శిఖండి తృతీయ ప్రకృతి కాదు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): చాలామంది భావిస్తున్నట్టు శిఖండి ఆడా మగా కాని తృతీయ ప్రకృతి కాదు. ముందు సీ్త్రగా పుట్టి తరువాత పురుషత్వం పొందినవాడు శిఖండి అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. శుక్రవారం హిందూ సమాజంలో ఆయన వ్యాసభారతంలో ఉద్యోగపర్వాన్ని ముగించి, భీష్మపర్వంలోకి ప్రవేశించారు. తాను సీ్త్రతో కాని, సీ్త్రనామధేయం కలవారితో కాని, ముందు సీ్త్రగా జన్మించి పురుషునిగా మారినవారితో కానీ యుద్ధం చేయనని తన నియమాలను దుర్యోధనునికి వివరిస్తాడు. కురుపాండవులు కొన్ని యుద్ధ నియమాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజు సాయం సమయంలో యుద్ధం ముగిసాక ఇరుపక్షాల మధ్య పరస్పర ప్రీతి ఉండాలి, మాటలతో యుద్ధం చేసేవారిని మాటలతోనే ఎదుర్కోవాలి, అలాగే రథంలో ఉన్నవారు రథంలో ఉన్నవారితో, ఏనుగు మీద ఉన్నవారు అటువంటి వారితో, అశ్వం మీద ఉన్నవాడు అటువంటి వానితో, పదాతి పదాతితోనే యుద్ధం చేయాలని నియమాలను ఏర్పరచుకున్నారు. భారతదేశంలో యుద్ధమనేది ఒక విద్యగా పరిగణింపబడింది. అందులో నీతిశాస్త్రం కూడా ఉన్నదని సామవేదం అన్నారు. వ్యాసుడు ధృతరాష్ట్రునితో నీవు యుద్ధం చూడాలనుకుంటున్నావా అని అడిగితే, క్షత్రియనాశనాన్ని చూడలేను, వినే యోగం ప్రసాదించమని అడిగాడు. వ్యాసుడు యుద్ధ విశేషాలు వివరించడానికి సంజయునికి దివ్యదృష్టిని ప్రసాదించాడు. జయాపజయాలు నిర్ణయించేది సంఖ్యా బలం కాదని–సత్యము, ధర్మము, క్రూరత్వము లేకపోవడం, ప్రయత్నము వంటి లక్షణాలని సామవేదం అన్నారు. ధృతరాష్ట్రుడు సంజయునితో మామకాః, పాండవాః.. మా వాళ్ళు, పాండవులు కురుక్షేత్రంలో ఏమి చేశారో చెప్పమని అడగడంలో అతని భేద దృష్టి కనపడుతున్నదని, పాండవులు ఎప్పుడూ ధృతరాష్ట్రుని తండ్రిగానే భావించారని సామవేదం వివరించారు. మోహానికి లోనైన అర్జునునికి కృష్ణ పరమాత్మ గీతను బోధించాడు. ‘క్షుద్రం హృదయ దౌర్బల్యం’ అని ఆయన అర్జునునికి కర్తవ్యాన్ని ఉపదేశించాడు. స్వామి వివేకానంద మాటల్లో గీతలోని శ్లోకాలను మరచిపోయినా, ఈ ఒక్క శ్లోకాన్ని యువత గుర్తు చేసుకుంటే చాలని అన్నాడని సామవేదం వివరించారు. ముందుగా భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు మాట్లాడుతూ, మనం భారతం వింటున్నామనే మాట అబద్ధమని, చూస్తున్నామనడం సరి అయినదని అన్నారు.
సమన్వయ సరస్వతి సామవేదం


