మరో చౌకబారు నిర్ణయం! | - | Sakshi
Sakshi News home page

మరో చౌకబారు నిర్ణయం!

Jan 6 2026 7:30 AM | Updated on Jan 6 2026 7:30 AM

మరో చ

మరో చౌకబారు నిర్ణయం!

చౌక ధరల దుకాణాల ద్వారా

కొందరికే చెక్కి గోధుమపిండి

జిల్లాలో రాజమహేంద్రవరం

నగరానికే పరిమితం

83,482 కార్డు దారులకు

మాత్రమే పంపిణీ

జిల్లాలో రైస్‌ కార్డుదారులు

6,55,444 మంది

చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక

నిలిచిన కందిపప్పు పంపిణీ

ఆగిపోయిన ఇంటింటికీ రేషన్‌

సరకుల సరఫరా

సర్కారు తీరుపై జనం ఆగ్రహం

రాజమేహేంద్రవరం రూరల్‌: చంద్రబాబు ప్రభుత్వంలో పావలా పనికి..రూపాయి ప్రచారం అనే నానుడికి ఇదొక నిదర్శనం. సంక్రాంతి పండగ సమయంలో చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు, మధ్యతరగతి వర్గాలకు మేలు చేసేందుకు చెక్కి గోధుమపిండి పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని చంద్రబాబు వంత మీడియా, సామాజిక మాధ్యమాలు ఊదరగొట్టాయి. తీరా చేసి కేవలం జిల్లా ప్రధాన కేంద్రం ఉన్న నగరాలకు, పట్టణాలకు మాత్రమే గోధుమపిండి పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఇప్పుడు చెబుతోంది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్‌కార్డుపై కేజీ చొప్పున గోధుమపిండి ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెప్పింది. బహిరంగ మార్కెట్‌లో కేజీ క్వాలిటీ గోధుమ పిండి రూ.60 నుంచి రూ.65 వరకు పలుకుతోంది. సంక్రాంతి నాడు పేదలకు మేలు చేసేందుకు ఇలా పంపిణీ చేస్తున్నామని చెప్పుకొచ్చింది. దీనిపై విస్తృతంగా ప్రచారం హోరెత్తించింది. తీరా అమలు చేయాల్సిన సమయానికి వచ్చే సరికి జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోనే ఇస్తామంటోంది. నగరపాలకసంస్థ పరిధిలో కేవలం 83,482 రైస్‌ కార్డుదారులకు మాత్రమే పంపిణీ పరిమితం చేశారు. ఈ నెల రెండవ తేదీన జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మేఘాస్వరూప్‌ చేతులమీదుగా గోధుమపిండి పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు.

మండిపడుతున్న వినియోగదారులు

చెక్కి గోధుమ పిండి కేవలం రాజమహేంద్రవరం నగరం వాసులకు మాత్రమే పరిమితం అని తెలిసి జిల్లాలోని రైస్‌కార్డుదారులు కంగుతిన్నారు. జిల్లాలో 6,55,444 రైస్‌కార్డుదారులు ఉన్నారు. అంటే మొత్తం లబ్ధిదారుల్లో కేవలం 14శాతం మందికి మాత్రమే గోధుమపిండి అందుతుందని అంచనా. జిల్లాలో కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపాలిటీలతో పాటు, 21 మండలాల్లో ఈ గోధుమపిండి పంపిణీ లేదు. దీనిపై వినియోగదారులు మండిపడుతున్నారు. పండగ రాజమహేంద్రవరం నగరవాసులకేనా అని ప్రశ్నిస్తున్నారు.

బాబు ప్రభుత్వంలో

రేషన్‌ వ్యవస్థ చిన్నాభిన్నం

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాపంపిణీ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో నాణ్యమైన బియ్యం (ఫోర్టిఫైడ్‌ రైస్‌) అందించేవారు. అరకేజీ పంచదార, కేజీ చొప్పున కందిపప్పు, గోధుమపిండిని వినియోగదారులకు అందజేసేవారు. రేషన్‌ సరకులను మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌(ఎండీయూ)ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ వ్యవస్థను తొలగించింది. ఇప్పుడు వృద్ధులు, వితంతవులు కూడా రేషన్‌దుకాణాల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఎండీయూలను తొలగించడంతో సుమారు 400 మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. వీరు రోడ్డెక్కి ఆందోళన చేసినా చంద్రబాబు ప్రభుత్వం కనికరం చూపలేదు. పలు సందర్భాలలో రేషన్‌ ద్వారా ముతక బియ్యం ఇస్తుండడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. గత ఏడాది జనవరిలో కిలో రూ.67 చొప్పున అందించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు కందిపప్పును పంపిణీ చేయలేదు బహిరంగ మార్కెట్‌లో కేజీ కందిపప్పును రూ.120 నుంచి రూ.135 చేసి కొనుగోలు చేయాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో గోధుమపిండి ప్రతి లబ్ధిదారునికి అందించగా, బాబు ప్రభుత్వం నిలిపివేసింది. తాజాగా దీనిని రాజమహేంద్రవరం నగర పరిధిలో కేజీ రూ.20 చొప్పున అందించాలని నిర్ణయించారు. కాగా గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో కిలో గోధుమపిండి రూ.18 చొప్పున ప్రతి నెలా అందరికీ అందించేవారు.

ప్రతి ఒక్కరికీ గోధుమపిండి అందించాలి

పేద, మధ్య తరగతికి మేలు చేసే ప్రతి నిత్యావసర వస్తువును ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందరికీ అందించాలి. గోధుమపిండి ప్రతి లబ్ధిదారునికి అందించాలి. నాణ్యమైన బియ్యంతో పాటు కందిపప్పు ఇతర వస్తువులు అందించేందుకు చర్యలు తీసుకోవాలి.

– పడాల రామకృష్ణ,

సీపీఎం గ్రామ కార్యదర్శి, ధవళేశ్వరం

మరో చౌకబారు నిర్ణయం!1
1/2

మరో చౌకబారు నిర్ణయం!

మరో చౌకబారు నిర్ణయం!2
2/2

మరో చౌకబారు నిర్ణయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement