
ప్రణాళికాబద్ధంగా లక్ష్య సాధనకు కృషి
రాజానగరం: నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు దృఢ సంకల్పంతో పాటు, ప్రణాళికాబద్ధమైన కృషి అవసరమని స్థానిక గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ) చాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) అన్నారు. యూనివర్సిటీలో నిర్వహించిన మోటివేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. సెల్‌ఫోన్లను విజ్ఞానాన్ని పెంపొందించడం కోసమే వాడటం శ్రేయస్కరమన్నారు. సమయ పాలన, స్వీయ క్రమశిక్షణను అలవర్చుకుని, తల్లిదండ్రులు గర్వపడేలా జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలన్నారు. వీసీ డాక్టర్ యు.చలపతిరావు మాట్లాడుతూ, విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించేలా తోడ్పాటు అందించడానికి యూనివర్సిటీ ముందుంటుందన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ వీసీ డాక్టర్ కేవీబీ రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంఎంఎస్ శర్మ, డైరెక్టర్ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు, గైట్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీఎస్ బాబు తదితరులు పాల్గొన్నారు.
డీఎస్సీ ఫలితాల్లో ‘శ్యామ్’కు రాష్ట్ర స్థాయి ర్యాంకులు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఇటీవల వెల్లడించిన డీఎస్సీ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారని శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ అధినేత గుంటూరు శ్యామ్ తెలిపారు. తమ ఇన్‌స్టిట్యూట్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, తమ వద్ద శిక్షణ పొందిన బి.హరీష్, బి.దిల్లేష్, వి.రమ్యశ్రీ, డి.బాలూ నాయక్, ఎం.డేనియల్‌కుమార్, సీహెచ్ భవాని వివిధ కేటగిరీల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారన్నారు. పోలీసు పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న తమ సంస్థ.. డీఎస్సీ అభ్యర్థులకూ శిక్షణ ఇచ్చి తొలి ప్రయత్నంలోనే రాష్ట్ర, జిల్లా ర్యాంకులతో అద్భుత ప్రతిభ కనబర్చిందన్నారు. స్కూలు అసిస్టెంట్(సోషల్) విభాగంలో పది మంది ఆయా జిల్లాల్లో ఫస్ట్ ర్యాంకులు, ఎస్జీటీలో 9 మంది ఆయా జిల్లాల ఫస్ట్ ర్యాంకులు సాధించారని సంతోషం వ్యక్తం చేశారు. అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఇందుకు విశేష కృషి చేసిన అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఉచిత శిక్షణ పొందిన విద్యార్థులు సుమారు 260 మందిలో 63 మంది ఉద్యోగాలు సాధించడమే కాకుండా, ఎస్సీ, ఎస్టీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంకులు సాధించారని తెలిపారు.
ఎంపీడీఓలకు ముగిసిన శిక్షణ
సామర్లకోట: క్షేత్ర స్థాయిలో ఉత్తమ సేవలు అందించడానికి ఎంపీడీఓలకు శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్ ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పదోన్నతి పొందిన ఎంపీడీఓలకు నెల రోజుల పాటు నిర్వహించిన శిక్షణ మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ఇకనుంచి ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా శిక్షణ ఉంటుందని చెప్పారు. మంగళవారం పెద్దాపురం మండలం జి.రాగంపేటలో ఉన్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని ఎంపీడీఓలు పరిశీలించారు. శిక్షణ ముగింపు సందర్భంగా ఎంపీడీఓలకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, ఫ్యాకల్టీలు కె.సునీల, చక్రపాణిరావు, శర్మ, కేఆర్ నిహారిక తదితరులు పాల్గొన్నారు.
యువకుడి ఆత్మహత్య
సీతానగరం: పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టరనే ఆందోళనతో సింగవరానికి చెందిన యువకుడు బిట్ర సూరిబాబు(24) సోమవారం కలుపు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం మృతుడి తండ్రి బిట్ర శ్రీను ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజమహేంద్రవరంలోని ఆస్పత్రిలో సూరిబాబు వరి బీజం ఆపరేషన్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి ఆందోళనగా ఉంటున్నాడు. పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టరన్న ఆందోళనతో మానసిక వేదనకు గురై, పామాయిల్ తోటకు వెళ్లి కలుపు మందు తాగిన విషయం తన పరిచయస్తులకు చెప్పాడు. వారి ద్వారా విషయం తెలుసుకున్న సూరిబాబు కుటుంబ సభ్యులు అతడిని స్థానిక బస్టాండ్ సెంటర్ వద్దనున్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 5.30కు మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై డి.రామ్‌కుమార్ తెలిపారు.

ప్రణాళికాబద్ధంగా లక్ష్య సాధనకు కృషి

ప్రణాళికాబద్ధంగా లక్ష్య సాధనకు కృషి