‘హ్యాపీ న్యూ ఇయర్ మేడమ్’
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో అధికారులు మరింత నిబద్ధతతో, జవాబుదారీతనంతో పని చేయాలని కలెక్టర్ కీర్తి కోరారు. నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని పలువురు జిల్లా అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు కలెక్టరేట్‌లో గురువారం ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జాయింట్ కలెక్టర్ వై.మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ, తన పిలుపునకు స్పందించి, విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు అందజేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఆధ్యాత్మిక జ్ఞానశక్తితో
ఆశయ సాధన
పిఠాపురం: జీవితాశయ సాధనకు మానసిక శక్తి, మనోధైర్యం, సంకల్పంతో కూడిన ఆధ్యాత్మిక తాత్త్విక జ్ఞానశక్తి అవసరమని విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ ఆలీషా అన్నారు. నూతన ఆంగ్ల సంవత్సర ఆరంభం సందర్భంగా పీఠంలో గురువారం నిర్వహించిన జ్ఞాన మహాసభలో ఆయన అనుగ్రహ భాషణం చేశారు. మనసును స్థాయి పరచుకునే తత్వమే ఆధ్యాత్మిక తత్వమని, దీని ద్వారా జీవితంలో చిన్న చిన్న వివాదాలు తొలగించుకుని, నిరంతరం సుఖసంతోషాలతో జీవించడానికి, మంచి చెడుల విశ్లేషణతో కూడిన మానసిక స్థితిని ఏర్పరచుకోవాలని అన్నారు. మనలోని లోపాలను సవరించుకోకుండా ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదన్నారు. ఆ లోపాలను తొలగించుకునే విధానమే ఆధ్యాత్మిక తత్త్వమన్నారు. మానవత్వాన్ని బోధించేదే మతమని, మానవత్వాన్ని హరించేది మతం కాదని, రాక్షసత్వమని అభివర్ణించారు. మనసును తాత్త్విక జ్ఞానశక్తితో నింపుకోవడానికి సద్గురు మార్గంలో త్రయీ సాధన ఆచరించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి, గురు దక్షిణగా ప్రకృతిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అమెరికాకు చెందిన కిరణ్ ప్రభ మాట్లాడుతూ, పీఠం నిర్వహిస్తున్న బాలవికాస్ కార్యక్రమాలను కొనియాడారు. డాక్టర్ కొండా నరసింహారావు, అలివేలు మంగాదేవి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో తాత్త్విక బాల వికాస్ చిన్నారుల ప్రసంగాలు అందరినీ అలరించాయి. ఉమా ముకుంద నేతృత్వంలో సంగీత విభావరి రంజింపజేసింది. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ద్వారా ఉమర్ ఆలీషా మహిళా యువతకు వస్త్రాలు, దంగేటి రామకృష్ణ సహకారంతో పీఠాధిపతి చేతుల మీదుగా ధాన్యపు కుచ్చులు పంపిణీ చేశారు.
ఉత్సాహంగా
సైన్స్ రంగోలీ పోటీలు
పెద్దాపురం (సామర్లకోట): నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకొని పట్టణ చిల్ట్రన్స్ క్లబ్ ఆధ్వర్యాన పెద్దాపురం యాసలపు సూర్యారావు భవనంలో విద్యార్థులకు గురువారం జిల్లా స్థాయి సైన్స్ ముగ్గుల పోటీలు నిర్వహించారు. జూనియర్, సీనియర్స్, సూపర్ సీనియర్స్ విభాగాల్లో 300 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని క్లబ్ గౌరవాధ్యక్షుడు బుద్దా శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షురాలు కూనిరెడ్డి అరుణ, ప్రతినిధులు అనూష, అంజలి, జస్విత, సాయి బంగారం, నేహా, రేణుకా, పవన్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
‘హ్యాపీ న్యూ ఇయర్ మేడమ్’


