డ్రాగన్ పడవ పోటీలకు పటిష్ట భద్రత
● కలెక్టర్ మహేష్‌కుమార్
● ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష
కొత్తపేట: ఆత్రేయపురం మండలంలో సంక్రాంతి డ్రాగన్ పడవలు, ఈత పోటీలను పటిష్ట రక్షణ భద్రతా ఏర్పాట్ల నడుమ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ఈ నెల 11, 12, 13 తేదీలలో సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ డ్రాగన్ పడవల పోటీలు, ఈత, రంగోలి, పతంగుల పోటీలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం పులిదిండి గ్రామంలో కయాకింగ్ డ్రాగన్ బోటింగ్‌ను కలెక్టర్ మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు లాంఛనంగా ప్రారంభించారు. కాలువలో పడవ పోటీల ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ట్రయల్ రన్‌లో భాగంగా కలెక్టర్ మహేష్ కుమార్ స్వయంగా కియా కింగ్ డ్రాగన్ పడవను నడుపుతుండగా పడవ అదుపు తప్పి ఎడమ వైపుకు ఒరిగిపోవడంతో ఆయన కాలువలోకి పడిపోయారు. ఆ సమయంలో లైఫ్ జాకెట్ వేసుకుని ఉండటం, పడవలోను, ఆ పడవను అనుసరిస్తున్న బోటులో గజఈతగాళ్లు అప్రమత్తమై వెంటనే కాలువలో దూకి కలెక్టర్‌ను రక్షించి, ప్రక్క బోటులోకి ఎక్కించారు. అనంతరం పోటీల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ సందర్శకుల తాకిడికి అనుగుణంగా జెట్టీలు, లైఫ్ జాకెట్లతో రక్షణ పరమైన జాగ్రత్తలు పాటిస్తూ క్రియాశీలకంగా వహించాలన్నారు. ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ గత ఏడాది కన్నా రెట్టింపు ఉత్సాహంతో పోటీలు నిర్వహించాలన్నారు. ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ గోదావరి తీరంలో సంక్రాంతిని పురస్కరించుకుని ఈ ఉత్సవాలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు. కార్యక్రమంలో ఆర్‌డీవో పి.శ్రీకర్, డీఎస్పీ సుంకర మురళీమోహన్, జిల్లా పర్యాటక అధికారి అన్వర్, తహసీల్దార్ ఆర్‌డీ రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.
పాస్ పుస్తకాల పంపిణీ
ఆత్రేయపురం సచివాలయం వద్ద శుక్రవారం రైతులకు కొత్త పట్టాదాసు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. దాదాపు 921 పుస్తకాలను నిర్ణీత రుసుముతో రైతులకు పంపిణీ చేశారు.


