
ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కూటమి
● అన్ని వర్గాల ప్రజలకూ అవస్థలే
● తల్లికి వందనంలో కోత, నాడు–నేడు పనుల నిలిపివేత
● శాసనమండలి విపక్ష నేత బొత్స ధ్వజం
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రజల సంక్షేమంపై కూటమి ప్రభుత్వానికి కనీస చిత్తశుద్ధి లేదని, పరిపాలనను పూర్తిగా విస్మరించిందని శాసన మండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు.. ఇలా ఏ ఒక్క వర్గమూ సంతృప్తిగా లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూకబ్జాలేనని, అందులో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఉంటోందన్నారు. తమది మంచి ప్రభుత్వమని అధికార పార్టీ పెద్దలు, నేతలు అనుకోవడం తప్ప, రాష్ట్రంలో సంతృప్తికరమైన పాలన అందడం లేదన్నారు.
రైతులను మోసం చేసిన కూటమి
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గతంలో రైతు భరోసా తీసుకున్న రైతుల సంఖ్యను ఇప్పుడు సుమారు 80 వేల మందికి తగ్గించారని బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 లక్షల మందికి ‘అన్నదాత సుఖీభవ’ పథకం అందలేదన్నారు. మరో 8 లక్షల మందికి ‘తల్లికి వందనం’ పథకం నిధులు అరకొరగా అందించారన్నారు. అదేమని ప్రశ్నిస్తే కేంద్రం నుంచి డబ్బులు రావాలని చెబుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన రూ.1.50 లక్షల కోట్ల అప్పు నుంచి ఆ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. కేంద్రం ఇచ్చే ఉపాధి హామీ పథకంలో దేశ, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏడు వారాలవుతున్నా కూలీల వేతనాలు ఇవ్వలేదన్నారు. రైతులకు ఒక యూరియా బస్తా ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం జగన్ తీసుకొచ్చారన్న కారణంగా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నాడు–నేడు పనులు, ఇంగ్లిష్ మీడియం చదువును నిలిపివేశారన్నారు.
రేషన్ బియ్యంపై చర్యలేవీ?
పీడీఎస్ బియ్యం విషయంలో ఎవరి మీదనైనా చర్యలు తీసుకున్నారా అని బొత్స ప్రశ్నించారు. విశాఖపట్నం వెళ్లి గోదాములు సీజ్ చేయాలని మంత్రి ప్రకటిస్తారని, రెండు రోజుల తర్వాత కాదంటారన్నారు. సింగపూర్‌కు వెళ్లేది పెట్టుబడుల కోసం కాదని, అక్కడున్న కంపెనీలతోనే ఒప్పందం కోసమన్నారు. అమరావతి వర్షాలకు మునిగిపోయిందన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. త్వరలో జరిగే జనసేన మహాసభలో విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయకుండా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, అధికార ప్రతినిధి మార్గాని భరత్, కోనసీమ జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, సత్తి సూర్యనారాయణ రెడ్డి, జి.శ్రీనివాసులు నాయుడు, యువజన విభాగం రీజనల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, లీగల్ సెల్ ఉభయ గోదావరి జిల్లాల ఇన్‌చార్జ్ సాదిక్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, రాష్ట్ర మహిళా కార్యదర్శి అంగాడి సత్యప్రియ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, ప్రముఖ న్యాయవాది గొందేసి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కార్యదర్శి ముద్దాల అను, నాయకులు చెల్లుబోయిన నరేన్ పాల్గొన్నారు.