
క్షమాపణ చెప్పలేదని స్నేహితుడి హత్య
● ఐదుగురు యువకుల ఘాతుకం
● వీడిన కేసు మిస్టరీ
● నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలోని కై లాసభూమి సమీపంలో అనుమానాస్పద స్ధితిలో మృతి చెందిన ధవళేశ్వరానికి చెందిన సతీష్ కుమార్‌ది హత్యగా తేలింది. ఈ ఘోరానికి పాల్పడిన అతడి ఐదుగురు స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరి భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సతీష్ కుమార్ క్షమాపణలు చెప్పలేదనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. వేపాడి సతీష్ కుమార్ (22) రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో మూడేళ్లుగా సమోసాలు అమ్ముతు జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 8వ రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో టీవీ ఎక్కువగా సౌండ్ పెట్టుకుని చూస్తుండగా తండ్రి మందలించడంతో అలిగి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అనంతరం ఈ నెల 15న కై లాస భూమి వెనుక శవమై కనిపించాడు. ఈ మేరకు టూటౌన్ సీఐ శివ గణేష్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హత్య జరిగిందిలా..
వేపాడి సతీష్ కుమార్ ఈ నెల 9వ తేదీ తెల్లవారుజామున తోటి స్నేహితులైన ఆల్కాట్ గార్డెన్స్‌కు చెందిన భాగ్ రాధాకాంత్, భాగ్ గౌతం, దొంగ సౌధిరాజు, బాలాజీ పేటకు చెందిన మోటూరి రవి, భీమవరానికి చెందిన నమ్మి సూర్య తేజతో కలిసి మద్యం తాగడానికి గోదావరి గట్టు దిగువనున్న కై లాస భూమి శ్మశానం లోపలకు వెళ్లాడు. వారిలో భాగ్ రాధాకాంత్ భార్యపై ముందు రోజు రాత్రి వారు కలిసిన సమయంలో సతీష్ కుమార్ చులకనగా మాట్లాడాడు. దీనిపై క్షమాపణ చెప్పాలని సతీష్ కుమార్‌ను వారందరూ అడిగారు. దానికి అతడు నిరాకరించడంతో పాటు మళ్లీ ఆమైపె అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అప్పటికే పూర్తిగా మద్యం తాగి ఉన్న ఐదుగురూ కోపంతో సతీష్ కుమార్‌పై దాడి చేశారు. నమ్మి సూర్యతేజ పక్కనే ఉన్న కర్ర తీసుకుని తలపై కొట్టడంతో సతీష్ కుమార్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. భాగ్ రాధాకాంత్ ఆ తర్వాత అతడి పీక మీద కాలు వేసి.. మృతి చెందే వరకు గట్టిగా తొక్కాడు. అనంతరం మృతదేహాన్ని ఈడ్చుకుని వెళ్లి గోడ అవతల పారవేసి, ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. హత్యకు ఉపయోగించిన కర్ర, మృతుడి టీషర్టును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు.

క్షమాపణ చెప్పలేదని స్నేహితుడి హత్య