లైఫ్ సర్టిఫికెట్లకు దరఖాస్తుల స్వీకరణ
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు సమర్పించాల్సిన వార్షిక జీవన ప్రమాణ ధ్రువపత్రాలను (లైఫ్ సర్టిఫికెట్లు) జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా స్వీకరిస్తున్నట్టు జిల్లా ఖజానా, లెక్కల అధికారి ఎ.గణేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పింఛనుదారులు లైఫ్ సర్టిఫికెట్లను జీవన్ ప్రమాణ్ పోర్టల్‌లో కానీ, పెన్షనర్ల వ్యక్తిగత సీఎఫ్‌ఎంఎస్ లాగిన్ ద్వారా కానీ, ఏదైనా ఖజానా కార్యాలయంలో సమర్పించవచ్చునన్నారు. పెన్షనర్ల ఆధార్, మొబైల్ నంబర్ (ఓటీపీ కోసం), పీపీఓ నంబరు, బ్యాంక్ అకౌంట్ నంబర్లు సరిచూసుకోవాల్సి ఉంటుందన్నారు. ఫిబ్రవరి నెలఖారులోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని, లేకుంటే ఏప్రిల్ 1న ఇచ్చే మార్చి నెల పెన్షన్ నిలిచిపోతుందని గుర్తించాలని కోరారు. జిల్లా పరిధిలో కాకినాడ డివిజనల్ ఖజానా కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉన్నాయని, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని, జగ్గంపేట ఉప ఖజానా కార్యాలయాలలో కూడా అందుబాటులో ఉన్నాయన్నారు.
పుష్కరాల నాటికి అన్ని
సదుపాయాల ఏర్పాటు
రాజమహేంద్రవరం సిటీ: వచ్చే 2027 పుష్కరాల నాటికి అన్ని మౌలిక వసతులు కల్పించి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. శుక్రవారం పుష్కరాల నిర్వహణపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాలు సమీపిస్తున్నందున శాశ్వత మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలన్నారు. యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు, తాగునీరు, శానిటేషన్, పార్కింగ్, సేద తీరేందుకు ప్రత్యేక శిబిరాలు, టాయిలెట్లు వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. కేవలం పుష్కరాలకే కాకుండా శాశ్వత ప్రాతిపదికన భవిష్యత్తులో ఉపయోగపడేలా పనులు చేపట్టాలన్నారు. ప్రతి అభివృద్ధి పనినీ ఆన్‌లైన్ చేయాలని, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో పొందుపరచాలన్నారు. పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడంతో ముఖ్యమంత్రి స్థాయిలో రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ పీవీ రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, ఎస్‌ఈ రీటా, ఎంహెచ్‌ఓ వినూత్న, సీపీ (రుడా) జీవీఎస్‌ఎన్.మూర్తి, డిప్యూటీ సిటీ ప్లానర్ నాయుడు, ఈఈలు మదర్సా అలీ, మాధవి, ఏడీహెచ్ అనిత, ఏఈలు పాల్గొన్నారు.
పట్టాదారు
పాస్ పుస్తకాల పంపిణీ
బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): జిల్లాలో రీ సర్వే పూర్తయిన గ్రామాల రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ శుక్రవారం స్థానిక స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందజేస్తున్నామని తెలిపారు.


