
ప్రశాంతంగా వినాయక చవితి ఉత్సవాలు
కోరుకొండ: వినాయక చవితి ఉత్సవాలను నిబంధనలకు అనుగుణంగా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఏఆర్ అదనపు ఎస్పీ చెంచురెడ్డి అన్నారు. కోరుకొండలోని నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ కార్యాలయంలో గురువారం కోరుకొండ, రాజానగరం సర్కిల్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఉత్సవాలు నిర్వహించకూడదన్నారు. వివాదాస్పద ప్రాంతాలు, వివాదాలకు కారకులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఉత్సవ కమిటీల్లో డీజేలు నిర్వహించే వారిని బైండోవర్ చేయాలన్నారు. అనంతరం విగ్రహాలను నిమజ్జనం చేయనున్న కోరుకొండ దేవుని కోనేరు, శ్రీరంగపట్నంలోని చెరువులను పరిశీలించారు. సీఐ సత్య కిశోర్ మాట్లాడుతూ విగ్రహాలకు అనుమతులు తీసుకున్న తర్వాత మండలాల్లోని అన్ని కమిటీలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో రాజానగరం సీఐ ప్రసన్న వీరగౌడ, కోరుకొండ ఎస్సై కూన నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఒక్క రూపాయికే
బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ కార్డు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కేవలం ఒక్క రూపాయికే సిమ్ కార్డు అందించి, మొదటి నెలలో 30 రోజుల అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు రోజుకు 2 జీబీ డేటా ఉచితంగా ఇస్తున్నట్లు భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) రాజమహేంద్రవరం బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు అన్నారు. ఈ సరికొత్త ఫ్రీడమ్ ప్లాన్ ఈ నెలాఖరు వరకే ఉంటుందన్నారు. రాజమహేంద్రవరంలోని గోకవరం బస్టాండ్ సమీపంలో గల నన్నయ సంచార భవనం కాన్ఫరెన్స్ హాలులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తక్కువ రీచార్జి ప్లాన్లతో మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఏజెన్సీలో కూడా టవర్స్ అదనంగా పెట్టి ఫ్రీక్వెన్సీ పెంచామన్నారు. సమావేశంలో డీజీఎంలు సత్యనారాయణ, శైలజ, ఏజీఎంలు భమిడి శ్రీనివాస్, శారద, జయశ్రీ పాల్గొన్నారు.
వరి పొలాల్లో డ్రోన్‌తో
కషాయాల పిచికారీ
పెరవలి: ప్రకృతి వ్యవసాయంలో వరి పంటను ఆశించే తెగుళ్లను అరికట్టడానికి డ్రోన్ సాయంతో కషాయాలను పిచికారీ చేయిస్తున్నామని జిల్లా సేంద్రియ వ్యవసాయ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ సాకా రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు గురువారం పెరవలిలో వరిచేలపై డ్రోన్‌తో కషాయాల పిచికారీని అధికారుల సమక్షంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 45 వేల ఎకరాల్లో, పెరవలి మండలంలో 800 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందుకోసం 30 డ్రోన్లను వినియోగిస్తామని, ఒక ఎకరానికి పిచికారీ చేసినందుకు రూ.300, కషాయాలకు రూ.200 చొప్పున రూ.500 తీసుకుంటున్నామన్నారు. దీని వల్ల రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు ప్రతి వరిదుబ్బుపై మందు పిచికారీ జరుగుతుందన్నారు. వేపగింజల పొడి, ఇంగువ, చేపబెల్లం ద్రావణాన్ని పిచికారీ చేయటం వలన కాండం తొలుచు పురుగు, రసం పీల్చే పురుగులను నివారించవచ్చన్నారు. బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, వావిలాల కషాయాలను జీవామృతంతో కలిపి చల్లడం వల్ల ఎటువంటి తెగుళ్లనైనా అరికట్టే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో మోడల్ మేకర్ ఉమా మహేశ్వరరావు, స్వాతిముత్యం, దీప్తి, మనోరంజని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా వినాయక చవితి ఉత్సవాలు

ప్రశాంతంగా వినాయక చవితి ఉత్సవాలు