అన్నవరం @ 4వ స్థానం
● ఐవీఆర్‌ఎస్ సర్వేలో
మెరుగుపడిన ర్యాంకు
● భక్తులకు అందించే
సేవలలో పుంజుకున్న వృద్ధి
● డిసెంబర్‌లో 67.9 శాతం
మంది సంతృప్తి
అన్నవరం: రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్య క్షేత్రాలలో భక్తులకు అందుతున్న సేవలపై గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అభిప్రాయ సేకరణలో అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నాలుగో స్థానంలో నిలిచింది. నవంబర్‌లో నిర్వహించిన సర్వేలో ఆరో స్థానంలో నిలిచిన దేవస్థానం ఈ సారి నాలుగో స్థానానికి ఎగబాకింది. ఆ స్థానాన్ని దక్కించుకున్నప్పటికీ దేవస్థానంలో నవంబర్‌లో నిర్వహించిన సర్వేలో 33 శాతం మంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేయగా ఈ సారి 32.1 శాతం మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేశారు.
● గత ఏప్రిల్ నెలలో నిర్వహించిన సర్వేలో దేవస్థానం అట్టడుగు స్థానం పొందడంతో జిల్లా లెక్టర్ షణ్మోహన్ ఆలయంలో తనిఖీలు చేసి ఎలాగైనా ఆలయాన్ని మొదటి స్థానంలో నిలపాలని సిబ్బందిని ఆదేశించిన విషయం తెలిసిందే. తరువాత కొంత మెరుగుపడినా మళ్లీ ఆరో స్థానానికి పడిపోయింది. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలవడం కూడా ఆలయ ప్రతిష్టను దిగజార్చినట్టు చెప్తున్నారు.
● గత నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు వాట్సాప్, ఐవీఆర్‌ఎస్ సర్వే నిర్వహించింది. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం దేవస్థానాలలో నిర్వహించిన ఈ సర్వేలో శ్రీకాళహస్తి 71.2 శాతంతో ప్రధమ స్థానంలో నిలవగా 67.9 శాతం భక్తుల సానుకూల స్పందనతో అన్నవరం నాలుగో స్థానంలో నిలిచింది. 66 శాతం సానుకూల స్పందనతో కాణిపాకం ఏడో స్థానంలో నిలిచింది.
నెల వారీగా భక్తుల సంతృప్త స్థాయిలు ఇవీ
● సత్యదేవుని దర్శనం విషయంలో డిసెంబర్‌లో 69.9 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. జూన్‌లో 73, జూలైలో 74, ఆగస్టులో 75.8, సెప్టెంబర్‌లో 74.1, అక్టోబర్‌లో 68, నవంబర్‌లో 69.7 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.
● మౌలిక వసతుల కల్పనలో డిసెంబర్ నెలలో 61.9 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. జూన్‌లో 66 శాతం, జూలైలో 65, ఆగస్టులో 64.9, సెప్టెంబర్‌లో 66, అక్టోబర్‌లో 63, నవంబర్‌లో 61.6 శాతం సానుకూలంగా స్పందించారు.
● స్వామివారి గోధుమ నూక ప్రసాదం నాణ్యతపై డిసెంబర్ నెలలో 78.6 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. జూన్‌లో 77, జూలైలో 78, ఆగష్టులో 76.9, సెప్టెంబర్‌లో 79.2, అక్టోబర్‌లో 76, నవంబర్‌లో 77.6 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.
● పారిశుధ్య నిర్వహణలో డిసెంబర్‌లో 63.1 శాతం మాత్రమే సంతృప్తి వ్యక్తం చేవారు. జూన్‌లో 70, జూలైలో 68, ఆగస్టులో 66.5, సెప్టెంబర్‌లో 64.5, అక్టోబర్‌లో 63, నవంబర్‌లో 64.2 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం మీద డిసెంబర్‌లో 67.9 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, 32.1 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.
పారిశుధ్యం, మౌలిక వసతులపై అసంతృప్తి
దేవస్థానంలో పారిశుద్యం, మౌలిక వసతుల కల్పన ఆశించిన మేర లేదని భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవస్థానంలో గత మూడు నెలలుగా చిత్తూరుకు చెందిన పద్మావతి సంస్థ పారిశుధ్య నిర్వహణను చూస్తోంది. వయోపరిమితి పేరుతో అనుభవజ్ఞులైన 50 మంది సిబ్బందిని తొలగించారు. వారి స్థానంలో రాజకీయ ఒత్తిళ్లతో నియామకమైన కొత్తవారి అనుభవ లేమి వల్ల ఈ అసంతృప్తి నెలకొన్నట్టు చెప్తున్నారు.
ధోబీలతో దుప్పట్లు ఉతికిస్తున్నారు
ఆలయంలోని సత్రాలలొని మంచాలపై దుప్పట్లు, గలేబులు తదితర వస్త్రాలను వాషింగ్ మెషీన్లతో కాకుండా ధోబీలతో ఉతికిస్తుండడం వల్ల శుభ్రత లోపిస్తోందని తెలుస్తోంది. గతంలో కేఎల్‌టీసీ సంస్థ శానిటరీ మిషన్లతో వాటిని ఉతికేవారు. అలాగే నాణ్యమైన మెటీరియల్‌తో పారిశుధ్య పనులు చేస్తుండడం వల్ల కూడా నాణ్యత లోపానికి కారణంగా తెలుస్తోంది. ఈ విషయమై పద్మావతి సంస్థ ప్రతినిధులు వాషింగ్ మెషీన్ ఏర్పాటుకు తాము సిద్ధమేనని కానీ అందుకు అవసరమైన షెడ్డు లేదని చెప్తున్నారు. దీనిపై ఆలయ ఈఈ రామకృష్ణ వివరణ ఇస్తూ షెడ్డు నిర్మాణం పూర్తయ్యిందని త్వరలో ఆ సంస్థకు షెడ్డును అప్పగిస్తామని తెలిపారు.
ప్రసాదం విషయంలో ఊరట
స్వామివారి ప్రసాదం విషయంలో భక్తులు 78.6 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయడం కొంత ఊరట కలిగే విషయం. వాస్తవానికి గోధుమ నూక ప్రసాదంలో నూటికి నూరు శాతం భక్తులు సంతృప్తి వ్యక్తం చేయాల్సినంత నాణ్యతగా ఉంటుంది. కాని 21 శాతం మంది అసంతృప్తికి కారణం ఎవరికి అర్ధం కావడం లేదు. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఎక్కువ సేపు క్యూ లైన్లలో నించోవడం వల్ల అసంతృప్తి, మౌలికవసతులు, పారిశుధ్యం బాగా లేకపోవడం వంటి వాటి ప్రభావం ప్రసాదంపై పడి ఉండవచ్చనే అభిప్రాయం అధికారులలో వ్యక్తమవుతోంది.
వయసు మీరిందనే తొలగించాం
శానిటేషన్ విభాగంలో 55 ఏళ్లు దాటిన వారిని కొనసాగించ వద్దని ప్రభుత్వం నిబంధన విధించడంతో ఆలయంలో 50 మందిని తొలగించాం. వారి వారసులలో ఎవరైనా సమర్ధులుంటే వారి స్థానంలో నియమిస్తాం. అటువంటి వారు ఉంటే దేవస్థానంలో తమ సూపర్‌వైజర్లను కలిస్తే పరిశీలిస్తాం.
– భాస్కరనాయుడు, ఎండీ, పద్మావతి శానిటరీ సంస్థ
అన్నవరం @ 4వ స్థానం


