మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026
లో
పచ్చని కోనసీమ మరోసారి అంటుకుంది. చమురు సంస్థలు పెడుతున్న చిచ్చు రాజుకుంటూనే ఉంది. ఓఎన్జీసీ డ్రిల్లింగ్‌లు, చమురు, సహజవాయువుల వెలికితీత, గ్యాస్ పైప్ లైన్లు, ఇతర చమురు సంస్థల కార్యకలాపాలతో గడచిన మూడు దశాబ్దాలుగా కోనసీమ మందుపాతరగా మారిపోయింది. ఎప్పుడు ఏ క్షణాన, ఏ మూలన గ్యాస్ లీకేజీలు.. బ్లో అవుట్లు చోటు చేసుకుంటాయో తెలియక ఈ ప్రాంతవాసులు మందుపాతరల మీద జీవిస్తూ నిత్యం భయం భయంగా బతుకుతున్నారు.
సాక్షి, అమలాపురం/ మలికిపురం/ అమలాపురం టౌన్/ అంబాజీపేట: కోనసీమ పచ్చదనంపై వరుస బ్లో అవుట్లు పగబట్టాయి. కోనసీమ గుండెలపై బ్లో అవుట్లు కుంపట్లు అవుతున్నాయి. చమురు సంస్థలకు చెందిన రిగ్‌ల లోంచి అప్పుడప్పుడూ బ్లో అవుట్లు అనివార్యమై మంటలు, సెగలు, పొగలు కక్కుతున్నాయి. భరించలేని శబ్దాలతో కోనసీమ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బ్లో అవుట్లతో భద్రత లేని కారణాలపై చమురు సంస్థల మీద ముఖ్యంగా ఓఎన్జీసీపై ఈ ప్రాంత ప్రజలు, ప్రజా ప్రతినిధులు తర చూ ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నా ఆ సంస్థలకు కనువిప్పు కావడం లేదు. స్పందన మచ్చుకై నా కనిపించడం లేదు. తాజాగా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో సోమవారం సంభవించిన బ్లో అవుట్ నుంచి గతంలోకి ఓసారి తొంగి చూస్తే అనేక చేదు అనుభవాలు, చేదు జ్ఞాపకాలు కళ్ల ముందు కదలాడుతాయి. ఒక్కొక్క బ్లో అవుట్ కథను వింటే నాడు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు గుర్తుకు వస్తాయి.
● 1995 జనవరి 8న అల్లవరం మండలం దేవరలంక (పాశర్లపూడి) గ్రామంలో సంభవించిన బ్లోఅవుట్ అతి పెద్దది. మార్చి 15వ తేదీ వరకు ఇది కొనసాగింది. ప్రాణనష్టం లేకపోయినప్పటికీ ఆస్తి నష్టం ఎక్కువే. ఈ బ్లో అవుట్‌తో 65 రోజులపాటు సుమారు 30 నుంచి 60 అడుగుల ఎత్తులో మంటలు నిరంతరాయంగా మండాయి. దాదాపు పది కిలోమీటర్ల మేర ఆ పెనుమంటల వెలుగు విరజిమ్మింది. సుమారు 15 కిలోమీటర్ల మేర పెను శబ్దం ప్రజల చెవులను గింగిర్లు ఎత్తించాయి. విపరీత శబ్దానికి, పేలుడు ధాటికి దేవరలంక, గోపాయలంక తదితర గ్రామాల్లో పలు ఇళ్ల గోడలు బీటలు వారాయి.
ఇదీ విస్ఫోటాల చరిత్ర
● 1997 ఫిబ్రవరి 19న రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో బ్లో అవుట్ జరిగింది.
● 2006 సెప్టెంబర్ 19న అమలాపురం రూరల్ మండ లం తాండపల్లిలో మరో బ్లో అవుట్ సంభవించింది.
● 2014 జూన్ 27న మామిడికుదురు మండలం నగరంలో గెయిల్‌కు చెందిన గ్యాస్ పైపులైన్ల బ్లాస్ట్ ( విస్ఫోటం) అయ్యాయి. ఆ రోజు తెలతెలవారుతుండగా అనేక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ప్రమాదంలో 22 మంది మృత్యువాత పడ్డారు. కోనసీమ చరిత్రలో చమురు సంస్థల ప్రమాదాలలో ఇది అత్యంత విషాదకరమైనది. తీవ్రమైనది.
● 1992లో మామిడికుదురు మండలం కొమరాడలో బ్లో అవుట్ సంభవించింది.
● 2020 ఫిబ్రవరి 2న కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో బ్లో అవుట్ జరిగింది.
ప్రాణాలు అరచేత పట్టుకొని పొరుగు ఊళ్లకు..
బ్లో అవుట్ జరిగిన ప్రతిసారీ ఆ పరిసర గ్రామాల ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీయడం, తమ ఇళ్లకు తాళాలు వేసి పొరుగు ఊళ్లు వెళ్లిపోవడం సాధారణమైపోయింది. పొరుగు ఊళ్లు వెళ్లి తలదాచుకుంటున్నారు. బ్లో అవుట్లు జరిగిన గ్రామాల్లో ప్రజలు తమ ఇంట్లో పొయ్యిలు వెలిగించకుండా పస్తులు ఉండటం సాధారణమైపోయింది. ఎందుకంటే అప్పటికే బ్లో అవుట్ వల్ల గ్రామం అంతటా గ్యాస్ గాలిలో కలిసిపోయి ఉంటుంది. ఆ సమయంలో ఏ చిన్న నిప్పు ముట్టించినా ఘోర ప్రమాదం జరుగుతుంది. అందుకే అగ్గిపుల్ల వెలిగించేందుకు కూడా భయపడిపోతారు.
చేష్టలుడిగి చూస్తున్న చమురు సంస్థలు
ప్రమాదం జరిగిన వెంటనే తేరుకుని నివారణా చర్యలు చేపట్టడంలో ఓఎన్జీసీ, గెయిల్, ఇతర ప్రైవేట్ సంస్థలు అనుసరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. వెంటనే స్పందించడంలో ఆ సంస్థ సంక్షోభ నివారణ జట్టు వచ్చే వరకు స్థానిక సిబ్బంది కళ్లప్పగించి చూడాల్సి వస్తోంది. ప్రమాదాలు ఎదుర్కొనే సామగ్రి, ఇతర వస్తువులు వారికి అందుబాటులో ఉండడం లేదు. కోనసీమ నుంచి కోట్లాది రూపాయలు తరలించుకుపోతున్న చమురు సంస్థలు అంతర్జాతీయంగా సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా అందిపుచ్చుకోవడం లేదు. కనీసం ప్రమాదాల నుంచి అనుభవాలు కూడా నేర్చుకోకపోవడంపై ఈ ప్రాంత వాసుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బ్లో అవుట్ అదుపునకు విదేశీ, స్వదేశీ నిపుణులు
బ్లో అవుట్‌ను అదుపు చేసేందుకు విదేశీ, స్వదేశీ నిపుణులు రావలసి ఉందని అధికారులు అంటున్నారు. ఇతర దేశాలతో పాటు ముంబయి, గుజరాత్ నుంచి ప్రత్యేక బృందాలను రప్పించేందుకు ఓన్‌ఎన్‌జీసీ వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. యంత్రాలు, రసాయనాలు, ఆధునిక సాంకేతిక పరికరాలు కూడా విదేశాల నుంచి రావలసి ఉంది. రాజమహేంద్రవరం. తూర్పుపాలెంకు చెందిన క్రైసిస్ మేనేజ్‌మెంట్ బృందాలు ప్రమాద స్థలానికి మంగళవారం చేరుకుంటాయని ఓన్‌ఎన్‌జీసీ అధికారులు తెలిపారు. ఇప్పటికే మంటలు ఆర్పే కొన్ని యంత్రాలు అక్కడకు చేరుకున్నాయి. ఇరుసుమండ గ్రామంలోని కొంతమంది రాత్రి సమయంలో ఇళ్లకు చేరుకున్నారు. గ్యాస్ మండిపోవడంతో పెద్దగా ప్రమాదం ఉండదని భావించి గ్రామస్తులను పోలీసులు, అధికారులు, ఇళ్లలోకి అనుమతిస్తున్నారు.
డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీ రిగ్ వద్ద ఎగసి పడుతున్న మంటలు
సీమ గుండెల్లో చిచ్చు
సాక్షి, అమలాపురం/ మలికిపురం/ అంబాజీపేట: మొన్న దేవరపల్లి... నిన్న నగరం.. నేడు ఇరుసుమండ. కోనసీమలో ప్రాంతాలు మారుతున్నాయి కాని.. చమురు సంస్థలు చేస్తున్న విధ్వంసం మారడం లేదు. ఈ ప్రాంతం నుంచి కోట్ల రూపాయల చమురు, సహజ వాయువు కొల్లగొట్టుకుపోతున్నా స్థానిక అభివృద్ధి.. ప్రజలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. చమురు సంస్థల కార్యకలాపాల వల్ల జరుగుతున్న బ్లో అవుట్‌లు.. గ్యాస్ లీకేజుల వల్ల ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందో తెలియని దుర్భర పరిస్థితులలో కోనసీమ జిల్లా ప్రజలు బిక్కు బిక్కు మంటున్నారు. ముఖ్యంగా రాజోలు, పి.గన్నవరం కొత్తపేట, అమలాపురం నియోజకవర్గాల ప్రజలు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. గతం నుంచీ ఇలా లీకేజీలు, బ్లో అవుట్‌ల ఘటనలు జరగడం వల్ల వీటితో సహజ జీవనం తప్పదని వారు మానసికంగా సిద్ధపడిపోయారు. అలా భయపడినట్లే తాజాగా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో సోమవారం సంభవించిన భారీ బ్లో అవుట్‌తో ఈ ప్రాంతాల ప్రజలు భీతావహులయ్యారు. ఉదయం 11 గంటలకు ఇంటి పెద్దలు ఎవరి పనులకు వారు వెళ్లిపోయిన తరువాత సంభవించిన ఘటనతో ప్రజలు షాక్ తిన్నారు.
భారీ శబ్దాలు, విస్తరించిన తెల్లని పొగ
ఉదయం పదకొండు గంటల సమయంలో సిబ్బంది డ్రిల్లింగ్ చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ ఎగదన్నుకు వచ్చింది. సిబ్బంది దీనిని అదుపు చేసేందుకు చేసిన యత్నాలు విఫలం కావడం, రానురానూ గ్యాస్ తీవ్ర పీడనంతో బయటకు ఎగదన్నడంతో వారు రిగ్‌ను వదిలి కేకలు వేసుకుంటూ ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో రిగ్ వద్ద పదిమంది వరకు సిబ్బంది ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్యాస్ ఎగదన్నుకు వస్తూనే ఉంది. ఈ సమయంలో భారీ శబ్దాలు రావడం, గ్యాస్ తెల్లని పొగలా చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడం చూసి సమీప గ్రామాల వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. వృద్ధులు, చిన్న పిల్లలను చంకన వేసుకుని తల్లిదండ్రులు పరుగులు పెట్టారు. డ్రిల్ సైటుకు సమీపంలో నాట్లు వేస్తున్న కూలీలు పేలుడు ధాటికి పొలాల్లో పడిపోయారు. స్థానిక రైతులు తమ పాడి పశువులను దూర ప్రాంతాలకు తరలించారు. వెంటనే లేని అక్కడి నుంచి పరుగు అందుకున్నారు. రెండు గంటల పాటు గ్యాస్ ఎగజిమ్ముతున్న సమయంలో రెవెన్యూ, పంచాయతీ, పోలీసులు చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశారు. ఇరుసుమండతోపాటు లక్కవరం గ్రామస్తులను ఖాళీ చేయించారు. స్థానికులను విద్యుత్ వినియోగించవద్దని, నిప్పు రాజేయవద్దని మైకులతో ప్రచారం చేశారు. రెండు గంటల తరువాత మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒక్కసారిగా మంటలు రాజుకుని భారీ పేలుడు సంభవించింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున రావడంతో వీరిని కట్టడి చేయడం పోలీసులకు తలకుమించిన భారంగా మారింది. అర్ధరాత్రి వరకు మంటలు అదుపులోకి రాలేదు. రాత్రి ఆరు గంటల సమయంలో రాజమహేంద్రవరం నుంచి వచ్చిన సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే మంటలను ఎప్పుడు అదుపులోకి తీసుకువస్తారనే దానిపై ఓఎన్జీసీ వర్గాలు, డ్రిల్లింగ్ చేస్తున్న కంపెనీ ప్రతినిధులు తేల్చిచెప్పలేకపోతున్నారు. అయితే పగటిపూట ప్రమాదం జరగడం వల్ల ప్రాణనష్టం లేదని స్థానికులు కొంత వరకు ఊరట చెందుతున్నారు.
ఇళ్లు వదిలి రోడ్డుపైకి వచ్చిన లక్కవరం గ్రామస్తులు
8
కోనసీమలో నిత్యకృత్యంగా మారిన ప్రమాదాలు
తరచు బ్లో అవుట్‌లు..
గ్యాస్ లీకేజ్‌లు
మందుపాతరల మీద
జన జీవనం
ప్రమాదం జరిగితే చేష్టలుడిగి
చూస్తున్న చమురు సంస్థలు
మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026
మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026
మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026
మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026


