ఇదేంధర బాబూ!
● పడిపోయిన కొత్తిమీర రేటు
● 6 నెలల కిందట కిలో రూ.300
● నేడు రూ.15
● కోత ఖర్చులు కూడా రావడం
లేదని రైతుల ఆవేదన
పెరవలి: కొత్తిమీర ధరలు దారుణంగా పతనమవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 450 హెక్టార్లలో దాదాపు 3 వేల మంది సన్న, చిన్నకారు రైతులు కొత్తమీర సాగు చేస్తున్నారు. పెరవలి, నిడదవోలు, ఉండ్రాజవరం, చాగల్లు, తాళ్లపూడి, రాజమహేంద్రవరం రూరల్, అనపర్తి, నల్లజర్ల, కడియం తదితర మండలాల్లో కొత్తిమీర సాగు జరుగుతోంది. సుమారు ఆరు నెలల కిందట రైతు వద్ద కిలో కొత్తిమీర ధర ఏకంగా రూ.300 వరకూ పలికింది. అటువంటిది నేడు రూ.15కు పడిపోవడంతో కనీసం కోత ఖర్చులు కూడా రావడం లేదని, పైగా చేతి సొమ్ము అదనంగా ఖర్చవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి, కష్టపడి పండించిన కొత్తిమీరకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో చేలల్లోనే వదిలేస్తున్నారు. కొందరు రైతులైతే కొత్తిమీర తీయకుండా ఉచితంగా పట్టుకెళ్లిపోవాలని ప్రజలకు చెబుతున్న దాఖలాలు కూడా ఉన్నాయి.
దండిగా పెట్టుబడి
ఎకరం విస్తీర్ణంలో కొత్తిమీర సాగుకు రూ.20 వేల వరకూ పెట్టుబడి అవుతోంది. అన్నీ అనుకూలంగా ఉంటే రెండు మూడు టన్నుల దిగుబడి వస్తుంది. మార్కెట్లో ధర ఉంటే రూపాయికి రూపాయి మిగులుతుంది. లేకపోతే పెట్టుబడి కూడా కోల్పోవలసి వస్తుంది. కొత్తిమీర తీయాలంటే కనీసం ఐదుగురు కూలీలు అవసరమవుతారు. వీరు 100 కిలోల కొత్తిమీర తీస్తే ఒక్కొక్కరికి రూ.350 చొప్పున రూ.1,750 అవుతుంది. సంచులు, రవాణా, ఇతర ఖర్చులు మరో రూ.850 వరకూ అవుతుంది. మొత్తంగా కోత ఖర్చు ఎకరాకు రూ.2,600 అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో కొత్తిమీర విక్రయిస్తున్న రైతులకు కిలోకు రూ.15 చొప్పున రూ.రూ.1,500 మాత్రమే వస్తోంది. మార్కెట్లో కమీషన్ పోనూ చేతికి రూ.1,300 మాత్రమే వస్తోంది. దీంతో, తమకు చేతి సొమ్ము అదనంగా రూ.1,300 వరకూ వదిలిపోతోందని రైతులు వాపోతున్నారు.
ధరల పతనం ఎందుకంటే..
గత ఏడాది జూలై నెలలో కిలో కొత్తిమీర ధర రైతు వద్ద రూ.300 పలికింది. ఆ సమయంలో అధిక వర్షాలు, వరదలు రావడంతో లంకల్లోని కొత్తిమీర తోటలు పూర్తిగా నాశనమయ్యాయి. దీంతో మార్కెట్లో ధరలు ఆకాశాన్నంటాయి. ఆ తరువాత వాతావరణం అనుకూలించడంతో రైతులు అధిక విస్తీర్ణంలో కొత్తిమీర సాగు చేపట్టారు. ఇదంతా ఒకేసారి తీతకు రావడంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచీ కొత్తిమీర ఒక్కసారిగా మార్కెట్‌ను ముంచెత్తింది. ఫలితంగా ధరలు పాతాళానికి పడిపోయాయి.
ఆరు నెలలుగా కొత్తిమీర ధరలు (కిలోకు రూ.లలో) తగ్గాయిలా..
నెల ధర
జూలై 300
ఆగస్టు 250
సెప్టెంబర్ 200
అక్టోబర్ 150
నవంబర్ 100
డిసెంబర్ ప్రారంభం 80
నేడు 15


