
విజ్ఞానపదం
కపిలేశ్వరపురం: సంస్కృతి, సంప్రదాయాలు, విజ్ఞానాన్ని ఒక తరం నుంచి మరో తరానికి అందించడంలో జానపద కళలు ఎంతో కీలకపాత్ర పోషిస్తాయి. మన పూర్వీకుల ఆచారాలు, పద్ధతులు, ఆనాటి పరిస్థితులకు అద్దం పడతాయి. వీటిలో గీతాలు, నృత్యాలు, నాటకాలు, శిల్పాలు, వాయిద్యాలు.. ఇలా అనేకం ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల సంప్రదాయాలను వీటి ద్వారా తెలుసుకోవచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జానపద కళారూపాలకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (ఆగస్టు 22) అంతర్జాతీయ జానపద విజ్ఞాన దినోత్సవం సందర్భంగా వాటిపై ప్రత్యేక కథనం.
ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 55 వేల మంది జానపద కళాకారులు ఉన్నారు. గరగ నృత్యం, డప్పు వాయిద్యం, కోలాటం తదితర ఆధ్యాత్మిక కళాకారులు దాదాపు ప్రతి ప్రాంతంలోనూ కనిపిస్తారు. పెద్దాపురం, కాకినాడలో తప్పెటగుళ్లు కళాకారులు, మాధవపట్నం, కొత్తపేటల్లో తోలుబొమ్మల కళాకారులు, పెద్దాపురం తదితర మెట్ట ప్రాంతాల్లో సాము గారడి, ఏజెన్సీ ప్రాంతాల్లో థింసా నృత్య కళాకారులు ఎంతో ప్రసిద్ధి చెందారు. జిల్లా వ్యాప్తంగా దళిత సామాజిక వర్గీయులు గారడీ నృత్యకళను తమ భుజాలపై వేసుకుని పోషిస్తున్నారు. రామచంద్రపురం ప్రాంతంలో బుర్రకథ, కపిలేశ్వరపురం మండలంలో గంగిరెద్దుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలు, గరగ నృత్యం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
పలు ప్రదర్శనలు
● రాజానగరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ కమిటీ ఆధ్వర్యాన ఈ ఏడాది ఫిబ్రవరి 5, 6 తేదీల్లో ఆదివాసీ సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ఆదివాసీ కళాకారులు నిర్వహించిన జానపద, లంబాడీ, థింసా, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
● ఈ ఏడాది ఏప్రిల్‌లో రావులపాలెంలోని కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్ (సీఆర్‌సీ) ఆధ్వర్యాన మూడు రోజుల పాటు 25వ ఉగాది ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహించగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఆర్‌సీ కృషిని సినీ నటులు తనికెళ్ల భరణి, గౌతం రాజు అభినందించారు. స్వేచ్ఛ, బ్రహ్మ స్వరూపం, జనరల్ బోగీలు అనే నాటకాలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.
● రాజమహేంద్రవరం సద్గురు సన్నిధి నిర్వహణలో శ్రీత్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్రాంగణంలో ఆగస్టు 3న జరిగిన అన్నమయ్య కీర్తనలకు డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ శిష్యులు నర్తించిన తీరు ఆకట్టుకుంది.
● రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో ఈ ఏడాది జూన్‌లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన 43వ అంతర్జాతీయ సంగీత నృత్య ఫెస్ట్ – 2025 అలరించింది. శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర, భారతీయ యువ సేవా సంఘ్ ఆధ్వర్యాన నిర్వహించిన ఫెస్ట్‌లో మలేషియా బృందం, 13 రాష్ట్రాల నుంచి 550 మంది కళాకారులు సంగీతం, నృత్య, జానపద కళారూపాలను ప్రదర్శించారు.
● పెద్దాపురం మండలం చంద్రమాంపల్లిలో స్నేహ ఆర్ట్స్ నాటక కళా పరిషత్ ఆధ్వర్యాన ఈ ఏడాది జనవరి 24న నాటక పోటీలు నిర్వహించారు.
● బిక్కవోలు మండలం కొంకుదురుకు చెందిన సీనియర్ రంగస్థల దర్శకుడు, నటుడు తాడి సూర్యనారాయణరెడ్డి (78) ఈ ఏడాది జూన్ 25న కన్నుమూయడం కళాకారులకు తీరని లోటు. ఆయన వెంకట రమణ ఆర్ట్స్ సంస్థకు ఆస్థాన దర్శకుడిగా ఉంటూ సినీ దర్శకుడు ఎస్‌వీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి నారాయణరావుతో కలిసి పనిచేశారు.
కళాకారులకు పురస్కారాలు
● విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిని పురస్కరించుకుని తెలుగు నాటక దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఏప్రిల్ 16న కార్యక్రమం నిర్వహించారు. రామచంద్రపురం మండలం ద్రాక్షారామానికి చెందిన నటి సరోజకు మంత్రి కందుల దుర్గేష్ చేతులు మీదుగా పురస్కారం అందజేశారు.
● సాతులూరులో ఈ ఏడాది మే 28న నిర్వహించిన జాతీయ స్థాయి నాటిక పోటీల వేదికపై ప్రత్తిపాడుకు చెందిన రంగస్థల మేకప్ కళాకారుడు కాతేటి నూకరాజు (థామస్)కు నటరత్న ఎన్టీఆర్ పురస్కారాన్ని అందజేశారు.
● న్యూఢిల్లీలో జనవరి 26న జరిగిన గణతంత్ర దినోత్సవంలో కోనసీమ జిల్లా మండపేట మండలం తాపేశ్వరానికి చెందిన గరగ నృత్య కళాకారుడు కొరివి కల్యాణ్, కొత్తపేట మండలం పలివెలకు చెందిన కొమారిపాటి ఏసు వెంకట ప్రసాద్ తమ కళను ప్రదర్శించారు. మొత్తం గణతంత్ర దినోత్సవాన్ని జాతీయ స్థాయి డాక్యుమెంటరీగా రూపొందించగా, వీరి కళా ప్రదర్శనకు అందులో స్థానం లభించింది. వీరిలో కొమారిపాటి ఏసు వెంకట ప్రసాద్‌కు ఈ ఏడాది ఏప్రిల్ 13న విశాఖపట్నం మదర్ థెరిసా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కళాజ్యోతి పురస్కారం దక్కింది. ఆయన ఆధ్వర్యంలోని బృందం ఒడిసా రాష్ట్రంలోని పూరీలో జరిగిన ఫోక్ ఫైర్ ఫెస్టివల్‌లో కళా ప్రదర్శనను ఇచ్చారు.
● కాకినాడలో ఈ ఏడాది జూలైలో జరిగిన అల్లూరి సీతారామరాజు నాటక కళాపరిషత్ రజతోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు నిర్వహించారు.
శిక్షణ శిబిరం
జానపద కళ పాతకాలం నాటిదే అయినా ఆధునిక కాలానికి అనుగుణంగా కళాకారులు ఎప్పటి కప్పుడు శిక్షణ పొందుతున్నారు. ఈ ఏడాది జూన్ 6న అమలాపురంలో ప్రజానాట్యమండలి కళాకారుడు శామ్యూల్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. పెద్దాపురం కళాకారుడు యాసలపు సూర్యారావు స్మారక భవన్‌లో ఈ ఏడాది జూన్ 21న కళాకారుల శిక్షణ శిబిరం నిర్వహించారు.
జగన్ ప్రభుత్వం చేయూత
గత వైఎస్సార్ సీపీ పాలనలో ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజాము ఆరు గంటలకే వలంటీర్లు.. కళాకారులకు ఇంటికెళ్లి పింఛన్ సొమ్ములు అందించేవారు. కరోనా మహమ్మారి సమయంలోనూ కళాకారుల పింఛను చెల్లింపును కొనసాగించారు. రంగస్థల సమాజాలు, పరిషత్‌లకు రూ.5 లక్షలతో వైఎస్సార్ రంగస్థల పురస్కారాలను ఇచ్చేందుకు కృషి జరిగింది. అప్పటి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు అభ్యర్థనపై కందుకూరి వీరేశలింగం జయంతి అయిన ఏప్రిల్ 16ను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాటక రంగ దినోత్సవంగా ప్రకటించారు.
జానపద కళలకు ఎంతో చరిత్ర
ఆనాటి సంప్రదాయాలకు ప్రతీక
నేటికీ కొనసాగుతున్న వైనం
ఉమ్మడి జిల్లాలో అనేక మంది కళాకారులు
రేపు అంతర్జాతీయ
జానపద విజ్ఞాన దినోత్సవం
కళాకారుల వినతులు
జానపద కళా పోషణ భారాన్ని ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించాలని కళాకారులు కోరుతున్నారు. కళనే నమ్ముకున్న తమకు పింఛన్ ఇవ్వాలని, కళా వేదికలను ప్రభుత్వమే అన్వేషించి ప్రదర్శనలను ఏర్పాటు చేయాలన్నారు. తుని మండలం కొత్తూరులో ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యాన ఈ నెల 1న నిర్వహించిన డప్పు కళాకారుల రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ డప్పు, చర్మకారుల సంక్షేమం కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కళా ప్రదర్శనకు మూడు ఎకరాల భూమి, రూ.ఏడు వేల పింఛన్, ఉచితంగా డప్పు, గజ్జెలు, దుస్తులను మాదిగ కార్పొరేషన్ ద్వారా సమకూర్చాలని డిమాండ్ చేశారు.

విజ్ఞానపదం

విజ్ఞానపదం