ఎరువు దరువు!
సాక్షి, రాజమహేంద్రవరం: ఖరీఫ్‌లో మోంథా తుపాను దెబ్బకు రైతులు అతలాకుతలం అయ్యారు. పంట చేతికి వచ్చే సమయంలో వచ్చిన తుపానుతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రబీలోనైనా కోలుకుందామనుకుంటే పెరిగిన ఎరువుల ధరలు తిరిగి ఆందోళనలోకి నెడుతున్నాయి. అదుకోవాల్సిన ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచి మరింత భారం మోపుతోంది. కొన్ని ఎరువులకు సబ్సిడీ ఇస్తున్నామని చెబుతున్నా ధరల భారం తప్పడం లేదు. ఇప్పటికే పెరిగిన సాగు పెట్టుబడితో రైతులు సతమతమవుతున్నారు. ఇలాంటి సమయంలో బస్తాకు రూ.200కు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
జిల్లాలో ఇలా...
జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్‌లో 1.97 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. వరి అత్యధికంగా 1,51,539 ఎకరాల్లో సాగవుతోంది. ఖరీఫ్‌తో పోలిస్తే రబీ సీజన్‌లోనే ఎరువుల ఆవశ్యకత అధికంగా ఉంటుంది. ఎకరానికి ఆరు నుంచి పది బస్తాల వరకు వివిధ రకాల ఎరువుల వినియోగం ఉంటుంది. ఇందులో యూరియా 30 శాతం, పొటాష్, సూపర్ ఫాస్పేట్, మిశ్రమ ఎరువులు 70 శాతం వినియోగిస్తారు. మిశ్రమ ఎరువుల్లో పొటాష్, ఫాస్పరస్ వంటివి ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఎకరానికి నాలుగు బస్తాల వరకు రెండు రకాల ఎరువులు, రెండు బస్తాల యూరియా, ఆర బస్తా వరకు పొటాష్ వినియోగిస్తుంటారు. రబీ సీజన్‌లో మొత్తం 1,15,781 మెట్రిక్ టన్నుల ఎరువల ఆవశ్యకత ఉన్నట్లు వ్యవసాయ శాఖ లెక్కలు వేసింది.
బస్తాకు రూ.200కు పైగా పెంపు
గతేడాదితో పోలిస్తే ప్రస్తుత రబీ సీజన్‌లో ఎరువుల ధరలు అమాంతం పెంచేశారు. బస్తాకు రూ.100 నుంచి రూ.220 వరకు పెరిగింది. జిల్లాలో 1.97 లక్షల ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగు చేస్తుండగా రైతులపై ఎరువుల రూపంలో రూ.13.82 కోట్ల అదనపు భారం పడనుంది.
రూ.13.82 కోట్ల భారం
పెరిగిన ఎరువుల ధరలతో కర్షకులకు అదనపు భారం పడనుంది. రబీ సీజన్‌లో అధికంగా వినియోగించే ఎరువులను లక్ష్యంగా చేసుకుని కంపెనీలు ధరలు పెంచేశాయి. 10:26:26 కాంప్లెక్స్ ఎరువుల బస్తా (50 కిలోలు) రూ.220 పెరిగింది. 14:35:14, 20:20:013, ఇతర రకాల ఎరువులపై బస్తాకు రూ.వంద నుంచి రూ.150 పెరిగింది. ఎకరం పొలానికి వినియోగించే ఎరువులను గత సీజన్‌తో పోలిస్తే ప్రస్తుతం రూ.700 వరకు రైతులపై అదనపు భారం పడుతోందని వ్యవసాయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో రబీ సీజన్‌లో 1.97లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే.. రైతులపై రూ.13.82 కోట్ల అదనపు భారం ఎరువుల రూపంలో పడనుంది.
బహిరంగ విపణిలో మాయ
రబీలో వరి, మొక్కజొన్న, మినుము, పత్తి తదితర పంటలు అత్యధికంగా సాగవుతాయి. ప్రస్తుతం వరి నాట్ల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో సుమారు 10 వేల హెక్టార్లలో వరి నాట్లు వేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడిస్తోంది. ఇదే అదునుగా భావిస్తున్న వ్యాపారులు రైతులకు షాక్ ఇస్తున్నారు. యూరియా, ఫాస్ఫేట్ ఎరువుల కోసం దుకాణాలను ఆశ్రయిస్తే లింక్ ఎరువులు కొనాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మొక్కజొన్న, వరి విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేసిన రైతులకు మాత్రమే యూరియా విక్రయిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఎరువుల సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తుండటం, సకాలంలో ఎరువులు అందుబాటులో పెట్టకపోవడం, ఒక వేళ సరుకు వచ్చినా.. పీఏసీఎస్‌లలో పచ్చ నేతలు సిఫార్సు చేసిన వారికే అందుతుండటంతో సామాన్య రైతులకు ఎరువులు చేరడం లేదు.
అధికంగా వసూళ్లు
ప్రభుత్వం అందించే సబ్సిడీ పోను 50 కేజీల యూరియా బస్తా ధర రూ.2,642 ఉంది. వాటిలో రూ.2,375 ప్రభుత్వ సబ్సిడీ కాగా.. బస్తా రూ.267 విక్రయించాల్సి ఉంది. హమాలీ ఖర్చుతో కలిపి గరిష్టంగా రూ.280 విక్రయించాలి. కానీ కొందరు వ్యాపారులు బస్తాపై రూ.100 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం.
పెరిగిన ఎరువుల ధరలు ఇలా..
ఎరువుల రకం పాత ధర కొత్త ధర
10:26:26 రూ.1,700 రూ.1,920
14:35:14: రూ.1,800 రూ.1,950
20:20:013 రూ.1,300 రూ.1,400
రబీలో ఎరువుల ఆవశ్యకత ఇలా..
జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్‌లో ఎరువుల ఆవశ్యకతపై వ్యవసాయ అధికారులు అంచనాలు రూపొందించారు. అవి ఇలా...
ఎరువుల రకం ఆవస్యకత
(మెట్రిక్ టన్నుల్లో)
యూరియా 58,950
డీఏపీ 8,564
ఎంఓపీ 5,814
ఎన్‌పీకే 34,306
ఎస్‌ఎస్‌పీ 8,146
రబీ ఆరంభంలోనే అన్నదాతకు కష్టాలు
కాంప్లెక్స్ ఎరువుల ధరల పెంపు
మోంథాతో ఇప్పటికే కోలుకోలేని పరిస్థితి
జిల్లాలో 1.97 లక్షల ఎకరాల్లో సాగు
అత్యధికంగా వరి 1,51,539
ఎకరాల్లో 1,15,781 టన్నుల
ఎరువుల ఆవశ్యకత
రైతులపై రూ.13.82 కోట్ల భారం
ధరల పెంపు దారుణం
ఖరీఫ్‌లో వచ్చిన మోంథా తుపాను ధాటికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి పంటలకు తీరని నష్టం కలిగింది. 50 శాతానికి పైగా పంట దెబ్బతింది. రైతులు పంట సాగుకు పెట్టిన పెట్టుబడులు అందక ఆర్థికంగా చితికిపోయారు. తుపాను పరిహారం నేటికీ ఇచ్చిన దాఖలాలు లేవు. రబీలోనైనా ఖరీఫ్ నష్టాలను అధిగమిద్దామనుకుంటే ఎరువుల బస్తాపై రూ.100 నుంచి రూ.220 వరకు ధరలు పెంచేశారు. రైతులపై మరింత అదనపు భారం పడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోవాలి.
– పరిమి సోమరాజు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి
ఎరువు దరువు!
ఎరువు దరువు!


