టైండర్‌ వచ్చేదెప్పుడో..? | - | Sakshi
Sakshi News home page

టైండర్‌ వచ్చేదెప్పుడో..?

Aug 27 2025 8:55 AM | Updated on Aug 27 2025 8:55 AM

టైండర్‌ వచ్చేదెప్పుడో..?

టైండర్‌ వచ్చేదెప్పుడో..?

దేవస్థానంలో ఇబ్బందులు

అన్నవరం: గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్‌ ఏడు ప్రముఖ దేవస్థానాలకు ఒకే శానిటరీ టెండర్‌ పిలవాలని నిర్ణయించి ఏడాదైంది. ఇంతవరకూ టెండర్లు ఖరారు కాలేదు. దీంతో అన్నవరం దేవస్థానంలో ఆరు నెలలుగా తాత్కాలికంగా ఓ సంస్థకు శానిటరీ కాంట్రాక్ట్‌ అప్పగించారు. ప్రతి నెలా ఏదో సమస్యతో శానిటరీ సిబ్బంది జీతాలు ఆలస్యమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో దేవస్థానాల వారీగా శానిటరీ టెండర్లు ఖరారు చేయడంతో ఎటువంటి సమస్యలూ ఉత్పన్నం కాలేదు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం సహా, రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాలకు శానిటరీ మెటీరియల్‌తో సహా.. క్లీనింగ్‌, హౌస్‌ కీపింగ్‌ తదితర పారిశుధ్య పనుల నిర్వహణకు సెంట్రలైజ్డ్‌ ఈ–ప్రొక్యూర్‌ రీ టెండర్‌ ఖరారు కాకపోవడంతో.. అటు శానిటరీ సిబ్బందితో పాటు, దేవస్థానం ఉద్యోగులూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఏడు దేవస్థానాల్లో..

ప్రముఖ దేవస్థానాలను ఒక యూనిట్‌గా శానిటరీ టెండర్లు పిలవాలని గతేడాది ఆగస్ట్‌ 27న కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్‌ దక్కించుకున్న సంస్థ రెండేళ్ల కాల పరిమితిలో అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో పారిశుధ్య పనులు, సత్రాల్లో హౌస్‌ కీపింగ్‌, రోడ్లు, టాయిలెట్ల క్లీనింగ్‌, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌, ఏసీలు, ఇతర విద్యుత్‌ ఉపకరణాల నిర్వహణ తదితర పనులు నిర్వహించాల్సి ఉంది. గత ఏప్రిల్‌లో తొలిసారిగా పిలిచిన టెండర్‌ నోటిఫికేషన్‌పై టెండర్‌దారులు అనేక సందేహాలను వ్యక్తం చేయడంతో, ప్రభుత్వం దానిని రద్దు చేసింది. మరికొన్ని మార్పులతో కొత్త నోటిఫికేషన్‌ను జూన్‌ 12న విడుదల చేసింది. టెండర్‌దారులు కొటేషన్లు దాఖలు చేయడానికి జూన్‌ 26 తుది గడువుగా నిర్ణయించారు. మొత్తం 23 టెండర్లు దాఖలయ్యాయి. జూలై మూడున టెక్నికల్‌ బిడ్‌లో చైతన్యజ్యోతి, పద్మావతి సంస్థలు ప్రైస్‌ బిడ్‌కు ఎంపికయ్యాయి. ప్రైస్‌ బిడ్‌ ఓపెన్‌ చేసి కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయాల్సిన బాధ్యతను దేవదాయ శాఖ ఉన్నతాధికారులు సంబంధిత మంత్రికి అప్పగించినట్టు సమాచారం. సంబంధిత శాఖ ఉన్నతాధికారి ఈ నెల తొలి వారంలో అన్నవరం దేవస్థానానికి వచ్చిన సందర్భంలో శానిటరీ టెండర్‌ విషయాన్ని ప్రస్తావించగా, మంత్రి పేషీలో ఉందని, వారం రోజుల్లో ఫైనల్‌ అవుతుందని చెప్పినట్టు అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటివరకూ టెండర్‌ ఖరారుపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.

శానిటరీ కాంట్రాక్ట్‌ ఖరారు కాకపోవడం దేవస్థానం అధికారులకు శిరోభారంగా మారింది. ఇక్కడ శానిటరీ విధులు నిర్వహిస్తున్న కేఎల్‌టీఎస్‌ సంస్థ కాంట్రాక్ట్‌ గడువు గతేడాది నవంబర్‌తో ముగిసింది. దేవస్థానం కోరిక మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు సంస్థ సిబ్బంది విధులు నిర్వహించారు. దీంతో శానిటరీ పనుల నిర్వహణను దేవస్థానంలోని గోశాల, గార్డెన్స్‌లో మేన్‌పవర్‌ సరఫరా చేస్తున్న గుంటూరుకు చెందిన కనకదుర్గా శానిటరీ సర్వీసెస్‌ సంస్థకు తాత్కాలికంగా అప్పగించారు. శానిటరీ మెటీరియల్‌ దేవస్థానమే అందజేస్తోంది. ఆరు నెలలైనా టెండర్‌ ఖరారు కాకపోవడంతో దేవస్థానం అఽధికారులకు ఇబ్బందికరంగా మారింది. ప్రతి నెలా రూ.59 లక్షల సిబ్బంది జీతాల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. దీనికితోడు సిబ్బంది ఈపీఎఫ్‌ చెల్లింపు కూడా వివాదాస్పదమైంది. జూన్‌, జూలై ఈపీఎఫ్‌ కూడా కనకదుర్గా సంస్థ చెల్లించడంతో.. తిరిగి ఆ సంస్థ ద్వారానే సిబ్బందికి జీతాలు చెల్లించారు. ఈ నెల జీతాలూ చెల్లించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం త్వరగా టెండర్‌ ఖరారు చేస్తే ఇబ్బందులు ఉండవని దేవస్థానం అధికారులు చెబుతున్నారు.

పెండింగ్‌లో దేవాలయాల శానిటరీ టెండర్‌

ఏప్రిల్‌లో ఏడు దేవస్థానాలకు నోటిఫికేషన్‌

వివిధ కారణాలతో రద్దు..

జూన్‌ 12న రీ టెండర్‌

టెక్నికల్‌ బిడ్‌లో రెండు సంస్థలు క్వాలిఫై

రెండు నెలలు కావస్తున్నా

ఖరారు కాని కాంట్రాక్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement