
ఎట్టకేలకు డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్
రాయవరం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు బుధవారం నోోటిఫికేషన్ విడుదల చేసింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆన్‌లైన్ విధానంలో డిగ్రీ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లాలో ఉన్న కళాశాలల్లో గతేడాది సుమారు 32 వేల సీట్లు భర్తీ అయ్యాయి. కోనసీమ జిల్లా విషయానికొస్తే.. రామచంద్రపురం, మండపేట, రావులపాలెం, ముమ్మిడివరం, రాజోలు, కొత్తపేట, ఆలమూరుల్లో డిగ్రీ కళాశాలలున్నాయి. ఇందులో సైన్స్, ఆర్ట్స్, కామర్స్, ఒకేషనల్ కోర్సుల్లో సుమారు 2,800 వరకు సీట్ల భర్తీకి అవకాశముంది.
షెడ్యూల్
విద్యార్థులు ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 25 నుంచి 28వ తేదీ వరకు స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్‌డ్/సీఏసీ/ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టవిటీస్/ఎన్‌సీసీ/గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వంటి స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్లు ఆయా యూనివర్సిటీల్లో ప్రాంతాల వారీగా నిర్వహిస్తారు. కోర్సులను ఎంపిక చేసుకోవడం కోసం ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. వెబ్ ఆప్షన్ల మార్పునకు ఈ నెల 29న అవకాశం కల్పించారు. ఈ నెల 31న సీట్ల అలాట్‌మెంట్, వచ్చే నెల ఒకటి నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
మూడే డిగ్రీ కోర్సులు
జాతీయ విద్యా విధానం–2020 నిబంధనలను అనుసరించి ఏపీ ఉన్నత విద్యా మండలి 2023 నుంచి నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులు ప్రవేశపెట్టారు. సంప్రదాయక మూడేళ్ల డిగ్రీ కోర్సుల స్థానంలో నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులు అమలు చేస్తున్నప్పటికీ, కొన్ని ప్రత్యేక కళాశాలల్లోనే నాలుగేళ్ల డిగ్రీ ఆఫర్ చేస్తున్నారు. మెజార్టీ కళాశాలల్లో మాత్రం మూడేళ్ల డిగ్రీ కోర్సులున్నాయి. నాలుగేళ్ల కోర్సుల్లో గతంలో మాదిరిగా మూడు మేజర్ సబ్జెక్టులు కాకుండా, ఒక్కటే ఉంటుంది. దీనిని సింగిల్ మేజర్ డిగ్రీ కోర్సులుగా పిలుస్తారు. ఉదాహరణకు గతంలో బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ మేజర్ సబ్జెక్టులుగా బీఎస్సీ చదువుకునే విద్యార్థి సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానంలో బీఎస్సీ బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీల్లో ఏదో ఒక సబ్జెక్టును ఎంచుకుని, తనకు నచ్చిన వేరే సబ్జెక్టును మైనర్ సబ్జెక్టుగా ఎంచుకుంటాడు. ఇంటర్‌లో ఆర్ట్స్, సైన్స్ సబ్జెక్టులతో సంబంధం లేకుండా, ఏ సబ్జెక్టునైనా మైనర్ సబ్జెక్టుగా ఎంచుకోవచ్చు. డిగ్రీ ఫస్టియర్ చదివి మానేసినప్పటికీ సర్టిఫికెట్ కోర్సు అని ధ్రువపత్రం ఇస్తారు. రెండేళ్లయితే డిప్లొమా సర్టిఫికెట్, మూడేళ్లయితే డిగ్రీ సర్టిఫికెట్, నాలుగేళ్లు చదివితే డిగ్రీ ఆనర్ సర్టిఫికెట్‌ను అందజేస్తారు. డిగ్రీ నాలుగేళ్లలో ఎప్పుడైనా మధ్యలో చదువు మానేసే వెసులుబాటు ఉంది. దానికి అనుగుణంగానే సర్టిఫికెట్లు అందజేస్తారు. ఫస్టియర్ నుంచి నాలుగేళ్ల లోపు ఏ దశలో చదువు మానేసినా, ఏడేళ్ల లోపు తిరిగి ప్రవేశం పొంది, విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం ఉంది. డిగ్రీ విద్యా విధానంలో ప్రవేశ పెట్టిన నూతన సింగిల్ మేజర్ ఆనర్స్ డిగ్రీ పద్ధతిపై ఇంటర్మీడియెట్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచే నూతన విద్యా విధానం అమలవుతుంది.
డిగ్రీ కళాశాలలు
జిల్లా ప్రభుత్వ ప్రైవేట్ అటానమస్
కోనసీమ 07 45 01
తూర్పుగోదావరి 06 40 01
కాకినాడ 05 46 03
సీట్ల కేటాయింపు ఇలా..
గతంలో డిగ్రీ అడ్మిషన్స్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ వారీగా నిర్వహించే వారు కాదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డిగ్రీ కోర్సుల్లో 50 శాతం రిజర్వేషన్లు తప్పనిసరి చేశారు. ఇంటర్మీడియెట్‌లో కామర్స్ ఓ సబ్జెక్టుగా చదివిన వారికి మొత్తం బీకాం కోర్సులో 60 శాతం సీట్లు కేటాయిస్తారు. అలాగే ఆర్ట్స్, హ్యుమానిటీస్‌లో ఇంటర్ పూర్తి చేసిన వారికి మొత్తం బీఏ సీట్లలో 50 శాతం, తక్కిన 50 శాతం ఇంటర్‌లో సైన్స్ గ్రూపు పూర్తి చేసిన వారికి కేటాయిస్తారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ(అక్ను) పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీకామ్, బీఎస్సీ సాధారణ కోర్సులతో పాటు, కంప్యూటర్, మార్కెట్ ఓరియంటెడ్, స్కిల్ ఓరియంటెడ్, ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. విద్యార్థులు aprche.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. సమీపంలో ఉన్న డిగ్రీ కళాశాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సాధారణ కోర్సులకు రూ.3 వేల వరకు, కంప్యూటర్ కోర్సులకు రూ.8–రూ.10 వేల వరకు ఫీజు ఉంటుంది.
సద్వినియోగం చేసుకోవాలి
డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తక్కువ ఫీజులతో, అన్ని రకాల సౌకర్యాలతో డిగ్రీ చదువుకునే వెసులుబాటు ఉంది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సదుపాయం అందుబాటులో ఉంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో అత్యధికంగా ఎంపికవుతున్నారు.
– డాక్టర్ సీహెచ్ రామకృష్ణ, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రామచంద్రపురం
అత్యున్నత ప్రమాణాలతో..
నాడు–నేడు పథకం ద్వారా డిగ్రీ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు సమకూరాయి. అత్యున్నత ప్రమాణాలతో డిగ్రీ కళాశాలల్లో తరగతి విద్యా బోధన జరుగుతుంది. అన్ని కళాశాలల్లో జవహర్ నాలెడ్జ్ సెంటర్, ప్లేస్‌మెంట్ సెల్స్ ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ కేపీ రాజు, ప్రిన్సిపాల్, వీకేవీ డిగ్రీ కళాశాల,
కొత్తపేట, కోనసీమ జిల్లా
రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల వారీగా
సీట్ల కేటాయింపు
ఆన్‌లైన్‌లో అభ్యర్థుల రిజిస్ట్రేషన్‌కు
26వ తేదీ తుది గడువు
వచ్చే నెల ఒకటి నుంచి
తరగతులు ప్రారంభం
ఈ ఏడాది నుంచి నూతన విద్యా విధానం

ఎట్టకేలకు డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్

ఎట్టకేలకు డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్