
పేలుడు ఘటనపై చర్యలు తీసుకోవాలి
తాళ్లరేవు: కోరింగా వన్యప్రాణి అభయారణ్యం రాతి కాలువ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఈ నెల 22వ తేదీన జరిగిన ఓఎన్‌జీసీ గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని గ్లోబల్ ఫిషరీస్ రైట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు సంగాడి ధర్మారావు జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ ప్రమాదం కారణంగా సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో చేపలు చనిపోయాయన్నారు. చెరువులు, కాలువలు కలుషితమయ్యాయని, మడ అడవులు నాశనం కావడం వల్ల పక్షులు, ఆలివ్ రిడ్లే తాబేళ్లు వంటి అరుదైన జీవుల ఉనికికి ముప్పు వాటిల్లుతుందన్నారు. అలాగే వేలాది మత్స్యకారుల జీవనాధారం పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. ఓఎన్‌జీసీ నిర్లక్ష్యం పునరావృతమవుతుందని, పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో ఓఎన్‌జీసీ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని, జాతీయ హరిత ట్రిబ్యునల్ పర్యవేక్షణలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, పూర్తిస్థాయి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మడ అడవుల పునరుద్ధరణ, సముద్ర జీవ వైవిధ్యం సంరక్షణతో సహా, 20 ఏళ్ల పర్యావరణ పర్యవేక్షణను ఓఎన్‌జీసీ వ్యయంతో నిర్వహించాలని స్పష్టం చేశారు. అలాగే మత్స్యకార ప్రతినిధులకు ప్రత్యక్ష వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని కోరారు. ఇది ప్రమాదం కాదని, పర్యావరణంపై జరుగుతున్న సామూహిక విధ్వంసమని వ్యాఖ్యానించారు. గోదావరి డెల్టా జీవనాధారమైన వేలాది మత్స్యకారుల భవిష్యత్తు, దేశ పర్యావరణ భద్రత అన్నీ ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి పూర్తి బాధ్యత ఓఎన్‌జీసీ వహించాలన్నారు.
గ్లోబల్ ఫిషరీస్ రైట్స్ ఫెడరేషన్
వ్యవస్థాపకుడు ధర్మారావు