అలా ముగిశాయి
దేవరపల్లిలో ఆశాజనకంగా ఉన్న వర్జీనియా పొగాకు తోట
రెలుపుకు సిద్ధంగా ఉన్న పొగాకు తోట
● 23,106 హెక్టార్లలో పొగాకు నాట్లు
● 43.89 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి
● 11,351 మంది రైతులు
● 12,814 బ్యారన్లు
● ఆశాజనకంగా తోటలు
● సంక్రాంతికి ప్రారంభం కానున్న క్యూరింగ్‌లు
దేవరపల్లి: టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్‌లోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాల పరిధిలో వర్జీనియా పొగాకు నాట్లు ముగిశాయి. దాదాపు 1964లో దేవరపల్లి మండలం చిన్నాయగూడెంలో ఒక రైతు ఈ ప్రాంతంలో పొగాకు సాగుకు శ్రీకారం చుట్టారు. రెండెకరాల్లో ఆయన చేపట్టిన సాగు నేడు వేల ఎకరాలకు చేరుకుని, మెట్ట ప్రాంత రైతులకు కాసుల పంట పండిస్తోంది. కొంత కాలం గిట్టుబాటు ధర రాక రైతులు ఆర్థికంగా నష్టపోయారు. అయితే, నాలుగేళ్లుగా మార్కెట్లో మంచి ధర పలుకుతూండటంతో రైతులకు ఊహించని లాభాలు వచ్చాయి. దీంతో, ఆయిల్‌పామ్, కొబ్బరి, జీడిమామిడి, మామిడి వంటి ఉద్యాన తోటలను తొలగించి పలువురు పొగాకు సాగుకు మళ్లారు. ఉద్యాన పంటల కంటే అధిక ఆదాయం రావడంతో పొగాకు పంటపై మొగ్గు చూపుతున్నారు. ఏటా అక్టోబర్ 15 నుంచి పొగాకు నాట్లు ప్రారంభించి నవంబరు నెలాఖరుకు పూర్తి చేస్తారు. ఈ ఏడాది నాట్లు నెల రోజులు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ వాతావరనం అనుకూలించడంతో నాట్లు త్వరితగతిన పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు.
23,106 హెక్టార్లలో నాట్లు
2025–26 సంవత్సరానికి గాను 11,351 మంది రైతులు, 12,814 బ్యారన్లను రిజిస్ట్రేషన్ చేయించుని, 23,106 హెక్టార్లలో ఇప్పటి వరకూ నాట్లు వేసినట్లు బోర్డు అధికారులు తెలిపారు. గత ఏడాది 12,879 మంది రైతులు, 14,994 బ్యారన్లు రిజిస్ట్రేషన్లు చేయించుకుని 29,503 హెక్టార్లలో సాగు చేశారు. 2024–25లో 61.27 మిలియన్ కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇవ్వగా, 84 మిలియన్ కిలోలు పండించారు. పంట నియంత్రణలో భాగంగా ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గించి ఉత్పత్తిని 43.78 మిలియన్ల కిలోలకు తగ్గించింది. దీనికి లోబడి మాత్రమే పొగాకు సాగు చేయాలని రైతులకు సూచించారు. నిషేధిత భూములు బాడవ, నల్లరేగడి భూముల్లో పొగాకు పంట వేయవద్దని బోర్డు అధికారులు చెపుతున్నప్పటికీ కొంత మంది రైతులు ఆ భూముల్లో సాగు చేస్తున్నారు.
బ్యారన్ ఖరీదు రూ.13.25 లక్షలు
పొగాకు ధర 2024–25 సీజన్‌లో రికార్డు స్థాయికి చేరుకోవడంతో 2025–26 సంవతరంలో భూముల కౌలు, బ్యారన్ల ఖరీదు, అద్దె కూడా అదే స్థాయిలో పెరిగాయి. పొగాకు సాగుకు కౌలు, చిన్న, సన్నకారు రైతులు ఆసక్తి చూపుతూండటంతో భూముల కౌలు, బ్యారన్ల అద్దెలకు రెక్కలు వచ్చాయి. గత ఏడాది బ్యారన్ ఖరీదు రూ.8 లక్షలు పలకగా, ఈ ఏడాది రూ.13.25 లక్షలకు చేరింది. నాలుగేళ్ల క్రితం బ్యారన్ ఖరీదు రూ.2.25 లక్షలుండేది. అప్పట్లో చాలా మంది రైతులు బ్యారన్లను అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. వారు నష్టపోగా కొనుక్కున్న రైతులు లాభపడ్డారు. గత ఏడాది బ్యారన్ అద్దె రూ.50 వేల నుంచి రూ.లక్ష ఉండగా, ప్రస్తుతం రూ.2.50 లక్షల వరకూ పలుకుతోంది. భూమి కౌలు గత ఏడాది ఎకరం రూ.60 వేలు ఉండగా, ఈ ఏడాది రూ.70 వేలకు పెరిగింది. పొగాకు క్యూరింగ్ చేసుకోవడానికి ఉపయోగించే గుల్ల బ్యారన్ అద్దె రూ.లక్ష పలుకుతోంది.
ఆఫ్రికన్ దేశాల్లో పెరుగుతున్న ఉత్పత్తి
ఈ పంట కాలంలో ఆఫ్రికన్ దేశాల్లో పొగాకు ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. దీని ప్రభానం మన పొగాకుపై ఉంటుందని అంటున్నారు. ఆయా దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)లో సంతకం చేయకపోవడంతో పంట నియంత్రణ లేదు. కొత్త నేలల్లో పంట వేస్తున్నందున నాణ్యమైన పొగాకు ఆయా దేశాల్లో తక్కువ ధరకు దొరుకుతుందని అధికారులు చెబుతున్నారు.
వినియోగ విధానంలో మార్పు
సాధారణంగా పొగాకును సిగరెట్ తయారీకి వినియోగిస్తారు. నికోటిన్ శాతం ఎక్కువగా ఉండాలి. దీనిని సిగరెట్ ద్వారా వినియోగదారులు తీసుకుంటున్నారు. ప్రస్తుతం వినియోగ విధానంలో మార్పు రావడంతో లిక్విడ్, టాబ్లెట్ రూపంలో తీసుకుంటున్నారు. దీంతో, సిగరెట్ల వినియోగం తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు తాము సూచించిన విధంగానే ఆచితూచి పొగాకు సాగు చేయాలని వారంటున్నారు.
వేలం కేంద్రాల వారీగా వేసిన నాట్ల
వివరాలు హెక్టార్లలో ఈ విధంగా ఉన్నాయి
వేలం కేంద్రం రైతులు బ్యారన్లు వేసిన నాట్లు
దేవరపల్లి 1,438 1,599 3,020
జంగారెడ్డిగూడెం–1 2,220 2,589 5,560
జంగారెడ్డిగూడెం–2 2,307 2,469 3,656
కొయ్యలగూడెం 2,526 2,817 5,263
గోపాలపురం 2,023 2,440 4,556
మొత్తం 11,351 12,814 23,106
బాడవ భూముల్లో వేస్తే నష్టపోతారు
వరి చేలు కోసిన బాడవ భూముల్లో పొగాకు నాట్లు వేస్తే రైతులు నష్టపోతారు. గత ఏడాది లో గ్రేడ్ పరిస్థితి బ్రైట్, మీడియం గ్రేడ్‌కు వస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలి. అధిక ఉత్పత్తి ఇబ్బందికరం. నాణ్యమైన పొగాకునే ఉత్పత్తి చేయాలి. మొక్క అడుగు భాగంలోని నాలుగు ఆకులు కప్పడేలా దొయ్యి వేసుకోవాలి. దీని వల్ల లో గ్రేడ్ తగ్గుతుంది. ఉత్పత్తి పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. పరిమితికి మించి ఉత్పత్తి చేస్తే దెబ్బ తింటారు. తోటలు ఆశాజనకంగా ఉన్నాయి. నాట్లు దాదాపు పూర్తయ్యాయి. తుపానుకు ముందు వేసిన తోటల క్యూరింగ్ సంక్రాంతికి ప్రారంభమవుతుంది.
– జీఎల్‌కే ప్రసాద్, టుబాకో బోర్డ్
రీజినల్ మేనేజర్, రాజమహేంద్రవరం


