పర్యాటకంతో ఉపాధి
కలెక్టర్ కీర్తి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో పర్యాటక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కీర్తి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా టూరిజం కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా చేపట్టాల్సిన పనులపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ బ్రిడ్జి లంక ద్వీపాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి టెండర్లు పిలిచి పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌లో పనులు చేపట్టాలన్నారు. అక్కడ పిల్లల కోసం రిక్రియేషన్ యాక్టివిటీస్, అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫుడ్, బెవరేజెస్ స్టాల్స్, ఓపెన్ ఎయిర్ వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గోదావరి నదిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడు ఇరిగేషన్ బోట్లను లీజు పద్ధతిలో పర్యాటక బోట్లుగా నిర్వహించేందుకు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవాలని తెలిపారు. నది విహారాల ద్వారా పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించాలని సూచించారు. కడియం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే క్రమంలో హోమ్ స్టేలను ప్రోత్సహిస్తూ స్థానిక రైతులు, గృహ యజమానులకు అవగాహన కల్పించి వాటిని ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా స్థానికులకు ఆదాయం పెరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


