కృష్ణుని మాటలకు అనుచితార్థాలు తీయరాదు | - | Sakshi
Sakshi News home page

కృష్ణుని మాటలకు అనుచితార్థాలు తీయరాదు

Jan 2 2026 11:12 AM | Updated on Jan 2 2026 11:12 AM

కృష్ణుని మాటలకు అనుచితార్థాలు తీయరాదు

కృష్ణుని మాటలకు అనుచితార్థాలు తీయరాదు

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): ‘ద్రౌపది ఆరోవానిగా నిన్ను వరిస్తుంది’ అని కర్ణుడితో కృష్ణుడు అనలేదని, ఆ సమయంలో పరమాత్మ మాటలకు అనుచితార్థాలు తీయరాదని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. హిందు సమాజంలో చేస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా ఉద్యోగపర్వంలోని ప్రధాన సన్నివేశాలను గురువారం ఆయన వివరించారు. ‘‘రాయబారం ముగిశాక కర్ణుడిని కృష్ణుడు ఏకాంతంలో కలసి అతడి జన్మ రహస్యం చెప్పి, పాండవ పక్షానికి రావాలని ఆహ్వానిస్తాడు. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ఉపయోగించిన ‘షష్ఠే కాలే’ అనే పదానికి సరైన అర్థాన్ని తెలుసుకోవాలి. పంచమ కాలం అన్న పదం రామాయణంలో, చతుర్థ కాలం అనే పదం యజుర్వేదంలో కనపడుతాయి. షష్ఠే కాలే అనే పదానికి జ్యోతిష శాస్త్రం ప్రకారం ‘పట్టాభిషేక సమయం’ అని అర్థం. ‘ఆ సమయంలో పాండవులతో పాటు ఆయనను సేవిస్తుంది’ అనే మాటకు విపరీతార్థాలు తీయరాదు’’ అని వివరించారు. ‘‘స్వయంవర సమయంలో తాను కర్ణుని వరించనని ద్రౌపది స్పష్టం చేసింది. నిండు సభలో ద్రౌపది వలువలు ఊడదీయమని దుశ్శాసనుడిని శాసించింది కూడా కర్ణుడేననే విషయం మనం విస్మరించరాదు. అటువంటి వాడిని ద్రౌపది ఎలా వరిస్తుంది?’’ అని సామవేదం ప్రశ్నించారు. భారత యుద్ధంలో మరణించిన రాక్షస శక్తులు నేడు మళ్లీ జన్మించి, మన మధ్యనే సంచరిస్తూ, కొన్ని పిట్ట కథలను అనేక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. ‘‘రాయబారం ముగిశాక, కుంతిని కృష్ణ పరమాత్మ కలసినప్పుడు ప్రతిక్రియ చేయడమే రాజధర్మమని తన మాటగా ధర్మరాజుకు చెప్పాలని ఆమె అడుగుతుంది. ద్యూతంలో పరాజయం, సంపదలు కోల్పోవడం కన్నా, మహాసాధ్వి ద్రౌపదిని అవమానించిన తీరు తనకు తీరని దుఃఖాన్ని కలిగిస్తోందని, అలా చేసిన వారిపై దండనీతి ప్రయోగించాలని ఆమె ధర్మరాజుకు సందేశం పంపుతుంది. కుంతి వీరపత్ని, వీరమాత. యుద్ధమే ఆ సమయంలో తగిన ధర్మమని, క్షత్రియుడు బిచ్చమెత్తుకుని జీవించరాదని తన సందేశంలో పేర్కొంటుంది. కర్ణుడు పాండవ పక్షానికి రాడని కృష్ణుడికి తెలుసు. అయినప్పటికీ తాను నిష్కపటంగా సంధికి ప్రయత్నిస్తానని ముందే ఆయన ప్రకటించాడు. కర్ణుడు ఈవలి పక్షానికి వస్తే, యుద్ధమే ఉండదు’’ అని సామవేదం అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement