
ఉగ్ర గోదావరి
కలెక్టరేట్ 89779 35611
రాజమహేంద్రవరం డివిజన్ 0883–2442344
కొవ్వూరు డివిజన్ 08813–231488
రాజమహేంద్రవరం కార్పొరేషన్ 94940 60060
రాజమహేంద్రవరం రోడ్డు కం రైల్వే బ్రిడ్జి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద ప్రవాహం ఉధృతంగా సాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి భారీగా వరద వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన ఇరిగేషన్ యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరో వైపు గోదావరి ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి పొంగి పొర్లుతున్నాయి. భద్రాచలం వద్ద నీటి ఉధృతి పెరుగుతోంది. గురువారం సాయంత్రం 7 గంటల సమయానికి అక్కడ 52.10 అడుగులకు నీటిమట్టం చేరింది. రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. రాత్రికి మరింత ఎక్కువవుతుందని అధికారులు చెబుతున్నారు. పుష్కర ఘాట్, గౌతమీ ఘాట్ వద్ద వరద నీటి ఉధృతి అధికంగా ఉంది.
కాటన్ బ్యారేజీకి వరద
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద వరద క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న నీటితో గురువారం సాయంత్రానికి బ్యారేజీ వద్ద నీటి మట్టం 12.90 అడుగులకు చేరింది. 11,51,758 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. మరో 9,100 క్యూసెక్కుల నీటిని డెల్టా కాలువలకు విడిచిపెట్టారు. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. వరద ఉధృతి రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. 13.75 అడుగులకు నీటి మట్టం చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 17.75 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
అప్రమత్తమైన యంత్రాంగం
గోదావరి వరదతో లంక గ్రామాలు నీటిలో చిక్కుకుంటున్నాయి. ఇప్పటికే సీతానగరం, రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం రూరల్, కడియం ప్రాంతాల్లోని లంక భూములు నీట మునిగాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన నేపథ్యంలో గోదావరి వరదల ప్రభావిత కుటుంబాలను, లంకల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నగరంలోని ఆల్కాట్ గార్డెన్ మున్సిపల్ కల్యాణ మంటపంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. కేతావారిలంక నుంచి 68 మందిని, వెదుర్లమ్మ లంక నుంచి 126 మందిని, గోదావరి గట్టు కింద నుంచి ఏడుగురిని, గౌతమీ ఘాట్ నుంచి 45 మందిని, బ్రిడ్జి లంక నుంచి 48 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వరద సహాయక చర్యలకు కంట్రోల్ రూమ్‌లను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు.
ముంపు సమస్య
రాజానగరం నియోజకవర్గానికి చెందిన 18 గ్రామాల ప్రజలు కలుషిత నీరు తాగాల్సి వస్తోంది. కోరుకొండ మండలం బుచ్చెంపేట, జగన్నాథపురం, మునగాల, శ్రీరంగపట్నం గ్రామాల నివా స స్థలాలకు ముంపు సమస్య ఎదురైంది. బూరుగుపూడి, కాపవరం, కోటి, మునగాల, శ్రీరంగపట్నం, రాఘవపురం తదితర గ్రామాల్లోని పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి. సీతానగరం మండలంలోని గ్రామాలకు ముంపు ప్రమాదం ఉంది. కోరుకొండ మండలంలో బురద కాలువ ఉగ్రరూపం దాల్చుతోంది. కొవ్వూరు గోష్పాదక్షేత్రాన్ని వరద నీరు ముంచెత్తింది.
ఎగువన కురుస్తున్న
వర్షాలకు పోటెత్తిన వరద
కాటన్ బ్యారేజీ వద్ద
పెరుగుతున్న నీటిమట్టం
మొదటి ప్రమాద హెచ్చరిక అమలు
రాత్రికి మరింత పెరిగే అవకాశం
కంట్రోల్ రూమ్‌లు

ఉగ్ర గోదావరి

ఉగ్ర గోదావరి