహుమతి అందజేశారు. అలాగే ఎస్‌టీయూ జిల్లా ఉపాధ్యాయవాణి కన్వీనర్ చిక్కం మైనర్ బాబు, మోటూరి సత్యంకాపు సైతం ఇందిరను అభినందించారు. వెంకన్నాయుడు మాట్లాడుతూ ఎనిమిదో తరగతి చదువుతున్న ఇందిర తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆమె తండ్రి, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు యనమదల పల్లంరాజు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఆర్టీఐ విభాగం మండల అధ్యక్షుడు పోలిశెట్టి వీర్రాజు, పార్టీ నాయకులు బొర్రాయిపాలెపు సూర్యనారాయణ, దూలం సూరిబాబు, గొల్లపల్లి బాబీ, యర్రంశెట్టి ప్రసాద్, ఆప్పారి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.


