
గ్యాస్ లీకేజీతో నాలుగు షాపులు దగ్ధం
ఐ.పోలవరం: జాతీయ రహదారిని ఆనుకుని మురమళ్లలో ఉన్న ఓ షాపులోని గ్యాస్ సిలిండర్ లీకేజీ కావడంతో నాలుగు దుకాణాలు దగ్ధమయ్యాయి. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం, సోమవారం రాత్రి బజ్జీల దుకాణం నిర్వహిస్తున్న బొలిశెట్టి సత్యశ్రీనివాస్ షాపులో సిలిండర్ నుంచి గ్యాస్ లీకైంది. ఎగసిపడిన మంటలు పక్కనున్న దుకాణాలకూ వ్యాపించాయి. ఈ ఘటనలో వల్లిబోయిన మాధవ(కూల్‌డ్రింక్ షాపు), కొమానపల్లి సత్యనారాయణ(సెలూన్ షాపు), చుండ్రు సుందరరావు (పాదరక్షల షాపు) దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ముమ్మిడివరం ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పెట్రోలు పోసి భర్తకు
నిప్పంటించిన భార్య
రావులపాలెం: వేధింపులు తాళలేక భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్యపై కేసు నమోదు చేసినట్టు రావులపాలెం టౌన్ సీఐ శేఖర్‌బాబు మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన మట్టా శ్రీనివాస్(40), మట్టా ఏంజలీనా జెన్నీఫర్ థామస్ భార్యాభర్తలు. భర్త ప్రతిరోజు తాగి వచ్చి భార్యను వేధింపులకు గురిచేసేవాడు. దీంతో విసుగు చెందిన భార్య సోమవారం రాత్రి సుమారు మూడు గంటల సమయంలో నిద్ర లో ఉన్న శ్రీనివాస్‌పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. తీవ్ర గాయాలపాలైన శ్రీనివాస్‌ను బంధువులు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతున్నాడు. శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్సై కేవీ రమణారెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.