
బీసీ సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన విద్య
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): బీసీ సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు శుక్రవారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తూర్పు, పశ్చి మ గోదావరి జిల్లాల పరిధిలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల (హెచ్‌డబ్ల్యూఓ)తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ హెచ్‌డబ్ల్యూవోల పనితీరును మెరుగుపరుచుకునేందుకు నూతన విధానం తీసుకువచ్చిందన్నారు. విధి నిర్వహణలను విభజించి ప్రతి దానికి కొన్ని మార్కులు కేటాయించిందన్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి రాష్ట్రంలోని వసతి గృహాల్లో 244 మంది నాలుగో తరగతి సిబ్బందిని నియమిస్తామన్నారు. బీసీ సంక్షేమ శాఖ సంచా లకులు ఎ.మల్లికార్జున మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాల్లో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ బీసీ వెల్ఫేర్ డీసీఎస్ రాజు, అధికారులు పాల్గొన్నారు.