చుట్టుముట్టి.. చేతులతో మెడను బిగించి.. | - | Sakshi
Sakshi News home page

చుట్టుముట్టి.. చేతులతో మెడను బిగించి..

Jan 6 2026 7:30 AM | Updated on Jan 6 2026 7:30 AM

చుట్ట

చుట్టుముట్టి.. చేతులతో మెడను బిగించి..

కపిలేశ్వరపురం (మండపేట): మండపేటలోని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కార్యాలయం వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పట్ల పోలీసుల దురుసుగా ప్రవర్తించారు. ప్రజా సమస్యలపై ధర్నా చేసేందుకు బయలుదేరిన ఆయనను పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారు. తెల్లవారు జామునే పెద్ద ఎత్తున పోలీసులు మండపేట పట్టణంలో మోహరించారు. మున్సిపల్‌ కార్యాలయం వద్ద, బస్టాండ్‌లోని రిక్షా స్టాండ్‌ వద్ద, ప్రధాన కూడళ్లలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. సామాన్య ప్రజల సమస్యల పట్ల అధికార పార్టీ నేతలు, వారికి వత్తాసు పలుకుతున్న మున్సిపల్‌ కమిషనర్‌ టీవీ రంగారావు స్పందిస్తున్న తీరును ప్రశ్నించేందుకు బయలుదేరిన ఎమ్మెల్సీ తోటను పోలీసులు నిర్బంధించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పార్టీ కార్యాలయం వద్ద తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. మండపేట మున్సిపల్‌ కమిషనర్‌ అధికార పార్టీ నేతలా వ్యవహరిస్తూ సామాన్యుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ పట్టణ ప్రజలు ఎమ్మెల్సీ తోటకు విన్నవించుకున్నారు. అతి సులువుగా పరిష్కారమయ్యే సమస్యలకు సైతం రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని, విపక్షానికి చెందిన వారిని వేధిస్తున్నారంటూ తమ గోడును ఎమ్మెల్సీ తోటకు తెలిపారు. దీనిపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అనేక సార్లు మున్సిపల్‌ కమిషనర్‌కు తన తీరును మార్చుకోవాలని సూచించారు. పరిపాలనా పరమైన నియమ నిబంధనల మేరకే నడుచుకోవాలని చెప్పి చూశారు. అయితే కమిషనర్‌ తన వైఖరిని మార్చుకోకుండా మరింత పేట్రేగిపోతున్నారంటూ పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపల్‌ సాధారణ నిధులు రూ.10 లక్షలతో బస్టాండ్‌ వద్ద రిక్షా కార్మికుల నీడ కోసం రేకుల షెడ్డు నిర్మించారు. ఆ అభిమానంతో కార్మికులు అప్పట్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఫొటోలతో కూడిన రిక్షాస్టాండ్‌ బోర్డును ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల మున్సిపల్‌ కమినషర్‌ రంగారావు తన సిబ్బందితో ఆ బోర్డును తొలగించారు. ఆ స్థానంలో పసుపు పచ్చ రంగుతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఫొటోలతో ఉన్న బోర్డు ఏర్పాటు చేశారు. ఇలా చేయడం కమిషనర్‌ నియంతృత్వానికి పరాకాష్ట అంటూ సోమవారం ధర్నాకు ఎమ్మెల్సీ తోట పిలుపునిచ్చారు. సంఘీభావంగా నియోజకవర్గంలోని ప్రజలు, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

రణరంగంగా మార్చిన పోలీసులు

ధర్నాలో పాల్గొనేందుకు ఉదయమే ఎమ్మెల్సీ తోట, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, దూలం వెంకన్నబాబు, సీనియర్‌ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, రెడ్డి రాజుబాబు, కొవ్వూరి త్రినాథరెడ్డి తదితరులు కార్యాలయానికి వచ్చారు. మండపేట పట్టణ, రూరల్‌ సీఐలు ఐ.సురేష్‌, పి.దొరరాజు ఆధ్వర్యంలోని పోలీసులు కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఎమ్మెల్సీ త్రిమూర్తులు బయటకు వస్తుండగా గుమ్మం వద్దనే నిలువరించారు. తాను ప్రజాస్వామ్యయుతంగానే ఆందోళన చేస్తున్నానని, సామాన్య ప్రజలు కోసమే వెళ్తున్నానని, రాజకీయ ప్రయోజనాలు ఏమీ లేవని పోలీసులకు ఎమ్మెల్సీ స్పష్టత ఇచ్చారు. అనుమతి లేదన్న కారణంతో పోలీసులు బలగంతో దౌర్జన్యంగా అడ్డుకున్నారు. ప్రజా క్షేత్రానికి వెళ్లడం తన హక్కు, బాధ్యత అంటూ ఎమ్మెల్సీ తోట ముందుకు సాగగా ఆయన్ను చుట్టుముట్టి, చేతులతో మెడను బిగించి బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించేందుకు పోలీసులు ప్రయత్నించారు. పార్టీ శ్రేణులు ముఖ్యంగా మహిళా నాయకులు పోలీసుల చర్యను చైతన్యంతో అడ్డుకున్నారు. డీఎస్పీ రఘువీర్‌ వచ్చి ఎమ్మెల్సీ తోటతో చర్చలు జరిపారు. సమస్యలు చెప్పేందుకు పరిమిత సంఖ్యలో వస్తానంటే కమిషనర్‌ వద్దకు తీసుకెళ్తానన్నారు. కమిషనర్‌ దౌర్జన్యాలకు బలైపోతున్నది నలుగురు కాదని, వేలాది మంది ఉన్నారని, అందరూ మున్సిపల్‌ కార్యాలయానికి వస్తామని ఎమ్మెల్సీ తోట అన్నారు. పోలీసులుగా ప్రజల తరఫున నిలబడదలచుకుంటే కమిషనర్‌నే ప్రజలు వద్దకు వచ్చి సమాధానం చెప్పేలా చూడాలని కోరారు. మున్సిపాలిటీకి చెందిన రూ.నాలుగు కోట్ల విలువైన స్థలాన్ని గత ప్రభుత్వ హయాంలో తాను కాపాడి తిరిగి మున్సిపాలిటీకి అప్పగించానన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాగానే గతంలో ఆక్రమించిన వ్యక్తే మరోసారి కబ్జాచేసి గోడ నిర్మించడం వెనుక కమిషనర్‌ హస్తం ఉందన్నారు. పట్టణంలో కొంతమందిని లక్ష్యంగా పెట్టుకుని వారి భవనాలను కూల్చేయిస్తున్నారంటూ కమిషనర్‌ తీరును పోలీసులకు వివరించారు. అలాంటి కమిషనర్‌కి వ్యతిరేకంగా ప్రజలు ప్రశ్నిస్తామని వెళ్తుండగా ఆపుతామనడం ధర్మం కాదన్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటో ఉన్న రిక్షాస్టాండ్‌ బోర్డును అదే స్థలంలో పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. తర్జనభర్జనల అనంతరం 20 రోజుల్లో బోర్డును పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. నిర్దేశించిన సమయంలోపు బోర్డు పునరుద్ధరించకపోతే జిల్లా వ్యాప్తంగా ప్రజలు కమిషనర్‌కు తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్సీ తోట హెచ్చరించారు. వైఎస్సార్‌ సీపీ పట్టణ, మండలాల అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్‌, అడబాల బాబ్జి, గూటం సత్యనారాయణ, వెలగల సత్యనారాయణరెడ్డి, ఎంపీపీలు జుత్తుక వెంకటలక్ష్మి, నౌడు వెంకటరమణ, నియోజకవర్గంలోని నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ తోటను నిలువరిస్తున్న పోలీసులు

మండపేటలో వైఎస్సార్‌ సీపీ కార్యాలయాన్ని చుట్టుముట్టిన పోలీసులు

ఎమ్మెల్సీ తోట పట్ల

పోలీసుల దురుసు ప్రవర్తన

ధర్నాకు వెళ్తామన్నందుకు దౌర్జన్యం

రాజకీయ నేతను తలపిస్తున్న

మున్సిపల్‌ కమిషనర్‌

మాజీ సీఎం జగన్‌ ఫ్లెక్సీ ఉన్న

బోర్డు తొలగింపు

పునరుద్ధరించాలంటూ

వైఎస్సార్‌ సీపీ ఆందోళన

చుట్టుముట్టి.. చేతులతో మెడను బిగించి..1
1/1

చుట్టుముట్టి.. చేతులతో మెడను బిగించి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement