● గిట్టుబాటు ధర లేక సాగని కొనుగోళ్లు
● జిల్లాలో 85 మిలియన్ కిలోల ఉత్పత్తి
● విక్రయాలకు ఆసక్తి చూపని రైతులు
● రూ.290కి నిర్ణయించాలని డిమాండ్
దేవరపల్లి: వర్జీనియా పొగాకు మార్కెట్ ఒడిదొడుకులకు గురవుతోంది. టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాల్లో మార్చి 25న కొనుగోళ్లు ప్రారంభించింది. ప్రారంభ ధర కిలో రూ.265 పలకడంతో దానిని రూ.290కి పెంచాలని డిమాండ్ చేస్తూ రైతులు కొనుగోళ్లు నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. దీనికి ట్రేడర్లు నిరాకరించడంతో రైతులు, బోర్డు చైర్మన్, అధికారుల మధ్య ఓ దశలో వాగ్వివాదం జరిగింది. గోపాలపురం వేలం కేంద్రానికి వచ్చిన బోర్డు చైర్మన్ సీహెచ్ యశ్వంత్ కుమార్ ముందు రైతులు ఈ మేరకు నిరసన వ్యక్తంచేయడంతో చేసేది లేక అధికారులు మొదటి రోజు వేలం నిలిపివేశారు. మిగిలిన కేంద్రాల్లో అధికారులు రైతులకు నచ్చచెప్పి కొనుగోళ్లు నిర్వహించారు. గోపాలపురంలో రెండో రోజు వేలం జరిగింది. గుంటూరులో ట్రేడర్లు, రైతు సంఘాల ప్రతినిధులతో అక్కడి ప్రధాన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ధర విషయంలో నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ చెప్పడంతో రైతులు సరకు విక్రయాలకు అంగీకరించారు. ఈ నెల 1న గుంటూరులో నిర్వహించిన సమావేశంలో కిలో గరిష్ట ధర రూ.290 ఇచ్చేందుకు అధికారులు అంగీకరించినప్పటికీ ట్రేడర్లు యాజమాన్య సంస్థలకు చెప్పి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇది జరిగి రెండు వారాలు కావస్తున్నా నేటికీ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో కొనుగోళ్లు మొక్కుబడిగా సాగుతున్నాయి.
ముందుకు సాగని కొనుగోళ్లు
వేలం ప్రక్రియ ప్రారంభమై 20 రోజులు కావస్తున్నప్పటికీ కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. రోజుకు ఒకొక్క కేంద్రానికి 300 నుంచి 400 బేళ్లు అమ్మకానికి రావలసి ఉండగా, 30 నుంచి 150 బేళ్లు వస్తున్నాయి. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం వేలం కేంద్రాలకు 150 బేళ్లు, కొయ్యలగూడేనికి 110 బేళ్లు, గోపాలపురం, దేవరపల్లి కేంద్రాలకు 30 నుంచి 40 బేళ్లు వస్తున్నాయి. వీటిలో సగానికిపైగా అమ్ముడుపోని పరిస్థితి ఉంది. కిలో గరిష్ఠ ధర రూ.265, కనిష్ఠ ధర రూ. 250 పలుకుతుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయా కేంద్రాల్లో రోజు విడిచి రోజు వేలం నిర్వహిస్తున్నారు.
ఎగుమతుల ఆర్డర్లపై ఆశలు
ఈ ఏడాది రైతుల పరిస్థితి గందరగోళంగా ఉంది. మొక్క మొదటి నాలుగు రెలుపుల పొగాకు కొనుగోలుకు ట్రేడర్లు నిరాకరిస్తున్నారు. ఐదో రెలుపు నుంచి వచ్చిన పొగాకు కొనుగోలుకు వారు మొగ్గు చూపుతుండడదీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ పక్క యుద్ధ ప్రభావం, మరో పక్క అనుమతికి మంచి పంట ఉత్పత్తి కావడంతో మార్కెట్లో సంక్షోభం ఏర్పడింది. 49.32 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, దాదాపు 85 మిలియన్ల కిలోలు ఉత్పత్తి జరిగినట్టు అధికారుల ప్రాధమిక అంచనా. ఎగుమతి ఆర్డర్లు వస్తే పొగాకుకు మంచి రోజులు వస్తాయని అధికారులు, రైతులు అంటున్నారు.
29,132 హెక్టార్లలో సాగు
రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలో 2025–26 పంట కాలంలో ఐదు వేలం కేంద్రాల్లో 12,612 మంది రైతులు, 14,412 బ్యారన్లు కలిగి 29,132 హెక్టార్లలో పంట సాగు చేశారు. దీనిలో ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతంలో 28,011 హెక్టార్లు, తొర్రేడు ప్రాంతంలోని నల్లరేగడి భూముల్లో 1120 హెక్టార్లలో పొగాకు సాగు జరిగింది.
85 మిలియన్ల కిలోల ఉత్పత్తి అంచనా
ప్రస్తుత పంట కాలంలో 49.32 మిలియన్ల కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చింది. అయితే సాగు విస్తీర్ణం పెరగడం, దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో దాదాపు 85 మిలియన్ల కిలోలు ఉత్పత్తి అవుతుందని అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.


