
గిరిజన విజ్ఞాన పరిరక్షణ అవసరం
● నన్నయ యూనివర్సిటీ
వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ
● గిరిజన ప్రాచీన విజ్ఞాన పరిరక్షణ సదస్సు
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆచార్య ప్రసన్నశ్రీ
సాంస్కృతిక ప్రదర్శన ఇస్తున్న విద్యార్థులు
రాజానగరం: భావితరాలకు గిరిజన విజ్ఞానాన్ని పరిరక్షించి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో గిరిజన ప్రాచీన విజ్ఞాన పరిరక్షణ, భవిషత్ తరాలకు చేర్చడం అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. గతాన్ని కాపాడుకోవడం ద్వారా భవిషత్తును శక్తిమంతంగా మార్చుకోవచ్చన్నారు. సమకాలీన సమాజంలో గిరిజన విజ్ఞాన వ్యవస్థలపై దృష్టి సారించడానికి ఈ సదస్సు దోహదపడుతుందన్నారు. శతాబ్దాలుగా సంస్కృతి, భాష, జ్ఞానాన్ని కలిగి ఉన్న గోదావరి తీరాన నిర్వహిస్తున్న ఈ సదస్సు గిరిజన నాగరికత గుర్తింపునకు పునాదిగా తోడ్పడుతుందన్నారు. గిరిజన సంస్కృతి, విజ్ఞాన సంపదను డాక్యుమెంటేషన్, డిజిటలైజేషన్ చేయాలన్నారు. ఈ సందర్భంగా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ (న్యూఢిల్లీ) ముద్రించిన గిరిజన సమరయోధులు, గిరిజన హక్కుల చిత్రపటాలను ఆంధ్ర వనవాసి కల్యాణాశ్రమ సహకారంతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను వీసీ ప్రారంభించారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యార్థులు, కళాకారులు ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రిజిస్టార్ ఆచార్య కేవీ స్వామి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుబ్బారావు, కన్వీనర్ డాక్టర్ ఆర్‌ఎస్ వరహాలదొర, కో–కన్వీనర్లు డాక్టర్ ఎం.గోపాలకృష్ణ, డాక్టర్ ఎలీషాబాబు, డాక్టర్ కె.రాజామణి, డాక్టర్ వి.రామకృష్ణ, డాక్టర్ ఎన్.సుజాత, రాజేశ్వరీదేవి, సమన్వయకర్త డాక్టర్ సాంబశిరావు, కేంద్రీయ విద్యాలయం అధ్యాపకులు పాల్గొన్నారు.

గిరిజన విజ్ఞాన పరిరక్షణ అవసరం