
గంజాయి వ్యాపారులపై ఉక్కుపాదం
● అక్రమ సంపాదన రూ.41 లక్షల ఆస్తి ఫ్రీజ్
● జిల్లాలో మొట్టమొదటి ఫైనాన్షియల్
ఇన్వెస్టిగేషన్ కేసు
జగ్గంపేట: గంజాయి కేసుల్లో కొత్త కోణం ప్రస్ఫుటమైంది. బరితెగిస్తున్న గంజాయి వ్యాపారుల ఆట కట్టించేందుకు, వారి ఆర్థిక మూలాలను దెబ్బ తీసేందుకు.. గంజాయి వ్యాపారం ద్వారా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ మొదలైంది. గంజాయి వ్యాపారులపై ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి, అక్రమ సంపాదన అని తేలిన ఆస్తులను జగ్గంపేట సర్కిల్ పరిధిలోని గండేపల్లి మండలంలో ఫ్రీజ్ చేశారు. దీని విలువ మార్కెట్ రేటు ప్రకారం రూ.41 లక్షలు ఉంటుందంటున్నారు. జిల్లాలో ఈ తరహా కేసు మొట్టమొదటిది కావడం విశేషం. కేసుకు సంబంధించి జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
జగ్గంపేటలోని జగనన్న కాలనీలో ఈ ఏడాది మార్చి 4న 492.08 కిలోల గంజాయిని జగ్గంపేట పోలీసులు సీజ్ చేశారు. దీనికి సంబంధించి వనపర్తి బాపిరాజు, మరో ఏడుగురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపారు. ఈ క్రమంలో ఎస్పీ జి.బిందుమాధవ్ ఈ కేసులో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి, నిందితులు గంజాయి వ్యాపారంలో సంపాఽందించిన ఆస్తులు ఉంటే సీజ్ చేస్తామని ప్రకటించారు. దీనికి అనుగుణంగా జగ్గంపేట సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగింది. బాపిరాజు గంజాయి అక్రమ రవాణా ద్వారా సంపాదించిన డబ్బుతో గండేపల్లి మండలం ఉప్పలపాడులో కొనుగోలు చేసిన 0.84 ఎకరాల భూమిని ఫ్రీజ్ చేశారు. ఈ ఆర్డర్‌ను మంగళవారం కమిషనర్, కాంపిటెంట్ అథారిటీ, చెన్నె వారు ధ్రువీకరించారని సీఐ శ్రీనివాస్ తెలిపారు. దీని విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు రూ.11 లక్షలు కాగా, మార్కెట్ విలువ రూ.41 లక్షలుగా ఉందని వివరించారు. ప్రధానంగా గంజాయి కేసుల్లో అరెస్టు కావడం, కొంతకాలం తర్వాత బెయిల్‌పై వచ్చి మళ్లీ అక్రమ వ్యాపారం చేయడం, లేదా జైలు శిక్ష అనుభవించి గంజాయి వ్యాపారం కొనసాగించడం పరిపాటిగా మారిందని చెప్పారు. ఇకపై ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి, వారి అక్రమ సంపాదన స్వాధీనం చేసుకోవడం ద్వారా వారి ఆర్థిక మూలాలను దెబ్బ తీస్తామని స్పష్టం చేశారు.