ప్రజలందరికీ మంచి జరగాలి
రాజమహేంద్రవరం రూరల్: నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరిగేలా అనుగ్రహించాల్సింది గా భగవంతుడిని కోరుకుంటున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయనను కలిసేందుకు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్య కర్తలు బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయాని కి గురువారం తరలివచ్చారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి, సత్కరించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి రోజూ పండగలా గడిచిందన్నారు. సంక్షేమ పథకాలకు వార్షిక క్యాలెండర్ ప్రకటించి, అమలు చేసిన ఘనత గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని చెప్పారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలను ఇబ్బందులు వెంటాడుతున్నాయన్నారు. సూపర్ సిక్స్‌తో పాటు అనేక హామీలిచ్చి ప్రజలను మరోసారి మభ్యపెట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. కొత్త సంవత్సరంలోనైన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకాలతో పాటు పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గిరజాల బాబు, గొందేశి శ్రీనివాసులురెడ్డి, కడియం మండల అధ్యక్షుడు యాదల సతీష్ చంద్ర స్టాలిన్, పార్టీ నాయకులు చెల్లుబోయిన నరేన్, మింది నాగేంద్ర, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి అంగాడి సత్యప్రియ, రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శి వెలుగుబంటి అచ్యుతరామ్, రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి చాప రాజా, మైనారిటీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మీర్జా మౌలా ఆలీ తదితరులు పాల్గొన్నారు.


